15వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్
అరెస్టు చేసి స్టేషన్లకు తరలించిన పోలీసులు
నవతెలంగాణ – ముషీరాబాద్
మెగా డీఎస్సీ ద్వారా 15 వేల ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు సోమవారం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ చౌరస్తాలో మెరుపు ధర్నాకు దిగారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో చౌరస్తాకు చేరుకున్న నిరుద్యోగులు రోడ్డుపై బైటాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. జీవో నెంబర్లు 46, 29ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ ద్వారా 15 వేల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. చిక్కడపల్లి పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. కాగా, గత వారం కూడా దిల్‌సుఖ్‌నగర్‌లో సాయంత్రం ఒక్కసారిగా నిరుద్యోగ యువత రోడ్డుపైకి వచ్చి నిరసన ప్రదర్శన చేసిన విషయం విదితమే.
అశోక్ నగర్లో నిరుద్యోగుల మెరుపు ధర్నా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



