వడ్ల బోనస్ కొద్ది రకాలకే ఇస్తామనడం తగదు
ఓపెన్‌కాస్ట్ గనుల ప్రభావంతో దెబ్బతింటున్న
ఎస్సారెస్పీ కాలువ :టీఆర్‌ఎస్ అధ్యక్షులు కవిత
నవతెలంగాణ-పెద్దపల్లి రూరల్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, కార్మికులు, యువత సమస్యలను విస్మరించి అవినీతి, అక్రమ వ్యాపారాలకే ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రజా సమస్యలను పక్కనపెట్టి సింగరేణి ప్రాంత వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. బాయిబాట కార్యక్రమంలో భాగంగా నాలుగు రోజులుగా చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, రామగుండం, మంథని ప్రాంతాల్లోని బొగ్గు గనులను సందర్శించి కార్మికులు, రైతుల సమస్యలను తెలుసుకున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
కల్లాల వద్దనే రైతులు ఆత్మహత్య చేసుకున్న దుస్థితి నెలకొందన్నారు. ఎన్నికల సమయంలో అన్ని రకాల వడ్లకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కొద్ది రకాలకే పరిమితం చేయడం తగదన్నారు. రైతు భరోసా అమలు విషయంలోనూ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్నారు. యూరియా సరఫరాలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. సింగరేణిలో వేలాది డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని దశలవారీగా ప్రకటిస్తోందని అన్నారు. ఓపెన్‌కాస్ట్ గనుల ప్రభావంతో ఎస్సారెస్పీ కాలువ దెబ్బతిన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రామగుండం ప్రాంతంలో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుందన్నారు. ప్రజలు ప్రస్తుతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. తెలంగాణ రక్షణ సేన ఆ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని కవిత ఆశాభావం వ్యక్తం చేశారు.
సమస్యలను విస్మరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



