Thursday, June 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆ ఏడు వరి రకాలకు ప్రాధాన్యం ఇవ్వండి

ఆ ఏడు వరి రకాలకు ప్రాధాన్యం ఇవ్వండి

- Advertisement -

ఎరువుల విషయంలో రైతులకు ఇబ్బందులు రాకుండా చూడండి :
విత్తన, ఎరువుల కంపెనీల డీలర్ల సమావేశంలో మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలో బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సొన), హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్ఎం-7715 రకాల విత్తనాలను రైతులకు విస్తృతంగా అందుబాటులో ఉంచాలని విత్తన కంపెనీల ప్రతినిధులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌‌లో వరి రకాల విత్తనాల లభ్యత, ఎరువుల సరఫరా విషయంపై విత్తన కంపెనీల ప్రతినిధులు, ఎరువుల డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, కృషి వాస్ ప్రతినిధులతో విడివిడిగా సమావేశమై ఖరీఫ్ సీజన్ ఏర్పాట్లపై మంత్రి తుమ్మల సమగ్రంగా సమీక్షించారు. రాష్ట్రంలో సన్నాల సాగు 60 శాతానికి పెరిగిందన్నారు. రైతులకు విత్తనాల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనీ, ఈ రకాలను ఏ రైతు ఎంత విత్తనం కొనుగోలు చేశాడనే వివరాలను ప్రభుత్వానికి తెలపాలని ఆదేశించారు. విత్తన సబ్సిడీపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందనీ, వ్యవసాయ యాంత్రీకరణ పథకం తరహాలో సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. విత్తనాల పంపిణీ కోసం అవసరమైతే రైతు వేదికలను ప్రత్యేక కేంద్రాలుగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఫెర్టిలైజర్ యాప్ వినియోగదారులకు, డీలర్లకు అనుకూలంగా ఉందని డీలర్లు అభిప్రాయపడ్డారు. రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం ప్రభుత్వంతో పాటు డీలర్ల బాధ్యత అని మంత్రి సూచించారు. అవసరమైతే రైతు వేదికలను తాత్కాలిక విక్రయ కేంద్రాలుగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. అధిక యూరియా వినియోగం వల్ల కలిగే నష్టాలపై డీలర్లు కూడా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా యూరియా దిగుమతులపై ప్రభావం పడుతున్నప్పటికీ రాష్ట్ర రైతులకు అవసరమైన ఎరువులు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని వివరించారు. మండలాల వారీగా మ్యాపింగ్ సదుపాయం కల్పించాలనీ, రవాణా ఖర్చులు తమపై అదనపు భారం కాకుండా చూడాలని డీలర్లు మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీన్ని పరిశీలిస్తామని మంత్రి హామీనిచ్చారు.

​శాటిలైట్ సాంకేతికతతో చీడపీడల గుర్తింపు
కృషి వాస్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆధునిక సాంకేతికతను వ్యవసాయంలో వినియోగించే విధానాలపై మంత్రి తుమ్మల సమీక్షించారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా పంటల్లో చీడపీడలను, వ్యాధులను రియల్ టైమ్‌లో గుర్తించి, అవి విస్తరించకముందే రైతులకు సమాచారం అందించే విధంగా కృషి వాస్ ప్రాజెక్ట్ పనిచేస్తోందని కంపెనీ ప్రతినిధులు వివరించారు. ఈ విధానం ద్వారా రైతులు ప్రతిరోజూ పొలాల్లో తిరిగి వ్యాధులను గుర్తించాల్సిన అవసరం తగ్గుతుందని తెలిపారు. రైతులకు ముందస్తు హెచ్చరికలతో పాటు అవసరమైన పురుగుమందులపై సూచనలు కూడా అందించడంతో వ్యాధుల వ్యాప్తిని నివారించి దిగుబడులను కాపాడుకోవచ్చని చెప్పారు. ఈ ప్రాజెక్టు పైలట్ అమలుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలాన్ని ఎంపిక చేసినట్లు ప్రతినిధులు వివరించారు. అక్కడి రైతులకు ఇప్పటికే పంటల పరిస్థితులపై సమాచారం అందిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -