ప్యాలిండ్రోమ్ (palindrome)) కు సమానార్థకమైన ఒకే పదం (single word) తెలుగులో లేదు. ఎవరో ఒకాయన తిరుగు నుడి అనే మాటను సూచించాడు. మరొకాయన చిత్రపదం, చిత్రవాక్యం అన్నాడు. కానీ ఇవి పాక్షికంగా మాత్రమే సరిపోతాయి. ఇరువైపులా ఒకేవిధంగా వచ్చే పదం లేదా పదబంధం, అని ఎక్కువ మాటలలో చెప్పవచ్చు. ఇలా ఎడమ నుండి కుడికి చదివినా కుడి నుండి ఎడమకు చదివినా మారని పదాలు, పదబంధాలు తెలుగులో కూడా ఎన్నో ఉన్న సంగతి మనకు తెలుసు. కిటికి, కంటకం, తర్వాత, మిసిమి, వికటకవి మొదలైనవి ఉదాహరణలు. ఇంగ్లిష్‌లో ఇవి చాలా పొడవుగా, వాక్యాల రూపంలో కూడా ఉండవచ్చు. అయితే వాటిని తిరగేసినప్పుడు పదాల నిడివి, వాటిమధ్య ఖాళీలు, విరామ చిహ్నాలు ఒకే విధంగా ఉండకపోవడం మామూలే – ద హిందు క్రాస్‌వర్డ్ పజిళ్లలోని ఆధారాలలాగా.
దీన్ని పరిశీలించండి: No, it never propagates if I set a gap or prevention. . మరొక ఆసక్తికరమైన ప్యాలిండ్రోమ్ Able was I ere I saw Elba. ఇక్కడ able అంటే సమర్థవంతమైన, ere అంటే before, Elba ఒక అమ్మాయి పేరు. ఎల్బా అనే అమ్మాయిని చూడకముందు నేను సమర్థుడిగా ఉండేవాడిని అన్నది వాక్యార్థం. ఈ వాక్యాన్ని నెపోలియన్ నుడివినట్టు చెబుతారు కానీ ఇందులో నిజం లేదు. ఇటువంటి ఎన్నో వాక్యాలున్నాయి ఇంగ్లిష్‌లో. ప్యాలిండ్రోములను ఆంగ్లేయులు సాహిత్య సాధనాల జాబితాలో చేర్చారు. అర్థానికి లేదా అక్షరానికి అన్వయించి చూసినప్పుడు, ప్యాలిండ్రోమ్‌ను చియాస్మస్‌లోని ఒక రకంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ప్యాలిండ్రోములను గ్రాఫిక్ ప్యాలిండ్రోములు, భావపరమైన ప్యాలిండ్రోములు అని రెండు రకాలుగా విభజించవచ్చు.
ప్యాలిండ్రోములకు సాహిత్యస్థాయిని కల్పిస్తూ ఆంగ్లరచయితలు వాటిని సాహిత్య సాధనాల ( literary devices) కింద జమ చేయడం మనకు కొంచెం ఆశ్చర్యం కలిగించక మానదు. అందుకే వాటి సంఖ్య 130 దాకా ఉందని అనుకోవాలి. చైతన్య స్రవంతి శిల్పంలో ఈ వ్యాస రచయిత రాసిన సందర్శనం అనే కథలో చివర్న స్పూనరిజం లాంటి ఇతర భాషావిశేషాలతో పాటు చాలా ప్యాలిండ్రోములు చోటు చేసుకున్నాయి. అవి ప్రధాన పాత్ర (protagonist) మననం చేసుకున్న ఆంతరిక సంభాషణ (internal dialogue) లోని భాగాలు. చూడండి: ”భాషావిశేషాల వేషాల తమాషాలు గోషాలు రాల్చుకుని బయటికొచ్చినరు. ప్యాలిండ్రోములు చూడండీ ప్యాలిండ్రోములు. టమాట పులుపు కనుక వాడవా? లోయలో తూగుతూ పైరుపై వాలావా? వారెవా వికటకవి మిసిమి విరివి. కులుకు జలజ పాపా కులుకు. కిటికి నిశాని వేడవే. ప్యాలిండ్రోములు బాబూ ప్యాలిండ్రోములు.”
చియాస్మస్ (chiasmus) కు కూడా తెలుగులో ఒకే మాటను సూచించలేం. విపర్యయ వాక్యవిన్యాసం అన్నారు కొందరు. ఇందులో, X అనే అక్షరాన్ని నిలువులో రెండు సగాలుగా విభజించినప్పటిలాగా మొదటి సగంలోని మొదటి భాగం రెండవ సగంలోని రెండవ భాగానికి, మొదటి సగంలోని రెండవ భాగం, రెండవ సగంలోని మొదటి భాగానికి అచ్చు గుద్దినట్టుగా కాకపోయినా చాలా వరకు సరిపోతాయి. X ఆకారాన్ని గ్రీకుభాషలో చి అని వ్యవహరిస్తారు. అందుకే దీనికి చియాస్మస్ అనే పేరు స్థిరపడిపోయింది. వాక్యభాగాల మార్పిడితో అవి అచ్చు గుద్దినట్టుగా సరిపోతే అప్పుడు దాన్ని antimetabole అనే పేరుతో పిలవాలి. ”ªFlowers are lovely, love is flowerlike” అనే టి.ఎస్. కోలరిట్జ్ వాక్యం మామూలు చియాస్మస్‌కు చక్కని ఉదాహరణ. అదే విధంగా ‘Works without show, and without pomp presides” అనే పోప్ వాక్యం. ఇందులో pomp కు show, preside, అనే అర్థాలు వర్తిస్తాయి. మిల్టన్ కవిత Lycidas లోని ఈ పంక్తిని కూడా చియాస్మస్‌గా వ్యవహరిస్తారు: ”fresh Woods, and Pastures new”
చియాస్మస్‌కు తెలుగులో ఉదాహరణలు: నవ్వుతూ బతకాలి, బతికినంత కాలం నవ్వాలి. పెళ్లి జరగాలంటే పిచ్చి కుదరాలి, పిచ్చి కుదరాలంటే పెళ్లి జరగాలి. అనుభవం ఉంటేనే ఉద్యోగం దొరుకుతుంది, ఉద్యోగం చేస్తేనే అనుభవం వస్తుంది. పై రెండింటిని ఇంగ్లిష్‌లో catch 22 situations అని కూడా అంటారు. కానీ ఇవన్నీ సాహిత్యపరమైనవి కావు. పైగా ఇవి antimetaboleఅనే ప్రత్యేక చియాస్మస్ రకం కిందికి వస్తాయి. ఇతర సాహిత్య సాధనాలతో పోల్చిచూసినప్పుడు తెలుగు కవిత్వంలో చియాస్మస్ వచ్చిన సందర్భాలు తక్కువే. జి. వెంకటకష్ణ రాసిన డాలర్ పాఠాలు కవితలోని ఈ కింది నాలుగు పంక్తులలోని చివరి రెండు క్లాసికల్ చియాస్మస్‌ను సూచిస్తున్నాయి:
యుద్ధమూ మార్కెట్/ డాలర్‌కు రెండు తలుపులు
మార్కెట్లో యుద్ధముంటుంది/ యుద్ధంలో మార్కెట్ వుంటుంది
దృష్టి మాత్రమే అనే బి.వి.వి. ప్రసాద్ కవితలోని ఈ స్టాంజాను చూడండి:
ఇవాళ్టి ఉత్సవ సంగీతంలో/ రేపటి విషాదస్వరాల నీడలుంటాయి
రేపటి విషాదస్వరాల వెనుక/ మరునాటి ఉత్సవ సంగీతపు కాంతులుంటాయి
డాక్టర్ ఎన్. గోపి రాసిన అరాఫత్ కీ యాద్ మే అన్న కవితలోని ఈ పంక్తులు కూడా గమనింపతగినవే:
ఒక మహాస్వప్నాన్ని వొదిలి/ దేహం వెళ్లిపోయింది
స్వప్నం/ లక్ష శరీరాలను తొడుక్కుంటుంది
చియాస్మస్ మన మెదడును అప్రమత్తం చేసి జ్ఞాపకశక్తిని పెంచుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక దిశలో ఊహించిన భావం వెంటనే వ్యతిరేక దిశలో కనిపిస్తుంది. అందుకే రాజకీయ ప్రసంగాలలో, నినాదాలలో, నైతిక సూక్తులలో చియాస్మస్ విరివిగా దర్శనమిస్తుంది.
ఎలనాగ



