పేద విద్యార్థులకు అందని ప్రీ-ప్రైమరీ విద్య
ప్రభుత్వ ఆశయాలకు తూట్లు
అధికారుల నిర్లక్ష్యంతో విద్యా అవకాశాలకు గండి
నవతెలంగాణ – సిర్పూర్ (టి)
రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామాలు, గిరిజన గ్రామాలు, పేద కుటుంబాల్లోని చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించాలనే లక్ష్యంతో గత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వం ఆశయాలకు విరుద్ధంగా సిర్పూర్ మండలంలో ఈ కార్యక్రమం ఆశించిన స్థాయిలో అమలు కాకపోవడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని 16 గ్రామపంచాయతీల పరిధిలో మొత్తం 46 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. గత విద్యా సంవత్సరంలో నవేగాం, గంగయ్యగూడ, చింతకుంట, లోనవెల్లి, భూపాలపట్నం పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం మరిన్ని పాఠశాలల్లో ఈ విద్యను విస్తరించాలని నిర్ణయించినప్పటికీ మండలంలో కేవలం పాతట్లగూడ పాఠశాలలో మాత్రమే ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించడం పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులతో పాటు మారుమూల గిరిజన గ్రామాల చిన్నారుల్లోనూ నిరాశను మిగిల్చింది.
ప్రభుత్వం ప్రతి చిన్నారికి ప్రాథమిక విద్యను చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రీ-ప్రైమరీ వ్యవస్థను అమలు చేస్తుండగా, మండల స్థాయిలో సంబంధిత విద్యాశాఖ అధికారులు “యథారాజా తథా ప్రజా” అన్న చందంగా వ్యవహరిస్తూ తగిన ఆసక్తి, చొరవ చూపకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మండల విద్యాధికారి (ఎంఈవో) అర్హత కలిగిన మరిన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలు పేద విద్యార్థులకు అందకుండా పోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మారుమూల గిరిజన గ్రామాల్లోని చిన్నారులు ప్రాథమిక విద్యకు దూరమవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించి మండలంలోని మరిన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులను ప్రారంభించి పేద విద్యార్థులతో పాటు గిరిజన గ్రామాల చిన్నారులకు కూడా సమాన విద్యా అవకాశాలు కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.



