ఆలోచించాలి..దేశాన్ని రక్షించుకోవాలి
ట్రంప్, మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి
యువతలో అభ్యుదయ, హేతువాద, లౌకిక,
సోషలిస్టు భావాలను పెంపొందించాలి
ప్రజల మధ్య ఉండి వారి సమస్యలపై పోరాడాలి : సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్/రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
యువతే దేశ భవిష్యత్తు అనీ, దేశాన్ని రక్షించుకోవాలని సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు పిలుపునిచ్చారు. ట్రంప్, మోడీ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై పోరాడాలని ఆయన కోరారు. యువతలో అభ్యుదయ, హేతువాద, లౌకిక, సోషలిస్టు భావాలను పెంపొందించడంలో డీవైఎఫ్‌ఐ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలం కొత్తపేటలోని బాబు జగ్జీవన్‌రాం భవన్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించిన యువజన సమ్మేళనంలో రాఘవులు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నేటి యువత దేశ, ప్రపంచ రాజకీయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోందనీ, అదే సమయంలో పెద్ద ఎత్తున రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నదని తెలిపారు. ఆ యువతను అభ్యుదయ భావజాలం వైపు మళ్లించాలని డీవైఎఫ్‌ఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబా ద్‌లోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం ఉన్న రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుబట్టారు. ఇరాన్‌పై యుద్ధానికి, మన దేశంలో పెట్రోల్, డీజిల్, ఎరువులు ధరలు పెరగడానికి, హార్మూజ్ జలసంధిలో మన నౌకపై దాడిచేసి ముగ్గురు భారతీయుల ప్రాణాలు తీయడానికి, హెచ్1బీ1 వీసాపై ఆంక్షలు పెట్టడానికి కారణమైన ట్రంప్ పేరును హైదరాబాద్‌లోని రోడ్డుకు పెట్టడం ఏంటి అని నిలదీశారు. ఆ పేరును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. దేశానికి ఇంత అన్యాయం జరుగుతున్నా మోడీ ఇంకా ట్రంపు భక్తిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
ప్రపంచ వ్యాప్తంగానూ అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యువత ఆలోచిస్తున్నదని తెలిపారు. ఇజ్రాయిల్ ఇంటిలిజెన్స్ వ్యవస్థ కోసం గూగుల్ సాంకేతిక వ్యవస్థ పనిచేయడాన్ని తప్పుబడుతూ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గూగుల్ సంస్థ చైర్మెన్ సుందర్ పిచ్చాయ్ ప్రసంగాన్ని విద్యార్థులు బాయ్‌కాట్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇరాన్ అయిపోగానే క్యూబానే టార్గెట్ అని ట్రంప్ చెప్పడం దుర్మార్గమన్నారు. క్యూబాకు అండగా నివాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 50 లక్షల జనాభా ఉన్న క్యూబా అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. దివిటిలా ఉన్న క్యూబా తన వెలుతురును మరిన్ని దేశాలకు విస్తరిస్తుందనే భయం అమెరికాను వెన్నాడుతున్నదన్నారు. సోషల్‌మీడియాను అభ్యుదయ శక్తుల కంటే విచ్ఛిన్నకర శక్తులు ఎక్కువ ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు. యువత మత్తుకు బానిస కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో సైద్ధాంతిక, సాంస్కృతిక పోరాటాలు ఉధృతం కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాపాంగణాలు, పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కల్పన కోసం ఫోకస్ పెట్టి పనిచేయాలనీ, ఆటల పోటీలను రెగ్యులర్‌గా నిర్వహించాలని డీవైఎఫ్‌ఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. యువతకు దగ్గరకు అయినప్పుడే వారు మనం చెప్పేది వింటారని చెప్పారు.
ప్రత్యామ్నాయం కోసం రోడ్లెక్కుతున్న యువత పక్షాన పోరాడుతాం : డీవైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఏఏ.రహీం
మోడీ సర్కారు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందనీ, యువత శక్తి సామర్థ్యాలను, సృజనాత్మకతను ఉపయోగించుకోవడంలో పాలకులు విఫలమయ్యారని డీవైఎఫ్‌ఐ అఖిల భారత అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఏ.ఏ.రహీం విమర్శించారు. దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నదని నిటిఅయోగ్, తదితర సంస్థలు ఎత్తిచూపుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఉద్యోగకల్పనలోనూ, పరిశ్రమల ఏర్పాటులోనూ మోడీ సర్కారు విఫలమైందన్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నదనీ, ఉన్న సంస్థల్లోనూ రెగ్యులర్ ఉద్యోగులను కాకుండా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను నియమిస్తున్నదని విమర్శించారు. ఉపాధి అవకాశాల్లేక పీహెచ్‌డీ, ఎంటెక్, బీటెక్ చదివిన వాళ్లు కూడా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ వేదికలపై ఉద్యోగాలు చేస్తున్నారనీ, దేశంలో గిగ్ ఎకనామీ పెరిగిపోతున్నదని చెప్పారు. అయితే, అక్కడా యువత ఉద్యోగాలకు గ్యారంటీ లేదనీ, స్థిరమైన జీతాలు లేవని ఎత్తిచూపారు.
మన దేశంలో విద్యావ్యవస్థ ఫెయిల్యూర్ అయిందని విమర్శించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ఆగమయ్యాయనీ, ఆరుగురు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులెవరు? అని ప్రశ్నించారు. బాధ్యత వహించకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇంకా పదవిలో ఉండటాన్ని తప్పుబట్టారు. గౌరవప్రద జీవితం, భవిష్యత్తు కావాలని యువత కొట్లాడుతుంటే, ప్రశ్నిస్తుంటే దేశ ద్రోహులు, విదేశీ ఏజెంట్లు అనే ముద్ర వేస్తుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ సర్కారు, సంఘ్‌పరివార్ శక్తులు దేశంలో ప్రజలను కులం, మతం, ప్రాంతం పేరుతో విభజించి రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఇలాంటివి ఎక్కువ కాలం చెల్లుబాటు కావనీ, నేటి యువత ప్రత్యామ్నాయ రాజకీయ విధానం కోసం రోడ్లెక్కుతున్నదని తెలిపారు. పాలకుల విధానాలతో విసిగివేసారేసి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా జెన్‌జీ రోడ్లెక్కుతున్నదన్నారు. యువతలో శాస్ర్తీయ దృక్పథాన్ని పెంపొందించడానికి, రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకికతత్వం పరిరక్షణకు డీవైఎఫ్‌ఐ ముందుండి పోరాడుతుందని ప్రకటించారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం బలమైన పోరాటాలు : డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్
దేశంలో, రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం బలమైన పోరాటాలను రూపొందిస్తున్నామని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్ తెలిపారు. సమాజ మార్పు కోసం జరుగుతున్న పోరాటంలో యువత కీలక భూమిక పోషిస్తోందన్నారు. దేశంలో నెలకొన్న దోపిడీ వ్యవస్థ, మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. గ్రామ స్థాయి నుంచి యువతను రాజకీయంగా చైతన్య పరిచేందుకు కృషి చేస్తామన్నారు. రేవంత్‌రెడ్డి సర్కారు యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనీ, రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తు పోరాటాలకు రాష్ట్ర వ్యాప్తంగా యువతను చైతన్యపరుస్తూ ఉద్యమాలను ఉధృతం చేసే దిశగా సన్నద్ధమవుతున్నామని తెలిపారు. అమెరికా రాయబారి కార్యాలయ ప్రాంతంలోని రోడ్డుకు ట్రంప్ పేరును వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున్న ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు.
మూఢత్వ పాలనను కూల్చేయాలి : డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్
దేశంలో కులం, మతం పేరుతో మోడీ సర్కారు మూఢత్వ పాలన చేస్తున్నదని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ విమర్శించారు. మూఢత్వ పాలనలో ప్రజలు అసమానతలకు గురవుతున్నారని చెప్పారు. యువత దేశం కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. యవ్వన తరంలోనే ప్రాణాలు కోల్పోయిన చరిత్ర దొడ్డికొమురయ్య, భగత్‌సింగ్‌కు ఉందని చెప్పారు.
నిరుద్యోగుల విషయంలో బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఉచిత సలహాలు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ముందు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసి మిర్చీలబండి పెట్టుకుని యువతకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. అమెరికా కాన్సులేట్ ఉన్న ప్రాంతంలోని రోడ్డుకు ట్రంప్ పేరును వెనక్కి తీసుకోవాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టగా యువజన సమ్మేళనం ఏక్రగీవంగా ఆమోదించింది.
యువసమ్మేళనం తెలంగాణకు తలమానికం : సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రంగారెడ్డి జిల్లాకు చరిత్ర ఉందనీ, ఇబ్రహీంపట్నం ఏరియాలో ఎంతో మంది త్యాగాలు చేశారని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య గుర్తుచేశారు. దేశంలో నెలకొన్న అసమానతలు, దోపిడీ వ్యవస్థపై ఉద్యమించేందుకు తలపెట్టిన యువసమ్మేళనం రాష్ట్రానికి తలమానికం కానున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇదే ప్రాంతంలో రాహుల్ గాంధీ సమక్షంలో నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడుతుండటం, జీవితాలను ఆగం చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ నివారణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈ యువజన సమ్మేళనంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత డీజీ నర్సింహారావు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భాస్కర్, రాంచందర్, జగన్, జగదీశ్, స్యామేల్, డీవైఎఫ్‌ఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జగన్, తదితరులు పాల్గొన్నారు.
డిఫెన్స్‌లో సామ్రాజ్యవాదం.. సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించే శక్తులు ప్రపంచ వ్యాప్తంగానూ బలపడుతున్నాయనీ, ఎర్రజెండా నేతృత్వంలోని చైనా వాటికి అండగా ఉంటున్నదని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం చేస్తుంటే ఎక్కడా తగ్గకుండా అంతే తీవ్రతతో ప్రతిఘటిస్తోందనీ, దీంతో సామ్రాజ్యవాదం డిఫెన్స్‌లో పడిపోయిందని తెలిపారు. ట్రంప్‌నకు మద్దతిస్తున్న మోడీ ప్లేటు ఫిరాయించే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయన్నారు. ఇజ్రాయిల్ నరమేధానికి ఇండియా, యూఎస్‌ఏ తప్ప ఏ దేశం కూడా మద్దతు తెలపడం లేదన్నారు. మతతత్వ రాజకీయాలకు క్రమంగా కాలం చెల్లుతున్నదనీ, సీజేపీ పోరాటంతో మోడీ సర్కారులో వణుకు మొదలైందని చెప్పారు. నిరుద్యోగ సమస్య, దేశ సొమ్మును కార్పొరేట్లకు మోడీ సర్కారు దోచిపెడుతున్న తీరుపైనా, ప్రజల పక్షాన నికరంగా నిలబడి కొట్లాడుతున్నదెవరనే దానిపైనా యువత ఆలోచించడం మొదలు పెట్టిందన్నారు. పేదల పక్షాన కొట్లాడుతున్న సీపీఐ(ఎం)కు మంచిరోజులు రాబోతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారం, పదవుల్లో ఉన్నప్పుడు కాకుండా కష్టకాలంలో పార్టీ కోసం నిలబడ్డ వారే నిజమైన కమ్యూనిస్టు అని చెప్పారు. ప్రజల్లో పనిచేయాలంటే నిరంతర అధ్యయనం అవసరమని నొక్కి చెప్పారు. మార్క్సిజాన్ని ఆకళింపు చేసుకుంటేనే మానవ సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతామన్నారు. శాస్ర్తాలన్నింటికీ మూలం మార్స్కిజమేనని చెప్పారు.
యువత బుల్డోజర్ వ్యవస్థపై కన్నెర్ర చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
ప్రపంచానికి, దేశానికి కండ్ల లాంటి యువత అనీ, దేశం, ప్రపంచంలో నెలకొన్న అసమానతలు, లౌకికతత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థపై బుల్డోజర్ వ్యవస్థ చేస్తున్న దాడులపై ప్రతిఘటన ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి జాన్‌వెస్లీ నొక్కిచెప్పారు. పాలకుల విధానాలతో దేశ సంపద కొంత మంది చేతుల్లో పోగుపడుతున్నదనీ, 90 శాతం ప్రజలు పేదరికంలోకి నెట్టబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అసమానతలపై గళమెత్తేందుకు యువత సన్నద్దం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి లేకుండా ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడంలో వారి బతుకులు ఛిద్రం అవుతున్నాయని, ఇలాంటి దుర్మర్గాపు విధానాలపై యువత ఉద్యమాలు చేయాలన్నారు. విద్యా, వైద్యం వ్యాపారమైందనీ, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో యువత గ్రామీణ ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో ప్రభుత్వ రంగ సంస్థలు పాఠశాలలు, ఆస్పత్రులను సందర్శించాలని పిలుపు నిచ్చారు. అక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కారించే విధంగా క్రీయాశీలక పాత్ర పోషించాలన్నారు. మతోన్మాద రాజకీయాల నుంచి లౌకికభావాన్ని కాపాడుకోవాల్సిన బాధత్య ఈ దేశ యువతపై ఉందన్నారు. పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టుల వెంట్రుకకు కూడా సరితూగడన్నారు. తెలంగాణలో ఎర్రజెండా చరిత్రను చెప్పడం కాదు… మరో చరిత్రను సృష్టించాలని పిలుపునిచ్చారు. త్వరలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఉండనుందన్నారు.
అంతరాలు లేని సమాజం కోసం యువత పోరాడాలి ఎస్‌ఎఫ్‌ఐ గర్ల్స్ కన్వీనర్ ఎమ్.మమత
అంతరాలు లేని సమాజం కోసం యువత పోరాటాల్లోకి రావాలని ఎస్‌ఎఫ్‌ఐ గర్ల్స్ కన్వీనర్ ఎమ్.మమత పిలుపునిచ్చారు. ఆస్పత్రులకు వెళ్లితే వచ్చిన వాహనం, ఆర్థికం, రాజకీయ పరపతి చూసి వైద్యం అందుతుండటం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు లేకపోతే పేదవాళ్లు చావాల్సిందేనా అని ప్రభుత్వాలను ప్రశ్నించారు. విద్య కూడా డబ్బులు ఉన్నవారికి ఒకలా.. పేదవారికి మరోల అందుతుందన్నారు. ఈ అసమానతాలకు ప్రభుత్వాలే కారణమన్నారు. ప్రభుత్వ ఆధీనంలో విద్య, వైద్యం ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రభుత్వ ఆధీనంలోనే విద్యా, వైద్య వ్యవస్థలు ఉండాలని సీపీఐ(ఎం) ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుందన్నారు. అమ్మాయిలు రాజకీయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు.
వెట్టి, బానిసత్వాన్ని రద్దు చేసిన చర్రిత తెలంగాణ గడ్డది : సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై యువత మేలుకోవాల్సిన అవసరం ఉందని, అప్రజాస్వామిక వ్యవస్థలను కూలదోసే శక్తి యువతకు ఉందని సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. స్వాతంత్య ఉద్యోమంలో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో యువకులైన భగత్ సింగ్, దొడ్డి కొమరయ్య పోరాటం స్ఫుర్తిదాయకమన్నారు. దేశంలో ఏ పోరాటంలోనైనా యువతదే కీలక పాత్ర అన్నారు. తెలంగాణకు పోరాట గడ్డగా చరిత్ర ఉందని, యువ సమ్మేళనం తెలంగాణ రాష్రానికే కాదు దేశానికి శంఖారావం కావాలన్నారు. యువత దేశంలో నెలకొన్న దోపిడీ, అసమానతలపై ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో ప్రజాస్వామాన్ని కాపాడుకోవాల్సి అవసరం యువతపై ఉందన్నారు. సాయిధ పోరాటంలో వెట్టిచాకిరి, బానిసత్వాన్ని, నిజాం నిరంకుశత్వాన్ని పారదోలిన చరిత్ర ఎర్రజెండాకు, ఈ ప్రాంత యువతకు ఉందన్నారు. కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వ విధానాలపై యువత గళమెత్తాల్సిన సమయం అసన్నమైదన్నారు.



