Tuesday, June 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఫీజుల దోపిడీ అరికట్టాలి

ఫీజుల దోపిడీ అరికట్టాలి

- Advertisement -

ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి
ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి
విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ ధర్నాలు
రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి
కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేత
నవతెలంగాణ- విలేకరులు
ప్రభుత్వ పాఠశాలల సమస్యల పరిష్కారం, ప్రయివేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేసి వినతిపత్రాలు అందజేశారు. యూనిఫాం, పుస్తకాలు, నోట్‌ బుక్స్‌ వెంటనే విద్యార్థులందరికీ అందజేయాలని డిమాండ్‌ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు శనిగారపు రజినీకాంత్‌ మాట్లాడారు. ప్రయివేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలలు ప్రారంభమై చాలా రోజులు గడిచినా ఇప్పటికీ విద్యార్థులకు యూనిఫాంలు పూర్తిస్థాయిలో అందలేదని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకానికి తగిన నిధులు కేటాయించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రయివేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలు విద్యను వ్యాపారంగా మార్చాయని, పుస్తకాలు, నోట్‌బుక్స్‌, బెల్టులు, టైలు, సాక్సులు తదితర వస్తువులను విద్యార్థులతో బలవంతంగా కొనుగోలు చేయిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల దోపిడీ కొనసాగుతోందని, ఫీజుల నియంత్రణపై కమిటీ వేయాలని రాష్ట్ర ప్రపభుత్వాన్ని కోరారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా అనంతరం కలెక్టర్‌ చిత్రా మిశ్రాకు వినతిపత్రం అందజేశారు.

హైదరాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌ కదివరన్‌ పలనిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్‌ గువేరా, అశోక్‌ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్పొరేట్‌ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించి ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతి‌పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్‌ కో కన్వీనర్‌ కుంచం తదితరులు పాల్గొన్నారు. యాద్రాది భువనగిరి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మకు వినతిపత్రం అందజేశారు. వరంగల్‌, హన్మకొండలో ధర్నా జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -