ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు సెకెండ్ లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష రాసేందుకు 5,14,598 మంది అర్హులుకా గా, 4,98,695 (96.90 శాతం) మంది హాజరయ్యారు. 15,903 మంది గైర్హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. ఈ పరీక్షా సమయం ప్రారంభమయ్యాక 5 నిమిషాలు ఆలస్యం గా వచ్చిన వారిని లోపలికి అనుమతించారు. పరీక్ష ప్రారంభానికి ముందు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి కృష్ణ ఆదిత్య సికింద్రాబాద్, మారెడ్‌పల్లి ప్రాంతాల్లో పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పరీక్షల నిర్వహణ, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై సిబ్బందితో మాట్లాడారు. పరీక్షలు సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జారీ చేసిన మార్గదర్శకాల అమలును ఆయన సమీక్షించారు.
సికింద్రాబాద్‌లోని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్, సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజ్ ఆఫ్ గర్ల్స్, సెయింట్ మేరీస్ సెంచనరీ జూనియర్ కాలేజ్, మారేడ్‌పల్లిలోని ఎంఆర్‌ఎంఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్, ఎక్సలెన్షియా జూనియర్ కాలేజ్ కేంద్రాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లపై కార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షలన్నీ పూర్తయ్యే వరకు ఇవే ప్రమాణాలను కొనసాగించాలని ఆయన అధికారులకు సూచించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌తో పాటు జనగాం, సూర్యాపేట, నల్లగొండ, నిజామాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, వరంగల్, కరీంనగర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, ములుగు, మెదక్, ఖమ్మం, యాదాద్రి జిల్లాల్లోని కేంద్రాలను పరీక్షల అబ్జర్వర్లు సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పరీక్ష సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చివరి నిమిషంలో పరిగెత్తుకుంటూ వెళ్లవద్దనీ, ఒత్తిడికి గురి కాకుండా మిగిలిన పరీక్షలకు అరగంట ముందుగానే వెళితే మంచిదని అధికారులు విద్యార్థులకు సూచించారు.
మొదటి రోజు 96.90శాతం మంది హాజరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



