నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల కేంద్రంలో ఆదివారం కురిసిన వర్షానికి ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు నీటితో నిండిపోయి కుంటలను తలపించాయి. మండల సామాజిక ఆరోగ్య కేంద్రం, తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, ప్రాథమిక పశు వైద్య కేంద్రం, పోలీస్ స్టేషన్, మహిళా సంఘం కార్యాలయాలకు వెళ్లాలంటే ముందు వర్షపు నీరు దాటుకుంటూ వెళ్లవలసిన పరిస్థితి నెలకొంది నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చిన ప్రజలు బురద, నిల్వ నీటిని దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వృద్ధులు, మహిళలు, ద్విచక్ర వాహనదారులు మరింత ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ సమయంలో సంబంధిత శాఖల అధికారులు, ఇంజినీర్లు సరైన ప్రణాళికతో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉంటే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటున్నప్పటికీ శాశ్వత చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు సేవలు అందించాల్సిన కార్యాలయాలే ఇబ్బందులకు కారణమవడం బాధాకరమని, నిల్వ నీటి సమస్యను వెంటనే పరిష్కరించి ప్రజలకు అనుకూల వాతావరణం కల్పించాలని మండల ప్రజలు అధికారులను కోరుతున్నారు.



