Thursday, June 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం

కాంగ్రెస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం

- Advertisement -

మూడు శాఖల సీఎంగా రేవంత్ రెడ్డి, మూడు శాఖల మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల పాలనలో విఫలం
స్కామ్‌ల ప్రభుత్వాన్ని గద్దె దింపి, స్కీమ్‌ల ప్రభుత్వాన్ని తీసుకురావాలి
రాబోయే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎ‌స్సే
బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత హరీశ్‌ రావు


​నవతెలంగాణ–అశ్వారావుపేట
​ కాంగ్రెస్‌ ‌రైతు వ్యతిరేక ప్రభుత్వం అని, మూడు శాఖల సీఎంగా రేవంత్ రెడ్డి, మూడు శాఖల మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మల పాలనలో విఫలం అయ్యారని, స్కామ్‌ల ప్రభుత్వాన్ని గద్దె దింపి, స్కీ‌మ్‌ల ప్రభుత్వాన్ని తీసుకురావాలని బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత హరీశ్‌‌రావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై అవగాహనా సదస్సు నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పల వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటూ ఎదురుచూస్తున్నారని అన్నారు. బీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీల్లో కళ్యాణ లక్ష్మి పథకం లేకపోయినా దాన్ని తీసుకొచ్చి రూ.13 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి 13 లక్షల మందికి పైగా లబ్ది చేకూర్చామని తెలిపారు. కరోనా సమయంలో కూడా ఏ సంక్షేమ పథకాన్ని నిలిపివేయలేదని, రైతుబంధు ద్వారా రైతులకు రూ.73 వేల కోట్ల సహాయం అందించినట్టు చెప్పారు. 2024 ఎన్నికల్లో కృతజ్ఞత కంటే ఆశ గెలిచిందని, అందువల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని అన్నారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు అమలులో విఫలమైంద న్నారు. పంటల బీమా, పంట నష్టపరిహారం, యూరియా సరఫరా వంటి అంశాల్లో ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. ఉచిత విద్యుత్ వ్యవస్థను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని, కేసీఆర్ హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించగా ప్రస్తుతం రైతుల్లో ఆందోళన నెలకొందని అన్నారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ జిల్లాలో చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని అన్నారు. సీతారామ ప్రాజెక్టు, అశ్వారావుపేట 100 పడకల ఆస్పత్రి వంటి కీలక కార్యక్రమాలు కేసీఆర్ హయాంలోనే సాధ్యమయ్యాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు, మోసాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరో రెండేండ్లలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -