Saturday, June 27, 2026
E-PAPER
Homeజాతీయంఫోక్స్‌వ్యాగన్‌‌లో లక్ష మంది ఉద్యోగుల తొలగింపు!

ఫోక్స్‌వ్యాగన్‌‌లో లక్ష మంది ఉద్యోగుల తొలగింపు!

- Advertisement -

అడ్డుకుంటామన్న కార్మిక సంఘాలు
న్యూఢిల్లీ: జర్మనీ కేంద్రంగా పని చేస్తోన్న ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ లక్షమంది ఉద్యోగులను రోడ్డున పడెయ్యడానికి సిద్దం అవుతోంది. సంస్థ 89 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోందని రిపోర్టులు వస్తున్నాయి. ఇందులో భాగంగా సుమారు లక్ష మంది ఉద్యోగులను తొలగించాలని.. జర్మనీలోని నాలుగు తయారీ ప్లాంట్లను మూసివేయాలని సంస్థ సిఇఒ ఆలివర్ బ్లూమ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సవాళ్లు, చైనా నుంచి పెరుగుతున్న పోటీ, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్న క్రమంలో ఏర్పడిన అధిక వ్యయాలను అధిగమించేందుకు ఈ చర్యలు అవసరమని యాజమాన్యం భావిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా రాబోయే ఐదేళ్లలో పెట్టుబడులను సుమారు 15 శాతం తగ్గించి వాటిని 130 బిలియన్ యూరోల (దాదాపు రూ.13 లక్షల కోట్లు) స్థాయికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్‌ను, దాని విడిభాగాల తయారీ విభాగాలను వేర్వేరు సంస్థలుగా విభజించడం ద్వారా కంపెనీని పునర్నిర్మించాలని సిఇఒ ఆలివర్ బ్లూమ్, సిఎఫ్‌ఒ ఆర్నో ఆంట్లిజ్ నిర్ణయించినట్లు సమాచారం.

ఈ భారీ ప్రక్షాళనలో భాగంగా హానోవర్, జ్వికావ్, ఎండెన్, ఆడికి చెందిన నెక్సర్‌సుమ్ ప్లాంట్లలో ఉత్పత్తిని దశలవారీగా నిలిపివేయాలని సంస్థ ప్రతిపాదించింది. ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ ప్రపంచవ్యాప్తంగా 6,67,164 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఇందులో సుమారు 43 శాతం మంది జర్మనీలోనే పనిచేస్తున్నారు. ఈ తాజా నిర్ణయంతో మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 15 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది.ఈ ప్రతిపాదనలపై జర్మనీలోని కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందించాయి. 2024 ఒప్పందం ప్రకారం ఈ దశాబ్దం ముగిసే వరకు జర్మనీలో ప్లాంట్లను మూసివేసే ప్రసక్తే లేదని, ఒకవేళ యాజమాన్యం పాత మాట తప్పితే తాము శక్తివంచన లేకుండా అడ్డుకుంటామని ఐజి మెటల్ యూనియన్ హెచ్చరించింది. ఈ వార్తలపై ఫోక్స్‌వ్యాగన్ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘ఇవి గోప్యమైన పత్రాలు, వీటిపై ఇప్పుడే ఏమీ చెప్పలేము. కంపెనీ మనుగడ కోసం సమూల మార్పులు అవసరం. దీనిపై నిర్ణయాలను త్వరలోనే పాలక మండలి చర్చిస్తుంది.’ అని అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -