Tuesday, June 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఎప్పుడు ఎన్నికలొచ్చినా.. 100 సీట్లకు తగ్గకుండా అధికారంలోకి వస్తాం ​

ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. 100 సీట్లకు తగ్గకుండా అధికారంలోకి వస్తాం ​

- Advertisement -

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు ఆదరిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ 100 సీట్లకు తగ్గకుండా అధికారంలోకి వస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హనుమకొండ జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి మాట్లాడారు. ఇతర రాష్ట్రాల నాయకులు తెలంగాణ రాజకీయాలపై అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నటుడు చిరంజీవి సినీ రంగంలో చేసిన సేవలను అభినందిస్తున్నామని, అయితే తెలంగాణ రాజకీయాల్లో జోక్యం అవసరం లేదన్నారు. బీఆ‌ర్‌ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన, రాష్ట్రంలో ఆ పార్టీ రాజకీయ ప్రాధాన్యం కోల్పోయిందని, అంతర్గత విభేదాలు, ఆస్తి వివాదాల కారణంగానే ఆ పార్టీ నాయకత్వంలో చీలికలు వచ్చాయని తెలిపారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పలు ప్రశ్నలు సంధిస్తూ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రూ.23 వేల కోట్ల రుణమాఫీ, పేదలకు సన్నబియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలు మోసమా అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 12 ఏండ్లలో సామాన్య ప్రజల కోసం ఏమి చేసిందో చెప్పాలన్నారు. రాహుల్ గాంధీకి లేఖలు రాస్తున్న బీజేపీ నేతలు ముందుగా ప్రధాని అపాయింట్‌మెంట్ ఇప్పించాలని, ఇంధన ధరలు, నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ప్రధానిని ప్రశ్నించే అవకాశం కల్పించాలని సూచించారు. ఇసుక విధానంపై వస్తున్న విమర్శలను ఖండించిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇసుక విధానాన్ని తీసుకురాలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలోనే ఇసుక మాఫియా విస్తరించిందని, దీనిపై మాజీ మంత్రి హరీశ్ రావుకు పూర్తి అవగాహన ఉందన్నారు. బీజేపీ నేతలు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నామని, వరంగల్ వేదికగా బహిరంగ చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో అభి‌వృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతోందని, రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కేఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వెంకట్రామ్‌రెడ్డి, ఆయూబ్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -