ఫీజు నియంత్రణ చట్టం హుష్ కాకి..
విద్యా విధానంతో ముడిపెట్టిన ఫలితం
నిబంధనల బేఖాతరు
తల్లిదండ్రులను దోచేస్తున్న ప్రయివేటు, కార్పొరేట్ బడులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈ యేడాది కూడా అదే జరిగింది. తల్లిదండ్రులను ఇన్నాళ్లూ ఊరిస్తూ ఊరిస్తూ వచ్చిన ఫీజుల నియంత్రణ చట్టం చివరికి వారిని ఉస్సూరుమనిపించింది. దీన్ని అమలు చేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేకపోవటంతో షరామామూలుగా తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లు ఎప్పటి మాదిరిగానే ఈ విద్యా సంవత్సరం కూడా దోపిడీకి తెరలేపాయి. ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచి తల్లిదండ్రుల నుంచి వసూళ్లు మొదలు పెట్టాయి. దీనికి తోడు నిబంధనలను బేఖాతరు చేస్తూ పుస్తకాలు మొదలు విద్యార్థి చవకగా బయట కొనుగోలు చేసుకునే ప్రతి వస్తువును తమ వద్దే కొనుగోలు చేయాలని వేధిస్తున్నాయి. ప్రయివేటు పాఠశాలల దోపిడీపై పలు చోట్ల తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నా అధికారుల నుంచి సరైన స్పందన లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో ప్రయివేటు స్కూళ్ల దోపిడీ నుంచి కాపాడుతామనీ, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తెస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో సైతం ప్రయివేటు స్కూళ్ల దోపిడీ పెరిగిపోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి వాటిని నియంత్రించాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీతో తమపై ఫీజుల భారం తగ్గుతుందనీ, హేతుబద్ధంగా ఫీజులు నిర్ణయించి అమలు చేస్తారని అంతా భావించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమల్లోకి తేనున్న నేపథ్యంలో ఫీజుల నియంత్రణ కూడా అందులో భాగంగా అమలు చేయాలనుకోవడంతో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇదే అదనుగా ప్రయివేటు, కార్పొరేట్ యాజమాన్యాలు తల్లిదండ్రులపై తమ ఫీజుల ప్రతాపాన్ని చూపిస్తున్నాయి.
ప్రభుత్వం నుంచి అధికారికంగా ఫీజు నియంత్రణ చట్టంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. గత మూడేండ్లుగా రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ప్రయివేటు స్కూళ్లకు సంబంధించి ఫీజు నియంత్రణ చట్టం వస్తుందని ఆశించి భంగపడుతున్నారు. ఈ ఏడాది బడులు ప్రారంభమైనా.. ఆ చట్టం ఇప్పటి వరకు రాకపోవడంతో రాష్ట్రంలోని సుమారు 13 వేల ప్రయివేటు బడుల్లో చదువుతున్న దాదాపు 50 లక్షల మందికి పైగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లక్షల్లో ఫీజులను చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యతరగతి ఉద్యోగుల్లో చాలా మంది ఇద్దరు పిల్లలను ప్రయివేటు స్కూళ్లలో చదివిస్తే సంపాదనలో సగం వారికే వెచ్చించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రయివేటు స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణ కోసం 2017లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రొఫెసర్ తిరుపతి రావు చైర్మెన్ గా కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. కొత్త విద్యా సంవత్సరంలో 10 శాతం లోపు ఫీజులను యాజమాన్యాలు పెంచుకోవచ్చనీ, 15 శాతం కంటే ఎక్కువైతే ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంటుందని ప్రతిపాదిస్తూ కమిటీ తన నివేదికను 2020లో ప్రభుత్వానికి సమర్పించింది. వీటిపై బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఫీజుల నియంత్రణ చట్టం తెస్తామని ప్రధానంగా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక ఇదే అంశంపై 2024 జులైలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రైయివేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు-2025ను ప్రభుత్వానికి సమర్పించింది. ఫీజు నియంత్రణ కోసం విద్యా శాఖ కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. రెండేళ్లకోసారి 8 శాతం ఫీజులను పెంచుకోవడానికి స్కూల్ యాజమాన్యాలకు అనుమతి ఉండాలని.. అంతకంటే ఎక్కువగా.. అంటే 9 శాతం కంటే ఎక్కువ ఫీజులను పెంచుకోవాలంటే ప్రభుత్వ అనుమతి అవసరం ఉండాలని కమిటీ ప్రతిపాదించింది.
ఫీజుల నిర్ధారణలోనూ పలు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రతిపాదనల్లో కమిషన్ స్పష్టం చేసింది. నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తే అనుమతి రద్దు చేయడంతో పాటు సంబంధిత సొమ్మును విద్యా సంస్థల నుంచి తిరిగి రాబట్టేలా చూడాలని అధికారులకు సీఎం సూచించారు. ఫీజుల నియంత్రణకు సంబంధించిన సిఫారసులను ప్రజాభిప్రాయం కోసం వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ప్రక్రియ ఎంత వరకు వచ్చిందనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం తేవాలంటే తెలంగాణ విద్యా విధానంతో లింక్ ఉందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విద్యా శాఖ నుంచి డ్రాఫ్ట్‌ను సిద్ధం చేయగా దానిపై న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు తీసుకోవాలనే అంశాలపై చర్చ జరుగుతున్నట్టు వారు తెలిపారు. విద్యా విధానం రూపొందించిన తరువాతనే ఫీజుల నియంత్రణ చట్టం వస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రయివేటు, కార్పొరేట్ యాజమాన్యాల నుంచి వచ్చిన ఒత్తిడికి లొంగి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తున్నదనీ, ప్రజలకిచ్చిన హామీని విస్మరిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది కూడా తల్లిదండ్రులకు ఫీజుల బాధలు తప్పడం లేదు.
ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లలో ట్యూషన్ ఫీజులు ఇలా…
స్థానిక బడ్జెట్ స్కూళ్లు…
———————
ప్రి ప్రైమరీ (నర్సరీ నుంచి ఎల్ కేజీ వరకు) – రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ట్యూషన్ ఫీజు(యూనిఫాంకు రూ.1,500, బుక్స్ కు రూ.2 వేలు)
ప్రైమరీ (1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు) – రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు (యూనిఫాం రూ.2,500, బుక్స్ కు రూ.4 వేలు )
హైస్కూల్ లో (6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు) -రూ.25 వేల నుంచి రూ.30 వేలు (బుక్స్ కు రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు, యూనిఫాంకు రూ.3,500)
కార్పొరేట్ స్కూళ్లలో…
—————
ప్రి ప్రైమరీ – రూ.40 వేలు ట్యూషన్ ఫీజు
ప్రైమరీ -రూ.45 వేల నుంచి రూ.50 వేలు
హైస్కూల్ – రూ..50 వేల నుంచి రూ.70 వేల వరకు
ప్రపంచ స్థాయి ప్రమాణాలున్న స్కూళ్లలో…
—————————-
ప్రీప్రైమరీ- రూ.1.95 లక్షలు (ట్యూషన్ ఫీజు)
ప్రైమరీ -2 లక్షలు
ఆరు నుంచి పదో తరగతి వరకు-2.20 లక్షలు
-ఈ స్కూళ్లలో రవాణా ఛార్జీలను కిలోమీటర్ల లెక్కన లెక్కిస్తున్నారు. 5 కి.మీ.లోపయితే రూ.50 వేలు, 5 నుంచి 10 కి.మీ.లోపు అయితే రూ.60 వేలు, 10 కి.మీ.పైన అయితే రూ.65 వేలు (ఇవి ట్యూషన్ ఫీజుకు అదనం)
ఫీజు నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలి : టి.నాగరాజు
తమిళనాడు తరహాలో ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమల్లోకి తేవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఫీజు నియంత్రణ చట్టం తెస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ప్రయివేటు, కార్పొరేట్ స్కూళ్లను వాటిలోని మౌళిక వసతులు, ఇతర అంశాల ఆధారంగా విభజించి ఫీజులను నిర్ధారించాలని సూచించారు. ప్రతి పాఠశాలలో తరగతుల వారీగా వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను బహిరంగంగా ప్రదర్శించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ యేడాదీ అదే గతి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



