జంతర్‌మంతర్ వేదికగా
నిరసనకారుల పట్ల అమానవీయ చర్యలు
నీళ్లు, ఆహారం పంపిణీ చేస్తున్న వారి ఆధార్ కార్డు
వివరాలు, చిరునామాలు సేకరణ
పోలీసుల తీరుపై మండిపడ్డ కాక్రోచ్ జనతా పార్టీ
ఉద్యమానికి రైతు సంఘాల మద్దతు
నీట్ పేపర్ లీక్, సీబీఎస్‌ఈలో అవకతవకలపై
మూడోరోజు కొనసాగిన సీజేపీ ఆందోళన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారం, సీబీఎస్‌ఈలో అవకతవకలకు నిరసనగా ఆందోళన చేస్తున్న నిరసనకారుల పట్ల పోలీసులు అమానవీయ చర్యలకు పాల్పడుతున్నారు. వారికి ఇబ్బందులు సృష్టించేందుకు నీటి సరఫరాను నిలిపివేశారు. అంతేకాక ఆందోళనకారుల ఆధార్ కార్డు వివరాలు, చిరునామాలను సేకరిస్తున్నారు. దీంతో పోలీసుల చర్యలపై కాక్రోచ్ జనతా పార్టీ మండిపడింది. ప్రభుత్వ అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు విద్యార్థులు, యువత కలిసి చేస్తున్న ఈ ఉద్యమానికి రైతు సంఘాలు మద్దతు ప్రకటించాయి. నీట్ ప్రశ్నాపత్రం లీక్, సీబీఎస్‌ఈలో అవకతవకలు వంటి విద్యా సంబంధిత వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షలను సరిగా నిర్వహించడం చేతకాని ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆందోళన సోమవారం నాటితో మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే…నిరసనకారుల పట్ల అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జంతర్ మంతర్ లోని మరుగుదొడ్లకు వరుసగా రెండో రోజూ నీటి సరఫరా నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. నిరసనకారుల కోసం నీళ్లు, అరటిపండ్లు పంపిణీ చేస్తున్న వారి ఆధార్ కార్డు వివరాలు, చిరునామాలను ఢిల్లీ పోలీసులు సేకరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు సహాయం చేస్తున్న వారిని సైతం అనుమానాస్పదంగా చూడటం సరికాదని అభిజిత్ పేర్కొన్నారు. జంతర్ మంతర్ లో ఆందోళనకారుల కోసం స్వచ్ఛంద సంస్థలు, మద్దతుదారులు లంగర్ ఏర్పాటు చేసి ఆహారం, లస్సీ పంపిణీ చేస్తున్నారు. అక్కడికి వచ్చిన అనేక మంది రాత్రి అక్కడే బస చేస్తుండటంతో చెప్పులు, సామాన్లు, పాత్రలు అక్కడే కనిపిస్తున్నాయి. మరోపక్క వారి ఆందోళనకు అనుమతి గడువు ముగిసిందని పోలీసులు తెలపగా… ప్రత్యామ్నాయ వేదిక కేటాయించే వరకు తాము నిరసన కొనసాగిస్తామని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేశారు. నీట్% యూజీ లీక్ వ్యవహారంలో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త జ్ఞానేశ్వర్ రఘునాథ్ థోరట్ల ఆందోళనలో పాల్గొన్నారు.”విద్యార్థులు సంవత్సరాల పాటు కష్టపడి పరీక్షలకు సిద్ధమవుతారు. కానీ కొందరి లాభం కోసం పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే అది లక్షలాది కుటుంబాలకు అన్యాయం చేసినట్టే” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నీట్-యూజీ పేపర్ లీక్ వివాదం ఇప్పటికే దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీయగా, ఆదివారం నిర్వహించిన రీ టెస్ట్ ను కూడా ఎన్టీఏ సరిగ్గా నిర్వహించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు జంతర్ మంతర్ వేదికగా కొనసాగుతున్న ఆందోళన, కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆరోపణలు మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ బాధ్యతపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
నీటి సరఫరా నిలిపివేత
- Advertisement -
- Advertisement -



