Monday, June 29, 2026
E-PAPER
Homeజాతీయంమొహర్రంలో విషప్రయోగం కుట్ర భగ్నం

మొహర్రంలో విషప్రయోగం కుట్ర భగ్నం

- Advertisement -

మొదట మహిళలనే టార్గెట్ చేసుకున్నట్టు వెల్లడి
అనంతరం చాక్లెట్లంటూ జనాలకు పంపిణీ

నిందితుడు అరెస్ట్

ముంబయి : దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో శుక్రవారం పెను కలకలం రేగింది. మొహర్రం ఊరేగింపుల సమయాన్ని టార్గెట్ చేసుకుని, ఊరేగింపులో పాల్గొనే భారీ జనసమూహంపై విషప్రయోగం చేయడానికి పన్నిన ఒక దారుణమైన కుట్రను ముంబయి పోలీసులు సకాలంలో చేధించారు. మొహర్రం రోజు దాదాపు 15000 మందికి ఎలుకల మందు పెట్టాలన్న కుట్ర ఓ సాధారణ మహిళకు వచ్చిన అనుమానంతో భగ్నమైంది. ఇప్పటికే కుట్రదారుడు ఫయాజ్‌ ప్రేమ్‌జీని పోలీసులు అదుపులోకి తీసుకొని ఎలుకల మందు (జింక్‌ పాస్ఫేట్‌) నింపిన 15,000 క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇంటెలిజెన్స్ సమాచారంతో దాడులు .. అనుమానితుడు అరెస్ట్
మొహర్రం ఊరేగింపుల వేళ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజల ప్రాణాలతో ఆడుకునేందుకు ఒక భారీ నెట్‌వర్క్ ప్లాన్ చేసినట్లు పోలీసులకు ముందస్తుగా నిఘా వర్గాల నుండి సమాచారం అందింది. ఈ సమాచారంతో అప్రమత్తమైన ముంబయి పోలీసులు నిర్దేశిత ప్రాంతాలలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఎలుకల మందుతో నింపబడిన వేలాది క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఈ పంపిణీ కుట్రకు పూనుకున్న ఒక ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

చాక్లెట్లు అంటూ జనాల్లోకి విసిరి.. 
15 వేలమంది టార్గెట్ ..!
నిందితుడు ఫయాజ్‌ ఈ విషపూరిత క్యాప్సూల్స్‌తో మహిళలనే ఎక్కువగా టార్గెట్‌ చేసుకోవాలని భావించాడు. తొలుత నొప్పి నివారణ మందులు, ఇమ్యూనిటీ బూస్టర్లంటూ కొందరికి పంచాడు. ఆ తర్వాత ‘చాక్లెట్లు’ అని చెప్పి జనాలపైకి విసిరాడు. రేయ్‌ రోడ్‌ రహ్మతాబాద్‌ స్మశానం వద్ద అతడు ఉచితంగా క్యాప్సూల్స్‌ పంచడంపై ఓ మహిళకు అనుమానం వచ్చింది. దానిని తెరిచి చూడగా అసాధారణ పౌడర్‌ వంటింది ఉండటంతో బైకుల్లా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు ఫయాజ్‌ను అరెస్టు చేసి.. 14,900 క్యాప్సూల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే 11 మంది వాటిని తిని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. తాను 15,000 మందిని చంపాలనుకున్నట్లు ఫయాజ్‌ పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. జింక్‌ పాస్ఫేట్‌ను మనిషి తిన్నప్పుడు అది శరీరంలోని ఆమ్లాలతో చర్య జరిపి.. పాస్ఫేట్‌ గ్యాస్‌ విడుదల చేస్తుంది. ఇది గుండె, ఊపిరితిత్తులు, లివర్‌, బ్రెయిన్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ విషానికి యాంటీ డోట్‌ కూడా లేదని నిపుణులు చెబుతున్నారు. నిందితుడు దాదాపు 50 కిలోల జింక్‌ పాస్ఫేట్‌,30 ఖాళీ క్యాప్సూల్స్‌ను కొనుగో లు చేసినట్లు తేలింది. అతడే ఓ గెస్ట్‌ హౌస్‌ లో వీటిని నింపినట్లు భావిస్తున్నారు.

ఊరేగింపులో పంపిణీకి ప్లాన్ ….
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకా రం.. నిందితుడు ఈ విషపు గుళికలను సాధారణ ఔషధాలుగా లేదా ప్రసాదం లాగా మొహర్రం ఊరేగింపులో పాల్గొనే అమాయక ప్రజలకు పంపిణీ చేయ డానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ క్యాప్సూల్స్ గనుక ప్రజల చేతికి అంది ఉంటే, నగరంలో ఊహించని రీతిలో భారీ ప్రాణ నష్టం సంభవించి ఉండేదని, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి ఉండే వని పోలీస్ అధికారులు తెలిపారు.

ముమ్మరమైన విచారణ.. 
పెద్ద నెట్‌వర్క్ పై అనుమానాలు
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ 14,900 క్యాప్సూల్స్ వెనుక కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే కాకుండా, దీని వెనుక ఏదైనా పెద్ద ఉగ్రవాద సంస్థ లేదా మతపరమైన కల్లోలాలు సృష్టించే ముఠా ఉందా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. నగరంలో ఇన్ని వేల విషపు గుళికలను ఎక్కడ తయారు చేశారు ? వీటి తయారీకి వాడిన ముడి పదార్థాలు ఎక్కడి నుండి తెచ్చారు ? ఈ కుట్రలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయాలపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా విచారిస్తున్నారు. ఈ ఘటనతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. మొహర్రం వేడుకలు, ఊరేగింపులు జరిగే ప్రాంతాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -