తెలంగాణ హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం :
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్‌డీఎస్) లో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాపై రాజీ లేదని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్.అంబేడ్కర్ సచివాలయంలో రాజోలిబండ డైవర్షన్ స్కీం, తుంగభద్ర డ్యాం అంశాలపై అధికారులు, ఆర్‌డీఎస్ పరివాహక రైతులు, జల వనరుల నిపుణులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్‌డీఎస్ హెడ్‌వర్క్స్ దుస్థితి, పొరుగు రాష్ట్రాల ద్వారా జరుగుతున్న అనధికార నీటి మళ్లింపులు, తుంగభద్ర జలాశయంలో పూడిక పేరుకుపోవడం వల్ల నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం వంటి అంశాలను రైతులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆర్‌డీఎస్ వ్యవస్థలోని అనేక నిర్మాణాలు కాలపరిమితి దాటిపోయాయనీ, అత్యవసర పునరుద్ధరణ అవసరమని వారు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఆర్‌డీఎస్ ఆధునీకరణ పనులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ, కాలువ గట్టులను పటిష్టం చేసి కాలువల సామర్థ్యాన్ని పెంచే చర్యలు చేపట్టాలని సూచించారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం రెండో దశలో భాగంగా మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు జలాశయాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను ప్రాధాన్యతతో చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ జలాశయాల ద్వారా సుమారు 2.12 టీఎంసీల స్థూల నీటి నిల్వ సామర్థ్యం ఏర్పడుతుందని తెలిపారు. భూసేకరణ వల్ల ప్రభావితమయ్యే రైతులకు న్యాయమైన పరిహారం అందేలా చూడాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తుంగభద్ర జలాలపై తెలంగాణకు ఉన్న న్యాయబద్ధమైన హక్కులను కాపాడుకుంటామని అన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన సాంకేతిక, న్యాయ, పరిపాలనా చర్యలన్నింటినీ ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. తుంగభద్ర బోర్డులో తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధికారులు మరింత చురుకుగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. జలాశయ నిర్వహణ, కాలువల ఆపరేషన్లు, మౌలిక వసతుల సంరక్షణ అంశాలను నిరంతరం పర్యవేక్షిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను సమర్థంగా కాపాడాలని ఆదేశించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని పునరుద్ఘాటించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగిస్తూనే తెలంగాణ నీటి హక్కులను కాపాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణ వాటా నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తేల్చిచెప్పారు. రైతుల సాగునీటి అవసరాల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. తెలంగాణ రైతుల హక్కులు, సాగునీటి భద్రత కోసం ప్రభుత్వం అన్ని వేదికలపై పోరాడుతుందని మంత్రి పేర్కొన్నారు. సమీక్షలో శాసనసభ్యులు సంజీవ రెడ్డి, నీటిపారుదల శాఖా ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్, సంయుక్త కార్యదర్శి కే. శ్రీనివాస్ ఈఎన్‌సీ. రమేష్ బాబు, జలవనరుల నిపుణులు, ఉన్నతాధికారులు, ఆర్‌డీఎస్ ఆయకట్టు రైతులు పాల్గొన్నారు
రాజోలి బండ డైవర్షన్ స్కీం నీటి వాటాలో రాజీ లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



