హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీలో లిటరరీ ఫెస్ట్-2026
సాహిత్యం, కళలపై విస్తృతంగా చర్చలు
21న తెలంగాణ సాహితి దశాబ్ది ప్రత్యేక సంచిక ఆవిష్కరణ
22న కవి సమ్మేళనం : తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీలో ఈ నెల 21, 22 తేదీల్లో తెలంగాణ సాహితి దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ సాహితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి ప్రకటించారు. అందులో భాగంగానే తెలంగాణ లిటరరీ ఫెస్ట్-2026ను నిర్వహిస్తున్నామని తెలిపారు. దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని సాహిత్య, కళాభిమానులకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏవీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, తెలంగాణ సాహితి రాష్ట్ర కోశాధికారి అనంతోజు మోహన్ కృష్ణ, సహాయ కార్యదర్శి ఎస్‌కే.సలీమా, నగర సహాయ కార్యదర్శి శరత్ సుదర్శిలతో కలిసి ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆనందాచారి మాట్లాడుతూ తెలంగాణ సాహితి, ఏ.వి. కళాశాల తెలుగు శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో తెలంగాణ ఏర్పడిన పదేండ్ల కాలంలో సాహిత్య, సాంస్కృతిక రంగాలు ఎలా ఉన్నాయనే అంశంపై విస్తృతంగా చర్చిస్తామని తెలిపారు. పందేండ్ల కాలానికి సంబంధించి సాహిత్య విశ్లేషణలతో దశాబ్ది సాహిత్య ప్రత్యేక సంచికను తీసుకొస్తున్నామని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రాల్లోని, నగరంలోని డిగ్రీ, పీజీ కళాశాలల విద్యార్థులకు మాదక ద్రవ్యాల ప్రమాదం అనే అంశంపై కవితా, వ్యాసరచన పోటీలు నిర్వహించామన్నారు. ఉత్తమ కవితలు, వ్యాసాలు ఎంపిక చేసి బహుమతులను అందించబోతున్నామని తెలిపారు. 53 మంది రచయితులు రాసిన వారి స్వగతాలతో ‘అంత రంగ ఆవిష్కరణ’ పుస్తకాన్ని, ‘గోల్కొండ కలాలు’ పేరుతో కవితా సంకలనాన్ని ప్రచురించి ఆవిష్కరించబోతున్నామని వివరించారు.
కేంద్ర సాహిత్య యువ పురస్కారాలను పొందిన కర్నాటకకు చెందిన శివలింగప్ప, ఆరిఫ్ రాజా దశాబ్ది ఉత్సవాలకు హాజరుకాబోతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రముఖ రచయితలు, కవులు, సాహిత్యరంగ ప్రముఖులు కూడా వస్తారని తెలిపారు. సినిమా రంగం ఏ దిశగా వెళ్తుందనే అంశంపై విస్తృతంగా చర్చించబోతున్నామన్నారు. 21న సాయంత్రం ఏడు గంటలకు సాంస్కృతిక కార్యక్రమా లుంటాయనీ, బాలలతో సాహిత్య సందడి నిర్వహిస్తామని తెలిపారు. ఫొటో ఎగ్జిబిషన్, పుస్తక ప్రదర్శనలుంటాయన్నారు. దేశంలో భావప్రకటనా స్వేచ్ఛపై దాడి తీవ్రమవుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. సామ్రాజ్యవాద దేశాలు..ఆయా దేశాల్లోని వనరులను కొల్లగొడుతున్నాయనీ, దాని ప్రభావం మన దేశం మీదా పడుతున్నదని వివరించారు.
ఇలాంటి తరుణంలో యువ కవులు తమ కలాలు, గళాలు విప్పాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పారు. అయితే, యువత నుంచి పెద్ద ఎత్తున కవితలు వస్తున్నా…సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరమైన అంశాలపై లోతుగా విశ్లేషించి రావడం లేదని అభిప్రాయపడ్డారు. మెరుగైన సాహితీకారులను తీర్చిదిద్దడంలో ఈ సాహితి దశాబ్ది ఉత్సవాలు దోహదపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సాహితీ ప్రియలు, సాహిత్యకారులు, ప్రగతిశీలు కళాకారులు, యువకులు, అందరూ విచ్చేసి తెలంగాణ సాహితి దశాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఏ.వీ.కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ…పందేండ్ల తెలంగాణ సాహిత్యం లోతైన చర్చలు జరగనున్నాయని తెలిపారు. ఈ చర్చలు విద్యార్థులకు మంచి ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు. 22న మధ్యాహ్నం కవి సమ్మేళనం ఉంటుందని తెలిపారు.



