- Advertisement -
యూనియన్ పెట్టుకుంటే కార్మికులను తొలగిస్తారా? : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బీరం మల్లేశం
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఐడీఏ పాశమైలారంలోని బిస్లరీ ఇంటర్నేషనల్, కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామ పరిధిలోని మైక్రో బాక్స్ పరిశ్రమల్లో అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బీరం మల్లేశం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లు రాష్ట్రంలో అమలు కాక ముందే యాజమాన్యాలు దూకుడుగా అమలు చేసేందుకు పూనుకుంటున్నాయని ఆరోపించారు. పరిశ్రమల్లో యూనియన్లు పెట్టుకున్నందుకు కక్షపూరితంగా వ్యవహరించిన బిస్లరీ ఇంటర్నేషనల్, మైక్రోబాక్స్ పరిశ్రమల్లో కార్మికులను తొలగించారని ఆరోపించారు. పటాన్‌చెరు మండలం ఐడీఏ పాశమైలారంలోని బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రయివేట్ లిమిటెడ్‌లో 5 మందిని, కొండాపూర్ మండలం మల్లేపల్లి గ్రామ పరిధిలోని మైక్రోబాక్స్ పరిశ్రమలో 13 మంది కార్మికులను అక్రమంగా తొలగించారని అన్నారు. కార్మిక చట్టాలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోకుండా కార్మిక శాఖ ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తున్నదని ప్రశ్నించారు. తొలగించిన కార్మికులను బేషరతుగా విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో కార్మికులకు అండగా జిల్లాలోని కార్మికులందరిని సంఘటితం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
సీఐటీయూ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బిస్లరీ యూనియన్ అధ్యక్షులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ.. ప్రజాపాలనలో కార్మికులకు హక్కులు ఉండవా అని ప్రశ్నిం చారు . యూనియన్ పెట్టుకున్నందుకు యాజమాన్యం కక్షపూరితంగా కార్మికులను ఉద్యోగాల నుండి పీకేసిందని అన్నారు. అక్రమ తొలగింపులకు నిరసిస్తూ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 12 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే కార్మిక శాఖ అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. సీఐటీయూ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి జి.సాయిలు మాట్లాడుతూ.. కార్మికులు ఐక్యంగా ఉండి పోరాడాలని బిస్లరీ, మైక్రో బాక్స్ కార్మికులకు సీఐటీయూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వి.ప్రవీణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి ఎం.యాదగిరి, కిర్బీ యూనియన్ నాయకులు తలారి శ్రీనివాస్, సీబీఎల్ యూనియన్ నాయకులు మల్లారెడ్డి, బిస్లరీ యూనియన్ నాయకులు శేఖర్ రెడ్డి, నాగరాజు, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బిస్లరీ, మైకోబాక్స్ వివిధ పరిశ్రమల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



