ఐఆర్‌ఎఫ్‌సీ రుణం విడుదలలో జాప్యం వద్దు
రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించండి
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 విస్తరణకు అవసరమైన అనుమతులతో పాటు ఐఆర్‌ఎఫ్‌సీ రుణాన్ని జాప్యం లేకుండా విడుదలయ్యే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డిని కోరారు. ఈ అంశంపై చర్చించేందుకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. . తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి దానం అడగటం లేదని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఒప్పందం ప్రకారం ఐఆర్‌ఎఫ్‌సీ రుణాన్ని విడుదల చేయించాలని కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు. ‘‘మెట్రో ఫేజ్–1 మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు ప్రయాణికులకు విశేష సేవలు అందిస్తోంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా తలపెట్టిన ఫేజ్–2 ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించింది. మొత్తం 7 కారిడార్లు, 122.9 కిలోమీటర్ల మార్గం, సుమారు రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టాలని నిర్ణయించాం. ఈ క్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తెలిపిన అభ్యంతరాల నేపథ్యంలో మొత్తం మెట్రో వ్యవస్థ ఒకే నెట్ వర్క్‌లో నడిచేందుకు వీలుగా ఫేజ్–1ను సొంతగా నిర్వహించాలని నిర్ణయించాం. స్వాధీన ప్రక్రియలో ఈక్విటీ కొనుగోలుకు రూ.1,461.47 కోట్లు, ప్రాజెక్ట్ అప్పుల రీఫైనాన్సింగ్‌కు రూ. 13,538.53 కోట్లు కలిపి మొత్తం రూ.15,000 కోట్ల లావాదేవీలున్నాయి.
ఆర్‌ఎఫ్‌సీ ప్రాజెక్టును పూర్తిగా పరిశీలించి, డ్యూ డిలిజెన్స్ పూర్తి చేసి రుణ మంజూరు ఒప్పందం చేసింది. రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చింది. ఆర్బీఐ ద్వారా డైరెక్ట్ డెబిట్‌కు అంగీకరించింది. ఐఆర్‌ఎఫ్‌సీ షరతుల ప్రకారం మొదటి విడత నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.84.32 కోట్ల అప్‌ఫ్రంట్ ఫీజు చెల్లించింది. ఈక్విటీ రూ.1,461.47 కోట్లు ఇప్పటికే ఎస్క్రో ఖాతాలో జమ చేసింది. ఒప్పందాలన్నీ పూర్తయ్యాక ఈ నెల 15న రావాల్సిన మొదటి విడత రుణం విడుదల కాలేదు. రాష్ట్రం నుంచి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు చొరవ తీసుకుని ఫేజ్-2, మంజూరుతో పాటు ఫేజ్-1 టేకోవర్ రుణ అడ్డంకులు తొలగేలా చర్యలు తీసుకోండి’’ అని సీఎం లేఖలో పేర్కొన్నారు. మెట్రో ఫేజ్–2ను కేంద్రం–రాష్ట్రం 50:50 జాయింట్ వెంచర్‌గా ఆమోదించాలనీ, వీలు కాకుంటే రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరులతో ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. రైల్వే శాఖ మంత్రితో జరిగే సమావేశానికి మెట్రోకు సంబంధించిన ఒప్పందాలు, ఆధార పత్రాలతో తాను అధికారులతో కలిసి హాజరై వివరణలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలను ధృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో సీఎం విజ్ఞప్తి చేశారు.
మెట్రో ఫేజ్-2కు అనుమతించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



