Wednesday, February 18, 2026
E-PAPER
Homeజాతీయంఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

- Advertisement -

న్యూఢిల్లీ: ఓబుళాపురం గనుల కేటాయింపు కేసులో సీనియర్‌ ఐఎఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గాలి జనార్దన్‌ రెడ్డికి గనుల అక్రమ కేటాయింపుల కేసుల్లో తన పేరును తొలగించాలని దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌ ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. ఓబులాపురం గనుల కేసులో నిబంధనలకు అనుగుణంగా వెళ్లానని పేర్కొంటూ గాలి జనార్దన్‌ రెడ్డికి గనుల అక్రమ కేటాయింపుల కేసుల్లో తన పేరును తొలగించాలని ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, జస్టిస్‌ ఎన్‌.కె సింగ్‌ లతో కూడిన ధర్మాసనం విచారించింది.

గనుల శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు శ్రీలక్ష్మి ఉల్లంఘనలకు పాల్పడినట్లు సీబీఐ పేర్కొంది. శ్రీలక్ష్మి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని, ఆమె మరిది భారీగా అక్రమాస్తులు సంపాదించారని తెలిపింది. గనుల కేటాయింపు సమయంలో శ్రీలక్ష్మి లంచం కూడా డిమాండ్‌ చేసినట్టు సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని తెలిపింది. శ్రీలక్ష్మి పాల్పడిన అక్రమ వ్యవహారాలన్నీ ట్రయల్‌ లోనే బయటపడతాయని పేర్కొంది. గనుల కేటాయింపు ఉత్తర్వుల్లో ”క్యాపిటివ్‌ మైనింగ్‌” అన్న పదాన్ని తొలగించారని, ఆ పదాన్ని తొలగించడంతో అక్రమాలకు దారులు తెరిచారని సీబీఐ పేర్కొంది. తద్వారా మైనింగ్‌ అక్రమదారులకు తోడ్పాటు అందించారని తెలిపింది.

సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం శ్రీలక్ష్మి పిటిషన్‌ ను డిస్మిస్‌ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. శ్రీలక్ష్మి పిటిషన్‌ విచారణలో మరో పిటిషన్‌ గా భావించి స్టే ఇచ్చామని తెలిపింది. పొరపాటున ఇచ్చిన స్టేని ఇన్ని రోజులు ఎంజాయ్ చేశారని జస్టిస్‌ సుందరేష్‌ అన్నారు. శ్రీలక్ష్మి డిశ్చార్జ్‌ పిటిషన్‌ ను తెలంగాణ హైకోర్టు సమర్థించింది. గతంలో హైకోర్టు డిశ్చార్జ్‌ పిటిషన్‌ పై ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సీబీఐ సవాలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ ను తిరిగి హైకోర్టుకు సుప్రీంకోర్టు పంపింది. సుప్రీంకోర్టు పంపిన పిటిషన్‌ పై విచారణ జరిపిన హైకోర్టు, శ్రీలక్ష్మి డిశ్చార్జ్‌ పిటిషన్‌ కొట్టివేసింది. దీంతో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు లో శ్రీలక్ష్మి సవాలు చేశారు. తాజాగా హైకోర్టు ఆదేశాలను సమర్ధిస్తూ, శ్రీలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టు కొట్టివేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -