Friday, June 26, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలునేను గుంపుమేస్త్రీనే

నేను గుంపుమేస్త్రీనే

- Advertisement -

ఉద్యోగులే ప్రభుత్వానికి బ్రాండ్‌ అంబాసిడర్లు
అదనంగా పనిచేయండి..ఆదాయం పెంచండి…
పన్ను కట్టని అక్రమార్కులను కట్టడి చేయాలి
రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీ వెళ్తున్నా : 
ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యలు
ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ఉచిత ప్రమాదబీమా
16 బ్యాంకులతో ప్రభుత్వం ఒప్పందం
కాంట్రాక్టు, ఔట్‌‌సోర్సింగ్‌, తాత్కాలిక ఉద్యోగులకూ వర్తింపు

నవతెలంగాణ బ్యూరో – హై‌దరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఒకగంట అదనంగా పనిచేసి ఆదాయాన్ని పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. పన్నులు కట్టకుండా ఉండే అక్రమార్కులను కట్టడి చేస్తే ఆదాయం పెరుగుతుందని చెప్పారు. గురువారం హైదరాబాద్‌‌లోని రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించేందుకు అవగాహన ఒప్పందం కార్యక్రమాన్ని నిర్వహించారు. 16 బ్యాంకులు ప్రభుత్వ ఉద్యోగులకు ఉచిత ప్రమాదబీమాను కల్పించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం, ఉద్యోగులు ఒక్క రూపాయి చెల్లించకుండా రూ.కోటి ప్రమాద బీమా ఎలా సాధ్యమని అనిపించిందని చెప్పారు. కానీ ప్రమాదవశాత్తు మరణించిన 45 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు రూ.కోటి బీమా సొమ్మును అందించిన తర్వాత ఇది సాధ్యమని నిరూపితమైందని అన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఈ బీమాను అమలు చేసేందుకు నిర్ణయించామని తెలిపారు. ఈ ప్రమాద బీమా ఉద్యోగుల కుటుంబాలకు ఒక ధైర్యాన్ని, భరోసాను ఇస్తుందని చెప్పారు. ఉద్యోగుల భద్రత యజమానిగా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

తనను కొందరు గుంపుమేస్త్రీ అని అవహేళన చేస్తుంటారని అన్నారు. ‘అవును.. నేను… గుంపుమేస్త్రీనే…’ అని చెప్పారు. ఉద్యోగుల గుంపంతా తనదేననీ, ఈ గుంపే తన బలం, ప్రతిష్ఠ అని వివరించారు. ఈ గుంపే పేదలకు, ప్రభుత్వానికి మధ్య వారధులని అన్నారు. హోదా, పదవి మారినా తాను ఎప్పటికీ రేవంతన్నగానే ఉంటానని చెప్పారు. పదవులు శాశ్వతం కాదనీ, ఈ అన్నదమ్ముల అనుబంధమే శాశ్వతంగా ఉంటుందని అన్నారు. అందరం కలిసి తెలంగాణను దేశంలోనే నెంబర్‌వ‌న్‌గా తీర్చిదిద్దుదామని కోరారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ పదేండ్లలో రూ.8.11 లక్ష‍ల కోట్ల అప్పులు చేసి దివాళా తీయించారని విమర్శించారు. పదేండ్లలో వందేండ్ల విధ్వంసం సృష్టించారని అన్నారు. కాంగ్రెస్‌ ‌రాకముందు మొదటి తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండేదా?అని ప్రశ్నించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొదటి తారీఖున ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం విడతల వారీగా రిటైర్మెంట్ బెనిఫిట్స్‌‌కు సంబంధించిన నిధులను విడుదల చేస్తున్నామని వివరించారు. ఇంకా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలనీ, చర్చించుకుని పరిష్కరించుకుందామని చెప్పారు. సంక్షేమ పథకాల అమల్లో ఉద్యోగుల కృషి ఉందన్నారు.

రోజుకు ఒక గంట అదనంగా పనిచేసి రాష్ట్ర ఆదాయం పెంచితే ఉద్యోగుల అవసరాలను తీర్చడానికి వాటిని ఉపయోగిస్తామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అది ఉద్యోగుల చేతుల్లోనే ఉందని చెప్పారు. మూసీ ప్రక్షాళన, మెట్రో రైల్‌ ‌విస్తరణ వంటి అభివృద్ధి పనులను చేయాలని అడ్డుకుంటామంటే కుదరదని ప్రతిపక్ష‍ాలను హెచ్చరించారు. కేసీఆర్‌ ‌కుటుంబాన్ని చింతమడకకే పరిమితం చేస్తామన్నారు. ఫామ్ హౌస్‌లో ఉంటే కుంభకర్ణుడు, బయటికి వస్తే బకాసురుడు అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాను రాష్ట్ర ప్రయోజనాల కోసమే పదే పదే ఢిల్లీ వెళ్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో మార్పు తీసుకొద్దామనీ, 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దుదామని అన్నారు. పీఆర్సీ, డీఏలు,పెండింగ్‌‌ బిల్లులు, సంక్ష‍ేమ పథకాలను అమలు చేసుకుందామని వివరించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడితే పెట్టుబడులను ఆకర్షించవచ్చని చెప్పారు.

పోరాడి తెలంగాణను సాధించిన ఉద్యోగులు కష్టపడి పనిచేసి ఆర్థిక వ్యవస్థను బాగుచేయలేరా?అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి ఉద్యోగులే బ్రాండ్‌ అంబాసిడర్లని కితాబిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్‌ ‌వెంకటస్వామి, అజారుద్దీన్‌, అడ్లూరి లక్ష‍్మన్‌ ‌కుమార్‌, ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్‌, సీఎస్‌ కే.రామకృష్ణారావు, జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఎమ్‌‌డీ ఎక్కా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ ‌కుమార్‌ ‌సుల్తానియా, కార్యదర్శులు సిక్తా పట్నాయక్‌, గౌరవ్‌ ఉప్పల్‌, డీజీపీ సీవీ ఆనంద్‌‌తోపాటు పలు బ్యాంకులకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

​దేశ చరిత్రలోనే తొలిసారి : భట్టి
ప్రభుత్వ ఉద్యోగులకు తమ ‘ప్రజా ప్రభుత్వం’ బంపర్ ఆఫర్ ప్రకటించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఒక్క రూపాయి భారం లేకుండా రూ.1.25 కోట్ల ఉచిత ప్రమాద బీమా, ​విమాన ప్రమాదమైతే రూ.రెండు కోట్ల నుంచి రూ.మూడు కోట్ల వరకు రక్షణ ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా ​కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్, తాత్కాలిక సిబ్బందికీ ఈ బీమా వర్తిస్తుందని వివరించారు. ​ఇలాంటి పథకాన్ని దేశచరిత్రలోనే తొలిసారిగా ప్రవేశపెట్టామని చెప్పారు. ఉద్యోగుల కుటుంబాల్లో భద్రత, భరోసా కల్పించేందుకే ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ పథకం కింద 18 నుంచి 60 ఏండ్ల వయస్సు గల ఉద్యోగులకు రూ.10 లక్షల జీవిత బీమా రక్షణ ఉంటుందన్నారు. ప్రమాదవశాత్తూ శాశ్వత సంపూర్ణ వైకల్యం లేదా పాక్షిక వైకల్యం సంభవించినా ఉద్యోగులకు ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. వారికి త్వరలోనే నగదు రహిత వైద్యం అందిస్తామనీ, ఆరోగ్య కార్డులను అందజేస్తామన్నారు. 2034 నాటికి ఒక ట్రిలియన్‌ ‌డాలర్‌ ఎకానమీ, 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఉద్యోగులు, బ్యాంకర్లు, ప్రభుత్వం సమష్టిగా, చేయి చేయి కలిపి ముందుకు సాగాలని ఆయన ఆకాంక్ష‍ించారు.

​ప్రభుత్వానికి కృతజ్ఞతలు : ఉద్యోగ జేఏసీ
ఉచిత ప్రమాద బీమాను అమలు చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఉద్యోగ జేఏసీ చైర్మెన్‌ ‌మారం జగదీశ్వర్‌, సెక్రెటరీ జనరల్‌ ఏలూరి శ్రీనివాసరావు కృతజ్ఞతలు చెప్పారు. ఇదే స్ఫూర్తితో ఉద్యోగులకు సంబంధించిన సీపీఎస్‌ ‌రద్, పీఆర్సీ, డీఏ బకాయిలు, పెండింగ్‌ ‌బిల్లుల సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. తెలంగాణను దేశంలోనే నెంబర్‌‌వన్‌‌గా నిలబెట్టేందుకు ఉద్యోగులు పనిచేస్తారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -