Thursday, February 26, 2026
E-PAPER
Homeజాతీయంఇది జాతీయ దోపిడీ

ఇది జాతీయ దోపిడీ

- Advertisement -

ఎన్‌ఎంపీ 2.0ని రద్దు చేయాలి : సీఐటీయూ డిమాండ్‌
న్యూఢిల్లీ
: దేశాన్ని విక్రయించడాన్ని ఆపాలని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని, నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపి)ని రద్దు చేయాలని సిఐటియు డిమాండ్‌ చేసింది. ఎన్‌ఎంపి 2.0ని జాతీయ దోపిడికి అత్యంత క్రూరమైన ప్రణాళికగా అభివర్ణించింది. రూ.16.72 లక్షల కోట్ల ప్రజా ఆస్తుల దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రతిఘటనా ఉద్యమాన్ని చేపట్టాలని పిలుపిచ్చింది. ఈ మేరకు సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఎలమారమ్‌ కరీం ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రారంభించిన ఎన్‌ఎంపి 2.0 (2026-2030)ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తోందని, దీన్ని పూర్తిగా తిరస్కరించాలని కోరింది. నిటి అయోగ్‌ అభివృద్ది పరిచిన ఈ పథకం రెండో దశ, దేశ ప్రభుత్వ రంగాన్ని నాశనం చేయడం ద్వారా ఒక పద్ధతి ప్రకారం దోపిడీ చేసే అత్యంత నిరంకుశమైన ప్రణాళిక అని విమర్శించింది. జాతీయ ఆస్తులన్నింటిని గుత్తగా దేశ, విదేశీ ప్రైవేటు కార్పొరేషన్లకు బదలాయించే పథకమని విమర్శించింది.

రూ.16.72 లక్షల కోట్లు విలువైన ఆస్తులను లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా ఆస్తుల దోపిడీ ప్రక్రియను మోడీ ప్రభుత్వం అనూహ్యమైన రీతిలో అత్యంత వేగంగా పూర్తి చేయాలని చూస్తోందని వెల్లడవుతోందని ఆ ప్రకటన విమర్శించింది. పైగా తొలుత అంచనా వేసిన రూ.10లక్షల కోట్ల కన్నా దాదాపు 67శాతం ఎక్కువ మొత్తాలు లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంది. ఎన్‌ఎంపి 1.0తో పోలిస్తే ఇది 2.6 రెట్లు ఎక్కువ అని పేర్కొంది. పైగా ఎన్‌ఎంపి 1.0 విజయవంతమైందని, 89శాతం లక్ష్యాన్ని సాధించామని ఆర్థిక మంత్రి గొప్పగా చెప్పుకోవడాన్ని సిఐటియు నిరసించింది. ప్రభుత్వం దీన్ని విజయంగా చెప్పుకుంటుంటే కార్మిక వర్గం మాత్రం ప్రభుత్వ ఆస్తులను పట్టపగలు దోపిడీ చేయడంగా భావిస్తోందని విమర్శించింది.

గనులు, హైవేలు, బొగ్గు, పోర్టులు ఇలా ఒకటి కాదు, అన్ని రంగాల్లోని ఆస్తులను చాలా తక్కువ మొత్తాలకే కట్టబెట్టేసోందని పేర్కొంది. మూల ధన పునర్వినియోగం అనే ముసుగులో దోపిడీకి పాల్పడే పెట్టుబడిదారీ ఎజెండాను అమలు చేస్తున్నట్లు ఎన్‌ఎంపి 2.0పై జరిగిన ప్రాధమిక అధ్యయనం వెల్లడిస్తోంది. ప్రస్తుత పెట్టుబడిదారీవాద శకంలో ప్రైవేటు కార్పొరేట్‌ దిగ్గజాలు ఇక ఎంత మాత్రమూ మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా, ఇప్పటికే వున్న ప్రభుత్వ ఆస్తుల నుండి అద్దెలు వసూలు చేసేందుకే వారిని ఆహ్వానిస్తున్నారు. నిజానికి దశాబ్దాలుగా ప్రజల పన్నులతో నిర్మించి, అమల్లో వున్న, ఎలాంటి రిస్క్‌ లేని బ్రౌన్‌ఫీల్డ్‌ మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రైవేటు కార్పొరేషన్లకు అప్పగించడమే దీని లక్ష్యంగా వుంది.

12 వ్యూహాత్మకమైన, అత్యంత కీలకమైన సేవా రంగాల నుండి కచ్చితంగా నగదు లభ్యత వుంటుందనే హామీ ఈ ప్రైవేటు సంస్థలకు ఇవ్వడమే. టోల్‌, యూజర్‌ ఫీజులు, టారిఫ్‌లు వసూలు చేసుకోవడానికి వారిని అనుమతించడమే. నిర్లక్ష్యమైన కార్పొరేట్‌ పన్ను కోతల వల్ల కలిగిన ప్రస్తుత ద్రవ్య లోటును పరిష్కరించడానికి అవసరమైన దేశ భవిష్యత్‌ ఆదాయాలను దెబ్బతీసేందుకు ఉద్దేశ్యపూర్వకంగా అమలు చేస్తున్న వ్యూహమిదని సీఐటీయూ విమర్శించింది. ప్రయివేటు కార్పొరేషన్లకు రెవిన్యూను శాశ్వతంగా బదిలీ చేసేలా ఎన్‌ఎంపి 2.0 ఫ్రేమ్‌వర్క్‌ వుందని విమర్శించింది. ఎన్‌ఎంపి 2.0 అనేది భారత కార్మిక వర్గానికి సంబంధించినంతవరకు కీలకమైన ప్రజా సేవల హక్కును తొలగించే మరో ఆర్థిక దాడేనని సీఐటీయూ ప్రకటన పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -