Friday, June 26, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఆరెస్సెస్‌కు ఎవరు ఎప్పుడు మినహాయింపులిచ్చారు?

ఆరెస్సెస్‌కు ఎవరు ఎప్పుడు మినహాయింపులిచ్చారు?

- Advertisement -

“ఆరెస్సెస్‌కు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. హిందూ ధర్మానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఆరెస్సెస్ ఎటువంటి రహస్య సంస్థ కాదు. సంఘ పరివార్ గురించి మేం ప్రజలకు బహిరంగంగానే చెపుతుంటాము. ప్రభుత్వానికి ఆరెస్సెస్ గురించి పూర్తి అవగాహన ఉంది. వందేండ్లుగా మమల్ని రిజిస్టర్ చేయించు కోవాలని ప్రభుత్వం ఎప్పుడూ అడగలేదు” – మోహన్ భగవత్ (ఆరెస్సెస్ ఛీఫ్) ఆరెస్సెస్ అంటే హిందూ ధర్మమని-హిందూ ధర్మమంటే ఆరెస్సెస్ – అనీ రాజ్యాంగంలో లేదే, పోనీ మధ్యలో రాజ్యాంగ సవరణ ఏమైనా చేశారా? లేదే- దేశంలోని హిందూ సమాజం యావత్తూ ‘ఆరెస్సెస్సే మా అధికార ప్రతినిధి’ అని ఏకకంఠంతో ఎప్పుడైనా ఎక్కడైనా నినదించారా? లేదే- ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉన్న ఈ భారతదేశంలో ఆరెస్సెస్ ఒక రాజ్యాంగేతర శక్తిగా మారి కుట్రలక, కుతంత్రాలకు పాల్పడుతూ ఆస్తులు కూడ బెట్టుకుని బలపడిన ధనిక సంస్థ. గతంలో ఆరెస్సెస్ మూడుసార్లు నిషేధానికి గురైన విషయం ఈ దేశ ప్రజలకు గుర్తుంది. నిజానికి గత ప్రభుత్వాలే పట్టుబట్టి ఆరెస్సెస్‌ను ఈపాటికి రిజిస్టర్ చేయించాల్సింది.

చేయించలేక పోయినందువల్లనే ఇప్పుడు దేశంలోని ఒక రాష్ట్ర ప్రభుత్వం- కర్నాటక ఈ సమస్యను లేవనెత్తింది. ఇది ఈ ఒక్క రాష్ట్రంతో ఆగదు. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఆరెస్సెస్ రిజిస్టర్ కావల్సిందేనని పట్టుబడతాయి. తప్పదు. ఈ సంస్థకు మినహాయింపుల ెందుకూ? ఇది జాతి నిర్మాణంలో ఏం పాలు పంచుకుందనీ ? దేశ స్వాతంత్య్రంలో పాలు పంచుకోని సంస్థ. బ్రిటీషు వారికి క్షమాపణా పత్రాలు రాసి బతుకు జీవుడా అని బతికి పోయిన సంస్థ. కాస్త బలపడగానే, ఇక ప్రభుత్వమే తన చేతిలో ఉందని విర్రవీగుతోంది. అరెస్సెస్ బిల్డింగులు కడుతూ ఉంది. నిధులు సేకరించుకుంటూ ఉంది. క్రయ విక్రయాలు చేస్తూ ఉంది. విరాళాలు సేకరిస్తూ ఉంది. గ్రామ గ్రామాలను తన కేడర్‌ను వ్యాపింపజేస్తూ ఉంది. శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. తనదైన భావజాలం గలవారిని బ్యూరోక్రసీలోకి, న్యాయ వ్యవస్థలోకి పంపిస్తోంది. నేరుగా రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్ప్పుడు అధికారికంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా? రిజిస్టర్ చేయించు కోకుండా దేశంలో ఏ చిన్న సంస్థ కూడా పనిచేయడం లేదు. మరి ఇంత పెద్ద సంస్థ అయ్యుండి, లావాదేవీల లెక్కలు చూపాల్సిన బాధ్యత, ఆడిట్ చేయించుకోవాల్సిన బాధ్యత ఉండదా? ఇదేం పద్ధతి? ఇవన్నీ కాకుండా మోహన్ భగవత్-అరెస్సెస్ ఛీఫ్‌కు ఎక్కడికి వె‌ళ్లినా జడ్ ప్లస్ రక్షణను ప్రభుత్వం ఎందుకు కల్పిస్తోంది? ఈ దేశ ప్రజలు కట్టిన పన్నుల నుంచే కదా ప్రభుత్వం ఆ ఖర్చు భరిస్తుంది? ఆరెస్సెస్ ఛీఫ్ ప్రభుత్వంలో భాగం కాదు. ఆయనకు ఏ హోదా లేదు.

మరెందుకీ జడ్ ప్లస్ రక్షణ? సామాన్యులు అడుగుతున్న ప్రశ్న ఇది! ఎన్నో మైనార్టీ సంస్థల ఆర్థిక మూలాలను ధ్వంసం చేసి, వాటిని మూయించేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం, తమకు వెన్నెముకగా ఉన్న సంస్థ లెక్కల చిట్టా మాత్రం ఎందుకు విప్పదూ? ఇది ఒకటి కాదా? కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలలో ఇదీ ఒకటి కాదా? రూలు- అంటే, అందరికీ ఒకేరూలు వర్తిస్తుంది కదా? ఆరెస్సెస్‌కు ఎవరు ఎప్పుడు మినహాయింపులిచ్చారూ? ఆ వివరాలు ప్రజలకు తెలియజేయాలి కదా ? ప్రజల ప్రశ్నలకు జవాబివ్వకుండా దౌర్జన్యపూరితంగా మేం ఇలాగే ఉంటాం అంటే, ఇక ఇప్పుడు సాగదు ! యువత మేల్కొంది. ప్రతిదీ ప్రశ్నిస్తోంది. నిరసనలు తెలియజేస్తూ ఉ‌ద్యమానికి ఊపిరులూదుతోంది. కర్నాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే ఆరెస్సెస్ ఛీఫ్‌కు రాసిన ఉత్తరంతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి- దేశంలోని ఏ సంస్థ అయినా, ఏ ఆలోచనా ధోరణికి చెందినదైనా చిన్నదైనా, పెద్దదయినా అది తప్పకుండా రిజిస్టర్ అయి ఉండాలి! అన్ని విషయాలు పారదర్శకంగా ఉండాలి . ఆర్థిక వనరుల వివరాలు ప్రభుత్వానికి వెల్లడించాలి. టాక్స్ కట్టాలి.

జవాబుదారీతనం తప్పనిసరి!
ప్రజల్ని ప్రభావితం చేస్తున్న ఎన్నో సంస్థలు రిజిస్టర్ అయిన సంస్థలే. అవి పారదర్శకంగా కూడా ఉంటున్నాయి. ప్రజాస్యామ్య విలువలకు ప్రాధాన్యమిస్తూ కొనసాగుతున్నాయి. ఆరెస్సెస్ చెప్పుకునేది ఏమంటే – అది రాజకీయ సంస్థ కాదని. స్వచ్ఛందంగా నడుస్తున్న ఒక సాంస్కృతిక సంస్థ అని! ప్రభుత్వం నుండి నిధులు ఏవీ తీసుకోవడం లేదని! ఏ ప్రయోజనమూ పొందడం లేదని! అందువల్ల, ఇతర సంస్థల మాదిరిగా దీన్ని చూడగూడదు – అని! వాళ్లు చెప్పు కోవడం బాగానే ఉంది గాని, అందులో నిజం లేదు. ఎందుకంటే, ఇది కేవలం సాంస్కృతిక సంస్థ కాదు – రాజకీయాలు చేస్తోంది. ప్రభుత్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. ప్రభుత్వం నుండి ఏ ప్రయోజనమూ పొందడం లేదన్నది పూర్తి అబద్ధం. వందేండ్లుగా ప్రభుత్వానికి పన్ను ఎగవేసింది. పైగా, దాని ఉనికే అక్రమం! ఇప్పటికైనా సక్రమం చేసుకుందామన్న స్పృహలోకి రావడం లేదు. దౌర్జన్యపూరితంగానే కొనసాగుదామని అనుకుంటోంది. ఇవన్నీ నేరాలే. నేర చరిత్రగల పెద్ద సంస్థ ఆరెస్సెస్-అని దేశ ప్రజలకు తెలిసిపోయింది. ‘ఆరెస్సెస్ తన ఆదాయం లెక్కలు వివరించాలి’ అని అడిగిన కర్నాటక హోం మంత్రి ప్రియాంక్ ఖర్గేను ఉద్దేశిస్తూ బీజేపీ పార్లమెంట్ మెంబర్‌ రమేష్ ‌జిగజినాగి దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ‘నువ్వు దళితుడివి. నీలాంటి దళితులకు ఆరెస్సెస్‌ను ప్రశ్నించే హక్కులేదు. ఆరెస్సెస్‌ను ప్రశ్నించిన వాడు ఇంతవరకు జీవించి లేడు. నీకు అదే గతి పడుతుంది’ అంటూ బెదిరించాడు. ఈ ప్రకటన అతడి మూర్ఖత్వాన్ని బహిర్గతం చేసిందేగానీ, భారత ప్రజల ప్రశ్నలకు జవాబు ఇచ్చినట్లుగా లేదు. అయినా కొర్టులు ఏం చోద్యం చూస్తున్నాయి? దాన్ని సుమోటోగా తీసుకుని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఆయన్ను లోపల ఎందుకు వేయించలేదూ? ఈ దేశంలో చట్టం కొందరికి చుట్టం కదా? అసహాయుల మీద మాత్రం కొరడా ఝళిపిస్తూ ఉంటుంది.

నాగపూర్‌లో వారి ప్రధాన కార్యాలయ భవనం, ఢిల్లీలో ఇటీవల కట్టుకున్న విలాసవం తమైన భవనం, ఇతర నగరాల్లోని వారి భవనాలు, ఆస్తులు రిజిస్టర్ చేసుకున్నారా లేదా? పట్టా/రిజిస్ట్రేషన్ లేకుండా ఏ భూమి, ఏ భవనం దేశంలో ఉండదుకదా? ఆ విషయమే ఇప్పుడు ప్రియాంక్ ఖర్గే లేవనెత్తాడు. అతి పెద్ద సంస్థ, అత్యంత ధనిక సంస్థ అయినంత మాత్రాన దేశ ప్రజలంటే లెక్కలేదా? బీజేపీ ప్రభుత్వానికీ అరెస్సెస్‌కు అంతర్గతంగా లాలూచీలు ఉండొచ్చు. కానీ, టాక్స్‌లు చెల్లించే ప్రజలు ఊరుకోరు కదా? వారికి జవాబుదారీ తనంతో ఉండాల్సిన అవసరం ఉంది కదా? ఆరెస్సెస్ అంటే హిందూ ధర్మమని అంటున్నారు. మరి దేశంలో ఇతర ధర్మాలకు కూడా ఇలాంటి మినహాయింపులు ఇస్తున్నారా? అవి కూడా రిజిస్టర్ కాకుండానే, జమా ఖర్చులు చూపకుండానే, ఆడిటింగ్ లేకుండానే వదిలేస్తున్నారా? లేదు కదా… మోహన్ భగవత్ భారత పౌరుడేకదా? పౌరుడైతే, మరి టాక్స్ పరిధిలోకి వచ్చే పౌరులంతా టాక్సులు కడుతున్నారు కదా ? ఆరెస్సెస్ ఛీఫ్‌కు, ఆ సంస్థకు వారికి ఇష్టమైన రీతిలో వ్యవహరించడానికి వెసులుబాటు ఎవరిచ్చారు? ఎందుకిచ్చారు ? ఈ దేశ పౌరులకు తెలియాలి కదా?

గతంలో భారత ప్రభుత్వం ఆరెస్సెస్‌ను మూడుసార్లు నిషేధించింది-అంటే అర్థమేమిటి? ఈ సంస్థ ప్రభుత్వ చట్టాలకు ఒదిగి ఉండాల్సిందే నని సామాన్యులకు కూడా అర్థమవుతోంది! అయితే ఆరెస్సెస్ ‌బీజేపీ మేధావులకు ఇలాంటి చిన్న విషయాలు అర్థం కావు. వారి స్థాయే వేరు! వారిస్థాయి ఏమిటో తెలుసు కోవాలంటే, ఇటీవల అయోధ్య రామాలయంలో జరిగిన వందల కోట్ల దొంగతనం గూర్చి తెలుసుకోవాలి. ఆ ఆలయం ప్రభుత్వ పరిధిలోకి రాదు. ట్రస్టీలే దాన్ని నిర్వ హిస్తున్నారు. అంటే ఎంచక్కా దొంగ చేతికే తాళం చెవి ఇచ్చినట్లు- ఆయోధ్య రామాలయంలో 7 కోట్ల రూపాయల విరాళాల బాక్స్ మాయమైంది. 60 కిలోల వెండి మాయం. వజ్రాల హారాలు, బంగారు ఆభరణాలు, బంగారు పాదుకలు అన్నింటికి అన్నీ మాయమై పోయాయి. 200 నుంచి 1400 కోట్ల దాకా అయోధ్య రాముడి గుడిలో దొంగతనం జరిగిందని వారి సభ్యుడే బయట పెట్టాడు. సమాజ్‌వాద్‌ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మొదట ఈవిషయం ప్రకటించినా, ఎవరూ ఏమీ పట్టించుకోలేదు. అసలిప్పుడు దర్యాప్తు ఎలా జరుగుతుంది? సి.సి. కెమెరా పుటేజ్ మాయం చేశారు. ట్రస్టీ సభ్యుల ఇండ్ల నుంచీ కొంత కొంత బంగారం- నగదు దొరుకుతూ ఉండడం విశేషం. మరి ఈ దేశ చౌకీదారు, అతని సహాయకుడు యోగి ఏం చేస్తున్నట్లు? రాముడి పేరు చెప్పి లోపల్లోపల దండుకుంటు న్నారా? అందుకే దేనికైనా రిజిస్ట్రేషన్- ప్రభుత్వ గుర్తింపు – పారదర్శకత-నైతికతతో కూడిన నడవడి అత్యవసరం!

గతంలో రాముడి పేరు చెప్పి, రథయాత్రలు చేసి, అమాయక ప్రజల్ని ప్రభావితం చేసి, ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చింది ఇందుకేనా? క్రమంగా వ్యవస్థల్ని నాశనం చేసి, మరోవైపు ఓట్ చోరి చేసి, ఇంకో వైపు ప్రజాస్వామ్యాన్నే ఖూనీచేస్తున్నది ఇందుకేనన్నమాట! ప్రజారం జకంగా పరి పాలిస్తున్నామని తమకు తామే ప్రకటించుకుని, వేడుకలు చేసుకుంటూ అక్రమంగా అధికారంలో కొనసాగుతున్నది ఎందుకో ఈ దేశ ప్రజలకు అర్థమైంది. ఏదిఏమైనా ఈ ఆరెస్సెస్ సమస్త అధికారంలో ఉన్న బీజేపీకి, ప్రతి పక్షంలో ఉన్న కాంగ్రెస్‌కూ మధ్యతగవు తీవ్రమయ్యేట్టుగా ఉంది. ఈ దేశ ప్రజలు న్యాయం వైపే నిలబడతారు. న్యాయమే కోరుకుంటారు. కర్నాటక హోంమంత్రి సరైన ‌సమస్యను వెలికితీశారు. అయితే అతను దళితుడని – తిట్లకూ, బెదిరింపులకూ గురి అవుతున్నాడు – దళితులు దేశంలో పారులు కాదన్నట్టు!! అధికార పార్టీ, ఆరెస్సెస్‌లు వారి మూర్ఖత్వాన్నీ, మనువాద మనస్తత్వాన్నీ వెళ్లగక్కుకున్నారు. దళితులపై, శూద్రులపై వారికి అంత చిన్నచూపు ఉంటే- పన్నేండేండ్లకు ముందే ఒక బ్రాహ్మణుడినో, క్షత్రియుడినో దేశ ప్రధానిగా చెయ్యాల్సింది కదా? ఒక శూద్రుణ్ణి ఎందుకు చేశారూ? అని ఈ దేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్న అర్ధవంతంగా ఉంది. ​- వ్యాసకర్త: కవిరాజు త్రిపురనేని రామస్వామి జాతీయ పురస్కార తొలి గ్రహీత, జీవశాస్త్రవేత్త.

ప్రొ. దేవరాజు మహారాజు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -