Friday, June 19, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్పదహారేండ్లకే కోట్లలో వ్యాపారం

పదహారేండ్లకే కోట్లలో వ్యాపారం

- Advertisement -

సాధారణంగా పదేండ్ల లోపు పిల్లలు ఎవరైనా అల్లరి చేస్తూ ఆటపాటలతో గడుపుతుంటారు. అన్నం తినడానికి మారం చేస్తుంటారు. వారితో హోం వర్క్‌ ‌చేయించడానికి తల్లిదండ్రుల తలప్రాణం తోకకు వస్తుంది. ఇక స్కూల్‌ ‌టైం అవుతున్నా నిద్ర లేవరు. రోజూ ఇంట్లో ఓ యుద్ధమే. కానీ ప్రాంజలి అవస్థిని మాత్రం కేవలం ఏడేండ్ల వయసులోనే కోడింగ్ నేర్చుకుంది. పదమూడేండ్లకే ఫ్లోరిడా యూనివర్సిటీలో ఇంటర్న్‌షిప్ చేసింది. అంతేనా ఏకంగా రూ. 100 కోట్ల AI స్టార్టప్‌ను నిర్మించిన 16 ఏండ్ల ఈ అమ్మాయి గురించి ఈరోజు మానవిలో తెలుసుకుందాం…

సృష్టించాలనే కలతో పెరిగిన వారికి, ఏ పోరాటమూ పెద్దదిగా అనిపిం చదు. దాటలేని సరిహద్దు అంటూ ఏదీ ఉండదు. దీనికి నిదర్శనమే ప్రాంజలి అవస్థి. ఆమెకు ఏడేండ్లు ఉన్నప్పుడు, ఇంజనీర్ అయిన ఆమె తండ్రి ఆమెకు కంప్యూటర్ సైన్స్‌ను పరిచయం చేశారు. అలా కంప్యూటర్‌‌కు సంబంధించిన అన్ని విషయాల గురించి అత్యంత చిన్నవయసులోనే తెలుసుకుంది. తన కూతురు తెలివి తేటలను, ఆసక్తిని గమనించిన ఆ తండ్రి పాఠశాలల్లో ఇతర ప్రోగ్రామ్‌లతో పాటు కంప్యూటర్ సైన్స్‌ను కూడా బోధించాలని గట్టిగా అంటున్నాడు.

వర్ధమాన పారిశ్రామికవేత్తగా…
అవస్థికి పదకొండేండ్లు ఉన్నపుడు కుటుంబం ఫ్లోరిడాకు మారింది. ఆ సమయంలోనే కంప్యూటర్ సైన్స్ తరగతులు తీసుకోవాలనీ, పోటీ గణితం చేయాలనీ ఆమెలో ఉత్సుకత పెరిగింది. పదమూడేండ్లు వచ్చేటప్పటికి కరోనా మహమ్మారి కారణంగా ఆమె ఉన్నత పాఠశాల వర్చువల్‌లోకి మారింది. అప్పుడే ఆమె ఫ్లోరిడా ఇంటర్నల్ యూనివర్సిటీలోని యూనివర్సిటీ రీసెర్చ్ ల్యాబ్స్‌లో మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్‌లపై ఇంటర్న్‌షిప్ చేయడం ప్రారంభించింది. అవస్థి వారానికి 20 గంటలు ఇంటర్న్‌షిప్ చేసేది. ఇందులో భాగంగా శోధనలు చేయడం, డేటాను సంగ్రహించడం, సాహిత్య సమీక్షలను రూపొందించడం వంటి ఎన్నో పనులు చేసింది.

బీజం పడింది ఇలా…
‘2020లో OpenAI తన ChatGPT-3 బీటాను విడుదల చేసింది. అలాగే పరిశోధన డేటాను నేర్చుకోవడాన్ని సులభతరం చేయడానికి మనం దానిని ఉపయోగించవచ్చని నాకు తెలుసు’ అని ఆమె బిజినెస్ ఇన్‌సైడర్‌తో అంటుంది. అప్పటికే ఆమె స్వయంగా ఒక రీసెర్చ్ ఇంటర్న్‌గా ఉండటంతో సెర్చ్ ఇంజిన్‌లలో అవసరమైన దాన్ని కచ్చితంగా కనుగొనడం ఎంత కష్టమో ఆమెకు తెలుసు. ఈ సమస్యను పరిష్కరించాలనే ఆలోచనే ఆమె మనసులో తన కంపెనీకి బీజం వేసింది. ఏఐ ద్వారా దాన్ని సులభతరం చేయవచ్చని తెలుసుకుంది. 2021లో ఆమె మయామి హ్యాక్ వీక్‌కు హాజరయ్యింది. అక్కడ ఆమె బ్యాకెండ్ క్యాపిటల్‌లో భాగస్వాములైన లూసీ గువోతో పాటు డేవ్ ఫోంటెనోట్‌లను కలిసింది. వారు శాన్ ఫ్రాన్సిస్కో, మయామిలలో నివాస-ఆధారిత స్టార్టప్ యాక్సిలరేటర్ అయిన HFO రెసిడెన్సీని కూడా స్థాపించారు. తన భవిష్యత్ కంపెనీలో ఒక చిన్న వాటాకు బదులుగా వారి 12-వారాల కోహోర్ట్‌లోకి ఆమెకు ప్రవేశం లభించింది.

ఆమె ప్రతిభకు సలాం
‘కోహోర్డ్ ద్వారా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, కేవలం నెట్‌వర్క్ కోసమే ఇది విలువైనదని నా తల్లిదండ్రులు చెప్పారు. అందుకే నేను ఇక నా హైస్కూల్‌ చదువుకు సెలవు తీసుకున్నాను. ప్రతిరోజూ ఉబెర్‌లో ఇంటికి వెళ్లి రావడానికి అయ్యే ఖర్చును ఆ రెసిడెన్సీ భరించింది’ అని ఆమె అన్నది. అక్కడ కేవలం 15 ఏండ్ల వయసులోనే ప్రజలు ఉచితంగా సాఫ్ట్‌వేర్‌ను పంచుకోవడానికి వీలు కల్పించే ‘ప్రొడక్ట్ హంట్’ అనే ప్లాట్‌ఫామ్‌పై ఆమె Delv.AI బీటాను ప్రారంభించింది. డెమో డే రోజున ఆమె తన ప్రాజెక్ట్‌ను ప్రదర్శించింది. అంతే అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ప్రతిభకు సలాం కొట్టారు. ఆన్ డెక్, విలేజ్ గ్లోబల్ ద్వారా వెంటనే ఆమెకు మొదటి పెట్టుబడి లభించింది. త్వరలోనే ఆమె ఫండ్స్, ఏంజెల్స్ నుండి $45,000 సమీకరిం చింది. అలా అప్పుడు ఆమె ప్రారంభించిన ఆ కంపెనీ విలువ నేడు దాదాపు ₹100 కోట్లుగా ఉంది. తద్వారా వేగంగా అభివృద్ధి చెందుతున్న AI స్టార్టప్‌ను నిర్మించిన అతి పిన్న వయస్కురాలైన వ్యవస్థాపకులలో ఆమె ఒకరిగా నిలిచింది.

చాట్‌జీపీటీ విత్‌ ‌హ్యాండ్స్‌
దీంతో పాటు ఆమె జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది. మార్చి 2025లో ఆమె Salshyకి సహ-వ్యవస్థాపకురాలిగా కూడా మారింది. ఇది మీ డిజిటల్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్‌గా పనిచేయడానికి రూపొందించబడిన ఒక AI-ఆధారిత ఇమెయిల్ అసిస్టెంట్, ఆటోమేషన్ ప్లాట్‌ఫామ్, దీనిని ‘చాట్‌జీపీటీ విత్‌ ‌హ్యాండ్స్‌’ అని కూడా పిలుస్తారు. ఒక యువ వ్యవస్థాపకురాలిగా ప్రజలు తనకు సహాయం చేయడానికి లేదా ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ఎక్కువగా మొగ్గుచూ పారని ఆమె అంటుంది. అయితే ఇంత చిన్నపిల్ల ఏం చేస్తుంది, ఎలా చేయగలుగుతుంది అంటూ తనను చిన్నచూపు చూసిన వారు కూడా చాలా మంది ఉన్నారని ఆమె అన్నది.

పోటీని తట్టుకుంటూ
ప్రస్తుతం అవస్థి అమెరికాలోని జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఆమె ‘చాట్‌జీపీటీ ఇన్ హ్యాండ్’ అనే కొత్త ప్రాజెక్ట్‌లో కూడా పనిచేస్తోంది. ఇది ఒక ఏఐ అసిస్టెంట్. ఇది మాట్లాడటమే కాకుండా మీ కోసం కూడా పని చేయగలదని చెబుతోంది. ‘ప్రస్తుతం మేము కొత్త AI ఉత్పత్తుల వెల్లువను ఎదుర్కొంటున్నాం. నేడు పోటీ చాలా తీవ్రంగా ఉంది. ఈ పోటీని తట్టుకొని మేము నిలబడాలి. 2021లో మయామిలో ప్రతి ఒక్కరూ క్రిప్టో గురించి మాట్లాడుతున్నారు. 2022 చివరి నాటికి అది పూర్తిగా AIకి మారిపోయింది’ అని ఆమె 2023లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు ఆమె మరిన్ని కొత్త విషయాలను నిర్మిస్తూ ఏఐని ఉపయోగించి సాంకేతిక రంగంలో పనులను సులభతరం చేయడం తన లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -