జాతీయ గేయాన్ని వివాదాస్పదం చేయొద్దు : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ప్రకటన
న్యూఢిల్లీ : జాతీయ గేయం విషయంలో ఇటీవల కేంద్రం విడుదల చేసిన ఆదేశాలపై సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో స్పందించింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనవసర వివాదాన్ని సృష్టించే యత్నం చేస్తున్నదని ఆరోపించింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ”జాతీయ గీతం కంటే జాతీయ గేయానికి ప్రాధాన్యతనిస్తూ కేంద్రం ఒక ఉత్తర్వు జారీ చేసింది. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించదు. జాతీయ జెండా, జాతీయ గీతాన్ని గౌరవించడం ప్రతి పౌరుడి విధి అని భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొంది.
క్షుణ్ణంగా చర్చించిన తర్వాత.. జాతీయ గేయం విషయంలో అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన ప్రకటనను రాజ్యాంగసభ ఆమోదించింది. దానిలో రెండు చరణాలు మాత్రమే పాడాలని నిర్ణయించింది. కానీ ప్రస్తుతం ప్రభుత్వం తన తాజా ఆదేశాలతో మిగతా నాలుగు చరణాలను కూడా చేర్చాలని చూస్తోంది. ఆ అదనపు చరణాలు భారత లౌకిక స్వభావానికి సరిపోవని అప్పట్లో రాజ్యసభ భావించింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అవసరం లేని వివాదాన్ని సృష్టిస్తోంది. ప్రభుత్వం రాజ్యాంగ భావాన్ని గౌరవించి వెంటనే ఆ ఆదేశాన్ని వెనక్కి తీసుకోవాలి. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలి” అని పొలిట్‌బ్యూరో పేర్కొంది.



