గ్రేటర్‌లో భూగర్బ విద్యుత్ లైన్
రూ.14,725కోట్లతో ఏర్పాటుకు నిర్ణయం
9 సర్కిళ్లను మూడు జోన్లుగా విభజన
పనులు సజావుగా జరిగేలా చర్యలు
ఐదేండ్లలో పూర్తయ్యేలా ఎస్పీడీసీఎల్ కార్యాచరణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మహానగరం ఇక వైర్‌లెస్ సిటీగా మారనుంది. చేతికి అందేలా నెత్తిన వేలాడుతూ తరచూ ప్రమాదాలకు కారణమవుతున్న ఓవర్ హెడ్ (ఓహెచ్) విద్యుత్ లైన్లు కనుమరుగు కానున్నాయి. వాటి స్థానంలో భూగర్భ విద్యుత్ లైన్లు (యూజీ కేబుల్స్) అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పచ్చ జెండా ఊపింది. రూ.14,725 కోట్ల అంచనా వ్యయంతో సిటీలో 16 వేల కిలోమీటర్ల మేరకు ఈ కేబుళ్ల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో తొలి దశలో ఔటర్ రింగ్ రోడ్డుతోపాటు ఇటీవల కొత్తగా జీహెచ్‌ఎంసీలో కలిసిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీలను కలుపుతూ కొత్తగా రూపుదిద్దుకుంటున్న ఫ్యూచర్ సిటీలోనూ ఈ పనులు చేపట్టాలని డిస్కం భావిస్తోంది.
పలు నగరాల్లో అధికార బృందం పర్యటన
ఇప్పటికే అధికారిక బృందం బెంగళూరు సహా పలు నగరాల్లో పర్యటించి భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటుపై అధ్యయనం చేసింది. ఇందుకు ఏటా కనీసం రూ.3వేల కోట్ల చొప్పున ఖర్చు అవుతుందనీ, రానున్న ఐదేండ్లలో ఈ పనులు పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఇప్పటికే ప్రతిపాదనలను సైతం సిద్ధం చేసింది. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎస్‌ఎస్) పథకంలో భాగంగా ఈ పనులు చేపట్టనుంది.
ఐదేండ్లలో పూర్తయ్యేలా కసరత్తు
భూగర్బ విద్యుత్ లైన్ల ఏర్పాటును రానున్న ఐదేండ్లలో పూర్తయ్యేలా డిస్కం ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే సైబర్ సిటీలో బ్లూ ప్రింట్ లేకపోవడంతో అడ్డదిడ్డమైన నిర్మాణాలతో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. హైటెన్షన్ విద్యుత్ లైన్ల కింద అనేక బస్తీలు వెలిశాయి. చేతికి అందేంత ఎత్తులోనే వైర్లు వేలాడుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు చెట్లకొమ్మలు విరిగి లైన్లపై పడిన సందర్బాలు సైతం అనేకం ఉన్నాయి. ఇప్పటికే రాజేంద్రనగర్, రామంతాపూర్ సహా చెట్లు ఎక్కువగా ఉన్న చోట్ల ఎయిర్ బంచ్డ్ కేబుల్స్ (ఏబీ) వేశారు. కొండాపూర్, గచ్చిబౌలి, మేడ్చల్ సహా పలు ప్రాంతాల్లో సుమారు వెయ్యి కిలోమీటర్ల వరకు యూజీ కేబుల్స్‌ను ఏర్పాటు చేశారు.
కోర్ సిటీలో ప్రారంభం కాని పనులు
సమస్యాత్మకమైన కోర్ సిటీలో మాత్రం ఇప్పటి వరకు ఈ పనులు చేపట్టలేదు. ఇక్కడ కొండలు, గుట్టలు, చెరువులు, కుంటలు, ఎత్తైన చెట్లు ఉన్న ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ యూజీ కేబుల్ వర్క్స్‌కు అవకాశం లేని ప్రాంతంలో ప్రత్యామ్నాయం దిశగా డిస్కం ఆలోచన చేస్తోంది. అత్యాధునిక ‘హారిజాంటల్ డ్రిల్లింగ్’ పద్దతిలో భాగంగా ఎయిర్ బంచ్డ్ కేబుల్స్‌ను అమర్చితే ఎలా ఉంటుందని డిస్కం భావిస్తోంది. నగరంలో ప్రస్తుతం ఉన్న 3,725 కిలోమీటర్ల 33 కేవీ ఓహెచ్ లైన్ల స్థానంలో కనీసం 2 వేల కిలోమీటర్ల మేర, 21,634 కిలోమీటర్ల 11 కేవీ ఓహెచ్ లైన్ల స్థానంలో కనీసం 14 వేల కిలోమీటర్ల మేర ‘హారిజంటల్ డైరెక్షన్ డ్రిల్లింగ్ సిస్టం’లో భూగర్భ కేబుళ్ల నిర్వహణకు డిస్కం సమాయత్తవుతోంది. ఇందుకు ప్రతి 100-200 మీటర్లకు ఒక రంద్రాన్ని ఏర్పాటు చేసి, యూజీ కేబుట్‌ను ఏర్పాటు చేస్తే అదనంగా ప్రతి కిలోమీటర్‌కు రూ.15 కోట్ల వరకు అదనపు ఖర్చు అవుతుందని డిస్కం అంచనా వేసింది. ఇలా దశల వారీగా పనులు చేపడితే రానున్న ఐదేండ్లలో నగరం మొత్తం వైర్‌లెస్ సిటీగా మారుతుందని డిస్కం అధికారులు తెలిపారు.



