సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభం
జంతర్ మంతర్ వద్ద నీటి, పారిశుధ్య
సౌకర్యాలను నిలిపివేసిన ఢిల్లీ పోలీసులు
ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ లలో
రైతు నాయకుల గృహ నిర్బంధం
తొమ్మిదో రోజుకు చేరిన సీజేపీ ఆందోళన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వైద్య ప్రవేశ పరీక్ష నీట్‌తో సహా పరీక్షా విధానంలో జరిగిన అవకతవకల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జంతర్‌మం తర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జూన్ 20 నుంచి ఆందోళన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ఆందోళన ఆదివారం నాటికి తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా తొలుత వాంగ్‌చుక్, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సీజేపీ ప్రతినిధులు రాజ్‌ఘాట్‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం జంతర్ మంతర్ వద్దకు చేరుకుని రెండు నిమిషాల మౌనం పాటించిన అనంతరం సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను ప్రారంభించారు. ఆయన దీక్షకు మద్దతుగా
వందలాది మంది యువకులు, విద్యార్థులు జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. పలువురు రైతు నాయకులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు.
అనంతరం సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ నిరాహార దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్‌చుక్ కు మద్దతు తెలిపేందుకు వస్తున్న ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లకు చెందిన పలువురు రైతు నాయకులను జంతర్ మంతర్ చేరుకోకుండా నిరోధించేందుకు గృహ నిర్బంధంలో ఉంచుతున్నారని ఆరోపించారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం మరువకముందే తాజాగా టెట్ పరీక్షా పేపర్ లీక్ కారణంగా మహారాష్ట్ర టెట్ పరీక్షను రద్దు చేశారని, ఈ అవకతవకలపై జవాబుదారీతనం కోసం జరుగుతున్న నిరసనలో పాల్గొని మద్దతు తెలపాలని రైతులకు, విద్యార్థులకు, సంఘాలకు దీప్కే విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య కేవలం ఒక పరీక్షకు మాత్రమే పరిమితం కాదని, విద్యా వ్యవస్థలో పారదర్శకత, విశ్వాసంపై ఉన్న విస్తృత ఆందోళనలను ఇది ప్రతిబింబిస్తోందని తెలిపారు. దేశ పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజల విశ్వాసంపై తమకున్న తీవ్ర ఆందోళనలను తెలియజేయడమే తమ నిరసన లక్ష్యమని స్పష్టం చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ తన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన కొద్దిసేపటికే జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు నీటి, పారిశుధ్య సౌకర్యాలను నిలిపివేశారని అభిజీత్ ఆరోపించారు. ఈ విషయంపై అధికారులకు పదేపదే విజ్ఞప్తి చేసినా నిరసన ప్రదేశంలో ప్రాథమిక సౌకర్యాలను నిలిపివేశారని ఆయన పేర్కొన్నారు.
అనంతరం రాజస్స్తాన్లో పాఠశాల యాజమాన్యం వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అమైరా పుట్టినరోజు సందర్భంగా ఆమె కుటుంబం నిరసనా శిబిరం వద్దకు వచ్చి సంఘీభావాన్ని తెలిపింది. అంతేకాక అక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థుల కోసం అమైరా కుటుంబం ఆహారం తీసుకొచ్చింది. ఈ సందర్భంగా అమైరాకు సీజేపీ నివాళ్లర్పించింది. ఆమెకు న్యాయం జరిగే వరకు ఆమె కుటుంబానికి అండగా ఉంటామని సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే తెలిపారు. “అమైరా రాజస్తాన్‌లోని అతిపెద్ద పాఠశాలల్లో ఒకటైన నీరజ మోడీ స్కూల్ యాజమాన్యం వేధింపులకు గురై ఎనిమిది నెలల క్రితం పాఠశాల నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు ఆమె వయస్సు 9 సంవత్సరాలు. ఈ చిన్నారి ఆత్మహత్య తర్వాత, మీడియాకు, ఇతరులకు కనిపించకుండా ఉండేందుకు పాఠశాల యాజమాన్యం ఆ ప్రదేశంలోని రక్తాన్ని శుభ్రం చేయడమే కాక ఈ ఘటన నుంచి బయట పడేందుకు అనేక చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు ఆ పాఠశాల యాజమాన్యంపైనగానీ, ప్రిన్సిపాల్‌పై గానీ, ఉపాధ్యాయుడిపై గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేటికీ న్యాయం కోసం అమైరా కుటుంబం పోరాడుతూనే ఉంది. ’’
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



