Thursday, February 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపోరాటస్ఫూర్తిని మరిపించేలా కుట్ర

పోరాటస్ఫూర్తిని మరిపించేలా కుట్ర

- Advertisement -

చరిత్రను కనుమరుగు చేసే వైఖరి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ప్రజా సంఘాల నాయకుల ఆగ్రహం
ప్రజల్లోకి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ నేపథ్యాన్ని తీసుకెళ్తామని వెల్లడి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవ పోరాట స్ఫూర్తిని మరిపించేలా కుట్ర చేస్తున్నారని పలు ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. చరిత్రను కనుమరుగు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకవర్గాల కుట్రలను, వైఖరులను ఎండగడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. మార్చి 8న అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం నేపథ్యంలో మార్చి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళా దినోత్సవ పోరాట నేపథ్యాన్ని తెలిపే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టనున్నట్టు వెల్లడించారు.

బుధవారం హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఉపాధ్యక్షులు ఎస్‌.రమ, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్రాములు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడారు.

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రజనీకాంత్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షులు లెనిన్‌ గువెరా, కార్యదర్శి అశోక్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం కార్యక్రమాల పోస్టర్‌ను విడుదల చేశారు. పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారు మహిళా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. భారత పౌరులందరూ సమానమని చెప్పిన రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ, హక్కులను కాలరాస్తూ మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నదని చెప్పారు. ప్రజలను విభజించి, ప్రజా ఉద్యమాలను పక్కదారి పట్టిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతోన్మాద, మనువాదంతో సంకుచితంగా మహిళలకు హక్కులు లేకుండా చేస్తున్నదని ఆవేదన వెలిబుచ్చారు.

ఒకవైపు మహిళలు ఉత్పత్తి రంగంతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తుంటే వారికి సరైనా వాటా, సమాన వేతనం దక్కకుండా వివక్ష చూపిస్తోందని విమర్శించారు. బీజేపీ పాలనలో దాడులు, దౌర్జన్యాలు, లైంగిక వేధింపులు పెరిగిపోయాయని భాస్కర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల ఉపాధిని దెబ్బతీసేలా నరేగా చట్టాన్ని రద్దు చేశారనీ, కార్మిక చట్టాలను తొలగించి 4 లేబర్‌ కోడ్లను తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల శ్రమకు తగిన గుర్తింపు రావాలనీ, వారు చేసే ఇంటి పనిని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మార్చి 1 నుంచి 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా, మార్చి 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌ శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తిని తెలిపే కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. మల్లు లక్ష్మి మాట్లాడుతూ విరామం లేకుండా జరుగుతున్న శ్రమదోపిడీకి వ్యతిరేకంగా మహిళలు పోరాడి హక్కులు సాధించుకున్న రోజును అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా జరుపుతున్నామని తెలిపారు.

మహిళలకు స్ఫూర్తినిచ్చేలా నాడు అమెరికాలో పని గంటల తగ్గింపునకు పోరాటం జరిగిందని చెప్పారు. నేడు పాలకవర్గాలు రకరకాల స్కీంల పేర్లతో మహిళల శ్రమను దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రజా సంఘాల కేంద్ర కమిటీల పిలుపులో భాగంగా క్షేత్రస్థాయి వరకు కార్యక్రమాలను చేయనున్నట్టు వెల్లడించారు. అనేక దేశాల ఆమోదంతో మార్చి 8ని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా గుర్తించారని తెలిపారు. నేటికీ మహిళల పరిస్థితులు మారలేదనీ, అనేక రూపాల్లో దాడులు జరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నించే వారి గొంతులను నొక్కుతూ, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్య్రం, సమానత్వాన్ని కాపాడుకుంటటూ లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడుదామని ఆమె పిలుపునిచ్చారు.

వెంకట్రాములు మాట్లాడుతూ శ్రామిక మహిళా దినోత్సవాన్ని ఒక ఈవెంట్‌లా జరుపుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రామికవర్గ ఉద్యమ స్పూర్తిని దెబ్బతీస్తున్నా యని విమర్శించారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ అంటూ కేంద్ర ప్రభుత్వం, రైజింగ్‌ తెలంగాణ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆ లక్ష్యాలను ఎలా సాధిస్తాయో చెప్పడం లేదన్నారు. కులవివక్ష, మహిళల పట్ల వివక్షకు వ్యతిరేకంగా సమానత్వాన్ని సాధించేందుకు ఏ విధమైన కృషి చేస్తారో చెప్పకుండా వికసిత్‌, రైజింగ్‌ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇప్పటికీ లైంగిక దాడులు ఆగలేదనీ, 85 శాతం మందికి పౌష్టికాహారం లేదనీ, మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారని తెలిపారు.

వందేండ్ల క్రితమే సాధించుకున్న హక్కుల కోసం మళ్లీ పోరాడాల్సిన సమయం వచ్చిందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.రమ తెలిపారు. బీజేపీ ప్రతి అంశాన్ని మతానికి, కులానికి అంటగడుతున్నదనీ, పిల్లల్ని కనడం, వస్త్రధారణ, ఆహారం అంటూ ప్రతి విషయంలో మత రాజకీయం చేస్తున్నదని విమర్శించారు. ఆకర్షణీయమైన పేర్లను పెట్టి లక్షలాది మంది స్కీం వర్కర్లను శ్రమ దోపిడీ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రజక కులానికి చెందిన మహిళ గుడిలోకి వెళ్లడాన్ని అడ్డుకుంటూ రెండు నెలల పాపను చంపారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమస్త ప్రజల హక్కులను కాలరాస్తున్న పాలకవర్గాల వైఖరికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కదిలి రావాలని ఆమె పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -