Sunday, June 14, 2026
E-PAPER
Homeజోష్అమలిన ప్రేమకథ  (ఎపిసోడ్ -1)

అమలిన ప్రేమకథ  (ఎపిసోడ్ -1)

- Advertisement -

“పిల్లలు దేవుళ్ళతో సమానం.ఆ దేవుళ్ళు బాగుపడితేనే సమాజం ముందుకెళుతుంది.పిల్లలు సున్నితమైన పూలు.చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.పరిమళాలు వెదజల్లడానికి, భయం లేకుండా కాలంతో పాటు పరిగెత్తడానికి. వారికి ఏ రంగంలో ఇష్టం ఉంటే ఆయా రంగాల్లో శిక్షణ ఇవ్వాలి. నవ్వించాలి. నవ్వమనాలి.ఈ సమాజంలోని సవాళ్ళను ఎదుర్కొంటూ బతకడమెలాగో నేర్పించాలి”అంటూ పాఠశాల వార్షికోత్సవంలో నుస్రత్ ఉపన్యాసమిస్తుంది. ఆ మాటలను వింటున్న పిల్లలు చప్పట్లు కొడుతున్నారు. స్టేజ్ ముందు అంతా నిశ్శబ్దం తాండవిస్తుంది. ఆ సన్నివేశాన్ని చూసిన ప్రిన్సిపాల్, టీచర్ల బృందం అంతా నిశ్చేష్టులై చూస్తున్నారు. మిగిలిన టీచర్లు మాట్లాడినప్పుడు చేసిన గోల లేదు. ఈలలు లేవు.వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పిల్లలు ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారు.

ఉపన్యాసం విన్న పిల్లలు రాత్రిపూట తమ హాస్టల్ గదుల్లో మాట్లాడుకుంటూ మనం  నుస్రత్ టీచర్ లా అవ్వాలని ఒకరు, అది కాదే అంతకన్న గొప్ప ఉద్యోగం సంపాదించాలని మరొకరు లక్ష్యాల దారుల్లోకి పాదం మోపుతున్నారు. ఎంతయినా నుస్రత్ మేడం దొరకటం మనం చేసుకున్న అదృష్టమే అనుకుంటూ ఆ రోజు వాళ్ళ కలల్ని నిజం చేసుకోవడానికో భరోసా దొరికిందన్న సంతోషంతో  నిద్రలోకి జారుకున్నారు.

ఆ  పిల్లలకు నుస్రత్ మేడం అంటే ఎంతో ఇష్టం. ఆమె చెప్పే పాఠాలంటే ఇంకా ఇష్టం.తల్లిదండ్రులను వదిలిపెట్టి చదువుతున్న పిల్లల్ని ఆ హాస్టల్ లో తల్లిలాగా చూసుకుంటుంది. వచ్చి కొద్ది రోజులే అవుతున్నా పాఠశాలలో ఉన్న మిగతా టీచర్లతో పోటీపడాలనే మనస్తత్వం తనది.తీసుకున్న జీతానికి న్యాయం చేయాలని ప్రతి సెకను బడి గురించే ఆలోచిస్తుంది. ఇలా ఆలోచించే వాళ్ళనుఎంతమందిని చూస్తాం.’బిల్ అండ్ బెల్ ‘లాగానే ఎంతోమంది పనిచేస్తుంటారు.స్వార్థం లేకుండా ఎంత మంది ఈ భూమి మీద జీవిస్తున్నారు. నిజంగా ఈ భూమి ఎక్కువగా మోస్తున్నది స్వార్థంతో నిండిన జీవులనే.

అంకితభావంతో పనిచేసే ఇలాంటి టీచర్లుంటే బడులు బాగుపడతాయి. విద్యావ్యవస్థబాగుపడుతుంది.అసలు ఏ వ్యవస్థను తీసుకున్న పనిచేసే వాళ్ళే కీలకమని మా తెలుగు మాస్టారు చెబుతుంటే వినేవాన్ని.ఇప్పుడు ఈమె రూపంలో చూస్తున్నాను. ప్రిన్సిపాల్ మేడం ఇలా పని చెబుతుందో లేదో అలా చేసిపడేస్తుంది. తనకు భర్తలేని విషయం మేడంకు తెలుసు. కన్న పిల్లలకోసం ఆరాటపడే తన తల్లి మనసు గురించి తెలుసు.అందుకే అప్పుడప్పుడు ఆరోగ్యం జాగ్రత్త అంటూ మందలిస్తుంది.నిజంగా తల్లి స్థానంలో ఎవర్ని ఊహించుకోలేం. కానీ హాస్టల్లో పిల్లలకు గురువే తల్లి. తల్లి లాంటి మనసున్న తల్లులుంటే పిల్లలకిక చదువుల పండుగే.

అందుకోసమే హాస్టల్ కు తల్లిదండ్రులు వచ్చి “మా పిల్లల బాధలను పట్టించుకుంటవటగద తల్లి. వాళ్ళు ఇంటికొచ్చినప్పుడు చెబుతుంటరు.నీకు నీ పిల్లలకు మంచే అయితదని దీవెనలిస్తరు”. ఉద్యోగం కోసం ఎంతో కష్టబడి చదివింది కనుక చదువు విలువ తెలిసిన టీచర్ గా పిల్లల్ని సరియైన దారిలో పెట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది.ఎంతమంది ఏం చెప్పినా తన దారి తనదే.తన ఆలోచనలు తనవే.మంచి చేసే వాళ్ళు ఏ దారిలో నడిస్తే ఏముంది. ముళ్ళువేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నా తట్టుకునే గుండె కూడా ఒకటుండాలి కదా. ఆ తెగువ ఈమెకుంది‌.

ఈ పాఠశాలలో టి.జి.టి గా ఉద్యోగంలో చేరింది. తను చెప్పాల్సిన అవసరం లేకపోయినా పదవతరగతి సోషల్ చెప్పేది.పి.జి.టి పోస్ట్ ఖాళీగా ఉండేది. అందుకని ఈమె మీద అదనపు భారం పడేది.వాస్తవానికి ఈమె బోధించాల్సింది ఎనిమిదవ తరగతి వరకే అయినా పిల్లలకోసమని తనే భారం మీదేసుకొని చక్కగా బోధించేది.కుటుంబమయినా, సమాజమయినా పని చేసే వాడినే పీక్కుతింటుంది. పని చేయని వాడు తేరగా తింటున్న పట్టించుకోదు. ఈమెను చూస్తే “నడిచే ఎద్దు” సామెత గుర్తుకొస్తుంది.

కొత్తగా వచ్చిన పోస్టుల్లో పి.జి.టి మేడం వచ్చింది.పిల్లలు నుస్రత్ సబ్జెక్టు విన్నవాళ్ళు కాబట్టి ఆమెను అర్థం చేసుకోలేకపోయేవారు. నుస్రత్ చెప్పినంత సులువుగా ఆమె చెప్పకపోయేది.పిల్లలు నుస్రత్ టీచరే కావాలని పట్టుబట్టేవారు. నుస్రత్ “అలా చేయడం తప్పు బేటా! ఆ టీచర్ కూడా బాగా చెబుతుంది. అలా చేయకూడదనేది”.ఆమె హృదయ సంస్కారం అంత గొప్పది మరి.

“కొంత తెలిస్తేనే ప్రపంచం మొత్తం తెలుసు నాకు అని ఎచ్చులకు పోయే కాలమిది.నిజంగా అంతా తెలిసినోడు నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటాడు.ఏమి తెలియనోడే ఎడాపెడా శబ్దం చేస్తుంటాడు. ” నుస్రత్ ది నిశ్శబ్దపు కోవ. ఆమెను బాగా తెలిసినవాడిగా” అంతలా కష్టపడకు.ఆరోగ్యం చెడిపోతుంది.నీ పిల్లల భవిష్యత్తు ఆగం అవుతుంది.కొంచెం చూసుకో” అని నేను హెచ్చరిస్తూ ఉంటాను.నల్లబల్ల మీద రాస్తున్న అక్షరాల్లో ఆనందాన్ని వెతుక్కుంటూ తాను నడిచొచ్చిన దారిలోని బాధనంతా మరిచిపోతుంది.ఇప్పుడిక పిల్లల్ని చూసుకుంటుంది.జాబ్ చేసుకుంటుంది.అసలు ఇంత సంతోషంగా ఉన్న నుస్రత్ జీవితంలో ఎంత విషాదముందో.ఎన్ని ఒడిదొడుకులున్నాయో నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియవు. ఎందుకంటే నేను ఆమెను ప్రేమించిన వాన్ని కాబట్టి. ఇప్పటికీ ఆమెను ఆరాధిస్తున్నవాన్ని కాబట్టి.

నేను చందర్. డిగ్రీ చదువుతున్నరోజులవి.రోజు సాయంత్రం పూట టైలర్ కొట్టు దగ్గరకూర్చునేవాన్ని.ఆ టైలర్ అంగి బాగా కుడుతాడు. దేశం మీద లేని ప్రయోగాలన్ని నా అంగి మీదనే చేసేటోడు.రెండు జేబులు పెట్టి స్టైల్ గా కుట్టేటోడు.గుండీలు కనబడకుండా పైనుంచి కింది దాకా క్లాత్ ను క్యాప్  లాగా వేసి కుట్టేవాడు. ఆపిల్ కట్ కుట్టే వాడు.కుట్టడంలో ఆరితేరినవాడు.కాలేజీకెళ్తే నా అంగిలమీదనే ముచ్చటంత.

వయసు అలాంటిది.తనను తాను చూపించడం కోసం అబ్బాయిలు, తమ అందాన్ని పొగిడించుకోవాలని అమ్మాయిలు పోటి పడి ముస్తాబయ్యే కాలం.యుక్త వయస్సు.బొట్టు బిళ్ళ నుంచి డ్రెస్ దాకా మ్యాచింగ్ వేసుకెళ్ళాలనే ఆరాటం.రంగురంగుల అంగీలతో టక్ చేసుకుని తనని తానే చూసుకొని మురిసిపోయే ఆనందం. అందుకే నా డ్రెస్ లు చూసినవారంతా ఆ టైలర్ ను పొగడ్డమే సరిపోయేది.

అది సుమారుగా 2004 సంవత్సరం.ఆ షాప్ దగ్గర మిత్రులమంతా కూర్చునేవాళ్ళం. ఎక్కడెక్కడి విషయాలో చర్చకొచ్చేవి.క్రికెట్ గేమ్ గురించి ఎక్కువగా మాట్లాడే వాళ్ళం.నాకు క్రికెటంటే అదో పిచ్చి.2003 వరల్డ్ కప్ పోటీలు జరిగినపుడు ఇండియా మ్యాచ్ జరిగినప్పుడల్లా నోట్స్ లో బ్యాటింగ్, బౌలింగ్ స్కోర్ లు వేసే వాన్ని.క్రికెట్ మొదలయ్యేటప్పటినుంచి మ్యాచ్ అయిపోయేవరకు అన్నం గిన్నె ఖాళీ చేసేవాన్ని.కూరల అవసరం కూడా పడేది కాదు.మామిడికాయ పచ్చడ ఇంత నూనె చాలు.

“నచ్చింది ఏది కళ్ళ ముందు కనబడినా మైమరిచి పోతాం.ఏం చేస్తున్నామో అర్థం కాదు.నచ్చడానికి, నచ్చకపోవడానికి మధ్య ఉండే కారణం “చేసే పని పట్ల ఇష్టమే తప్ప”  వేరే ఏమి కాదు.

” క్రికెట్ చూడడమనే ఇష్టంలో నేనేం చేస్తున్నానో నాకే తెలియక పోయేది.అమ్మ చేతిలో ఆ రోజిక తిట్ల సిక్స్ లు,ఫోర్లు కూడా తినేవాన్ని.

స్నేహితులంత ఇదేం మాయరోగంరా నీకు. స్కోర్ టీవీలో కనబడుతుంటే ఇంకా నువ్వు ఏసుడేంది. నీకు ఈ పిచ్చి ఏందిరా బాబు అనేవాళ్ళు.క్రికెట్ గురించే కాకుండా అమ్మాయిల, అబ్బాయిల ప్రేమ విషయాలతో సహా అన్ని ఆ టైలర్ కొట్టు దగ్గరే మాట్లాడుకునేవాళ్ళం.

రోజు సాయంత్రం కాలేజీ వదిలే సమయమది.చాలా మంది కాలేజీ విద్యార్థులు అక్కడినుండే వెళ్ళేది. అమ్మాయిలు అక్కన్నుంచి ఎంతోమంది వెళ్తుండేవారు.మేం అంతగా పట్టించుకునేవాళ్ళం కాదు.నాకు బాగా పాటలు పాడే అలవాటు.చక్రి సినిమా పాటలు, ఆర్.పి పట్నాయక్ పాటలు నడుస్తున్న కాలమది. విడుదలయి రెండు,మూడు సంవత్సరాలయినా పాటల పస తగ్గేది కాదు.క్యాసెట్ల కాలమది. క్యాసెట్లో ఆరు పాటలుండేవి. A సైడ్ మూడు పాటలు, B సైడ్ మూడు పాటలు. అప్పుడప్పుడు క్యాసెట్ చిక్కు బడితే రెనాల్డ్స్ పెన్ పెట్టి తిప్పి క్యాసెట్ సరిజేసేవాళ్ళం. స్పీకర్ కు కుండబెట్టి డిజిటల్ సౌండ్ లాగా ఫీలయ్యేవాళ్ళం. ఆ టైలర్ కొట్టులో వినని కొత్తపాటలు లేవు. నేను పాడని పాట లేదంటే అతిశయోక్తి కాదు. రోజూ ఆ టైలర్ దగ్గరే కూర్చోవడం పిచ్చాపాటిగా మాట్లాడుకోవడం జరిగేది. ఆ టైలర్ నాకంటే సీనియర్.అతని దోస్తులు కూడా డిగ్రీ కాలేజీలో నా ఫ్రెండ్స్.అందరం అక్కడే గుమిగూడేవాళ్ళం.మిషిన్ తొక్కి తొక్కి అలసిపోయిన అతను ఓ నైన్టీ గుద్దుతుంటే మిర్చీలు మేయటం మా వంతు.ఏమో గాని ఎంతమందితో స్నేహం చేసిన  చెడు అలవాట్ల బారిన పడలేదు.

ఓ రోజిలానే సాయంత్రం వెళ్ళి కూర్చున్నాను. టైలర్ సమద్, నుస్రత్ అనే అమ్మాయి గూర్చి మాట్లాడుతున్నాడు.

(వచ్చే వారం కలుద్దాం)..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -