Thursday, June 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసమస్యల పరిష్కారానికి కృషి చేశా

సమస్యల పరిష్కారానికి కృషి చేశా

- Advertisement -

మంత్రి అజహరుద్దీన్
గాంధీ భవన్‌‌లో ప్రజలతో ముఖాముఖి తిరిగి ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

తనకు సాధ్యమైనంత వరకు ప్రజల సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేసినట్టు రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ తెలిపారు. బుధవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ప్రజల సమస్యలను విన్నారు. రాతపూర్వకంగా ఇచ్చిన వినతిపత్రాలను స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రజల సమస్యలను పరిశీలించి తగిన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ 200కు పైగా దరఖాస్తులు వచ్చాయనీ, 50 సమస్యలపై ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి పరిష్కరించినట్టు తెలిపారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే ఆధారాలు లేకుండనే, టెండర్ లో స్కామ్ అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఫీజ్ రీయంబర్స్ మెంట్ పేరుకుపోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. కుటుంబ కలహాలతో పెరిగిపోతున్న హత్యలను నివారించేందుకు ప్రభుత్వం, పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. సర్ పేరుతో బీహార్, బెంగాల్లో ఎక్కువగా మైనారిటీ ఓట్లను తొలగించారనీ, తెలంగాణలో అలా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

​క్రైస్తవులకు సమాధుల స్థలాలు కేటాయించాలి
హైదరాబాద్ లో క్రైస్తవులకు సమాధుల స్థలాలు కేటాయించాలని పలు క్రైస్తవ సంఘాలు మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ కు వినతిపత్రం సమర్పించాయి. డాక్టర్.మార్టిన్ లూథర్ కాన్సెప్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగళ్ల పోచయ్య, ఉపాధ్యక్షులు ఎం.వి.జాన్సన్, దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక ప్రధానకార్యదర్శి బిషప్ యం.సామ్యేల్ లు ఈ మేరకు మంత్రికి వినతిపత్రం సమర్పించారు. నాంపల్లి, కార్వాన్, ఖైరతాబాద్, మహారాజ్‌గంజ్, అంబర్‌పేట్ తదితర నియోజకవర్గాల క్రైస్తవులకు గత 50 సంవత్సరాలుగా సమాధుల స్థలం లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రత్యేక సమాధుల స్థలం కేటాయించని పక్షంలో, అన్ని స్మశాన వాటికల్లో అంతిమ సంస్కారాలు చేసేందుకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. రంగారెడ్డి జిల్లా ఫారూఖ్ నగర్ మండలం చోలపట్టి గ్రామంలో ప్రభుత్వం కేటాయించిన స్మశాన వాటికను ఉమ్మడిగా 5 నియోజకవర్గాల క్రైస్తవులకు కేటాయించి చట్టబద్ధత కల్పించాలని సూచించారు. ఫుల్ గాస్పెల్ చర్చ్ ఆఫ్ గాడ్ (లంగర్ హౌజ్), సియోను ప్రార్థనా మందిరం (భోజగుట్ట), సౌత్ వే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ (ఫిలింనగర్), క్రైస్ట్ బిలీవర్స్ చర్చ్ (మాసబ్ ట్యాంక్) తదితర సంఘాల్లో క్రైస్తవులకు సమాధుల స్థలం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు చెప్పారు. అనంతరం వారు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, మంత్రి వినతిపత్రాన్ని స్వీకరించి జిల్లా కలెక్టర్ ను పరిశీలించి, పరిష్కరించమని ఆదేశించారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -