జీవితంలో మనం విజయాలు సాధించాలన్నా, ఓ స్థాయికి ఎదగాలన్నా మనకంటూ ఓ ప్రేరణ అవసరం. దాన్ని అందించే రోల్ మోడల్ చాలా ముఖ్యం. సాధారణంగా అందరూ తమ చిన్నతనంలో మొదటగా అమ్మానాన్నలను, ఆ తర్వాత గురువులను రోల్ మోడల్‌గా భావిస్తాం. వయసు పెరిగే కొద్ది ఆలోచనలు, ఆశయాలు మారిపోతుంటాయి. వాటికి తగ్గట్టుగానే రోల్ మోడల్‌గా వుండే వ్యక్తులు కూడా మారిపోతుంటారు.
ఆ రోల్ మోడల్స్ జీవితంలో మన లక్ష్యాన్ని కనుగొనడంలో సహకరిస్తారు. వాటిని సాధించేందుకు అవసరమైన మార్గదర్శకత్వం, మద్దతును అందిస్తారు. మన కలలను నిజం చేసుకునేందుకు మనల్ని ప్రేరేపించడంలో సహాయపడతారు. మనకు వాస్తవ ప్రపంచాన్ని పరిచయం చేస్తారు. మన విలువను మనకు గుర్తు చేస్తారు. మనపై మనకు నమ్మకాన్ని కల్పిస్తారు. కష్ట సమయాల్లో ఉత్సాహంగా ఉండేందుకు సహకరిస్తారు.
అయితే మనం ఎవరిని రోల్ మోడల్‌గా ఎంపిక చేసుకోవాలి అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. మన ఎంపికను బట్టే మనం వెళ్లే మార్గం సరైనా కాదా అని అంచనా వేయవచ్చు. సాధారణంగా జీవితంలో విజయాలు సాధించడానికే ఎక్కువ మంది రోల్ మోడల్‌ను ఎంచుకుంటారు. వారు సెలబ్రిటీ కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మనకు పరిచయం లేని సమాజ సేవకులు కావొచ్చు. వారిని ఆదర్శంగా తీసుకుని మనం సాధించాల్సిన విజయాల కోసం ఓ ప్రణాళికను రూపొందించుకుంటాం. వారిని అనుసరిస్తూ జీవితంలో ఓ స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తాం. ఇలాంటి రోల్ మోడల్స్ ప్రతి వ్యక్తి జీవితంలో ఉండాలి.
అయితే దేశం కోసం, పేదల కోసం త్యాగాలు చేసిన వారిని ఆదర్శంగా తీసుకునే వారు చాలా తక్కువ మంది ఉంటారు. రోల్ మోడల్ అంటే గొప్ప విజయాలు, డబ్బు సాధించిన వారు మాత్రమే కాదు. నలుగురి మేలు కోరి త్యాగాలు చేసిన వారు కూడా గొప్పవారే. జీవితంలో గొప్ప స్థాయికి ఎదగడం ఎంత ముఖ్యమో మంచి మనిషిగా ఉండటం కూడా అంతే ముఖ్యం. అప్పుడు త్యాగాలు చేసిన వారు కూడా మనకు ప్రేరణగా మారిపోతారు.
నిరుపేదల జీవితాలు మార్చేందుకు జీవితాంతం శ్రమించిన మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య. ఈయన అడుగు జాడల్లో నడుస్తున్న వారు మన చుట్టూ ఉన్నారు. అలాగే అంటరాని కుటుంబంలో పుట్టి, ఎన్నో బాధలు భరించి, ఉన్నత చదువులు చదివి భారత రాజ్యాంగ నిర్మాతగా గుర్తింపు పొందిన అంబేద్కర్ కొందరికి ఆదర్శం. దేశం కోసం ఇరవై మూడేండ్లకే ప్రాణాలర్పించిన భగత్‌సింగ్ మరికొందరికి ఆదర్శం. అంటరాని తనాన్ని వ్యతిరేకించి, అహింసా మార్గాన్ని చూపిన గాంధీని ఎంతో మందికి ఓ ప్రేరణ. అయితే విచారించాల్సిన విషయం ఏమిటంటే గాంధీని చంపిన గాడ్సేను ప్రేరణగా భావించే వారు నేడు పుట్టుకొస్తున్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
విలువలున్న వ్యక్తిని ప్రేరణగా ఎంచుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మనం వెళ్ళే మార్గం కూడా విలువలతో నిండి ఉంటుంది. అలాగే మనం ఏ రంగంలో రాణించాలనుకుంటున్నామో ఆ రంగంలో విజయాలు సాధించిన వారిని రోల్ మోడల్‌గా తీసుకోవాలి. అయితే రోల్ మోడల్‌ని ఎంపిక చేసుకున్నంత మాత్రాన మనం గొప్పవారైపోము. వారు జీవితంలో ఏం చేశారో, ఎలాంటి విలువలకు కట్టుబడి ఉన్నారో, ఎలాంటి త్యాగాలు చేశారో తెలుసుకోవాలి. మనం కూడా అలా ఉండటానికి మనసుతో కృషి చేయాలి. అప్పుడే అనుకున్నది సాధించగలం.
ప్రేరణ
- Advertisement -
- Advertisement -



