నవతెలంగాణ – హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఈరోజు బతికి ఉంటే బీజేపీ వంటి పార్టీని నిషేధించేవారని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చాలా ప్రమాదకరంగా మారాయన్నారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. మతపరమైన విద్వేషాలను అధికారంలో ఉన్నవారే ఉద్దేశపూర్వకంగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ హిందుత్వ పేరుతోనే రాజకీయాలు చేస్తోందని గెహ్లాట్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థికీ టికెట్ ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ కనీసం కొన్ని స్థానాలైనా కేటాయించి ఉంటే దేశానికి వేరే సందేశం వెళ్లేదని అన్నారు. హిందుత్వ మద్దతుదారులను రెచ్చగొట్టి అధికారంలో కొనసాగాలనే ఆలోచనతో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘‘ఇందిరా గాంధీ వంటి బలమైన నాయకురాలు ఇప్పుడుంటే బీజేపీపై నిషేధం విధించేవారు. కేవలం హిందుత్వ అజెండాతోనే పార్టీని నడపాలనుకుంటున్నారా? హిందువుల పేరుతోనే రాజకీయాలు చేయాలనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించారు.



