రాష్ట్ర చరిత్రలోనే ఘోరమైన పారిశ్రామిక ప్రమాదం జరిగి నేటికి ఏడాది కావస్తోంది. సంగారెడ్డి జిల్లా పాశ మైలారంలోని ‘సిగాచి’ పరిశ్రమలో ఆనాడు విస్ఫోటనం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఇంకా ఆ విషాదం కండ్ల ముందు కదలాడుతోంది. విస్పోటనం జరగ్గానే పదుల సంఖ్యలో అక్కడికక్కడే ప్రాణాలు వదిలిన కార్మికులు కొందరైతే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు మరణిం చారు, మరో ఎనిమిది మంది కనీస ఆనవాళ్లు లేకుండా మాడి మసైపో యారు. మొత్తం యాభై నాలుగు మంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పో యారు. కొందరు మినహా మొత్తం వలస కార్మికులే ఈ ప్రమాదంలో మృతిచెందారు. మృతదేహాలను వెలికితీసే పనిలో భాగంగా ఎనిమిది మంది ఆచూకీ లభించలేదు. పేలుడు అవశేషాలను లారీల్లో తరలించి ఓ గ్రౌండ్‌లో పోసి డిఎన్ఏ టెస్ట్ ల కోసం నిపుణులు ప్రయత్నించినా కనీస ఆనవాళ్లు కూడా లభించక పోవడం అన్నది అందరి హృదయాలను కలచి వేసింది.
30 జూన్ 2025 న జరిగిన ఈ ప్రమాదంతో రాష్ట్రమే కాదు దేశం మొత్తం దిగ్ర్భాంతికి గురైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోడీ తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. అధికార,ప్రతిపక్ష పార్టీల నాయకులంతా సిగాచీ పరిశ్రమ వద్దకు క్యూకట్టారు. ఛత్తీసుగఢ్,జార్ఖండ్ , ఒడిశా, బీహార్ ప్రాంతాల వలస కార్మిక కుటుంబాలు రోజుల తరబడి మృతదేహాల కోసం పడిగాపులు కాశారు. తెలంగాణలోనే అత్యధిక పరిశ్రమలు ఉన్న పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో అత్యధికులు వలస కార్మికులే. నిత్యం జరిగే ప్రమాదాల్లో ఈ వలస కార్మికులే బలైపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాదం జరిగిన మరుసటి రోజు సిగాచి పరిశ్రమ వద్దకు వచ్చారు. ప్రమాద ప్రాంతాన్ని అధికారులతో కలసి కలియ తిరిగి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. మృతి చెందిన ఒక్కో కార్మిక కుటుంబానికి కోటి రూపాయపరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. ప్రమాదం జరగ్గానే ప్రాధమిక విచారణ కూడా పూర్తి కాకుండానే ముఖ్యమంత్రి నోటి నుంచి కోటి రూపాయల ప్రకటన రావడం వెనుక ఒక రహస్య ఒప్పందం ఉండే ఉంటుంది. ఆర్ధిక దారిద్య్రంతో అల్లాడిపోతున్న బాధిత కార్మిక కుటుంబాలను శాంతపర్చే ఉద్దేశమే యాజమాన్యానిది, ప్రభుత్వానిది. అందుకే ప్రమాదానికి దారితీసిన కారణాలను, భద్రతా లోపాలను, యాజ మాన్య నిర్లక్ష్యాలను ఏవీ ప్రకటించ కుండా పరిహారం ప్రకటన మాత్రమే ఇచ్చి ఊరుకుంది ప్రభుత్వం. ఇక కంపెనీ ఎండి అమిత్ రాజ్ సిన్హా కూడా ముఖ్యమంత్రి ప్రకటించిన పరిహారం ఒక్కో మృతుని కుటుంబా నికి చెల్లిస్తామని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి. ఏడాదవుతున్నా బాధిత కుటుంబాలకు అవే కన్నీళ్లు, అదే ఆవేదన తప్ప పరిహారం ముచ్చట ఎప్పుడో పక్కదారి పట్టింది.
సిగాచి పరిశ్రమలో ప్రమాదానికి కారణం రియాక్టర్ పేలుడు కాదని ,డ్రయర్ సెక్షన్‌లో డస్ట్ ఎక్స్ప్లోజన్ జరిగిందని పరిశ్రమ యాజమాన్యం ప్రకటించింది. ఇక ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ యాజమాన్య తీవ్ర నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపింది. పరిశ్రమలో కార్మికుల భద్రతను యాజమాన్యం గాలికొదిలేసిందని,750 చదరపు అడుగుల విస్థీర్ణంలో 26 మృతదేహాలు పడి ఉన్నాయంటే నిర్మాణ లోపాలే కారణం అని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. అక్కడ మండే స్వభావం ఉన్న 17 టన్నుల మైక్రో క్రిష్టలైన్ సెల్యు లోజే కారణమని కమిటీ తన నివేదికలో పేర్కొంది. ఈ పదార్ధాన్ని నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఉంచారు. దాంతోనే డ్రయర్ సెక్షన్ లో డస్ట్ ఎక్స్ ప్లోజన్ జరగటంతో అది మండి 900 నుంచి 1000 డిగ్రీల ఉష్ణోగ్రత వెలువడింది.దీంతో కార్మికులు మాడి మసైపోయారు.
ఇదంతా పరిశ్రమ యాజమాన్య నిర్వాహణ లోపాలే అని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చింది. అడుగడుగునా పరిశ్రమలో నిబంధనలను తుంగలో తొక్కి లాభాలే ధ్యేయంగా యాజమాన్యం వ్యవహరించడం వల్లే ఇంతటి ఘోర ప్రమాదాన్ని చవిచూడాల్సి వచ్చిందని కమిటీ స్పష్టం చేసింది. రిటైర్డ్ సైంటిస్ట్ కలపాల బాబూ రావు బాధిత కుటుంబాల తరుపున హైకోర్టు ను ఆశ్రయించారు. బాబూరావు దాఖలు చేసిన కేసను విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వాన్ని, విచారణాధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత పెద్ద ప్రమాదం జరిగితే సాక్షులను సేకరించడంలోను, విచారణ తీరులోను చిత్తశుద్ది కన్పించడం లేదని చివాట్లు పెట్టింది. సిగాచి పరిశ్రమ రెడ్ కేటగిరీలో ఉంది, పన్నెండు శాఖల అధికారులు సమన్వయంతో నిర్ణీత వ్యవధిలో తనిఖీలు చేస్తే ఇంత ప్రమాదం జరిగేదా? ఎందుకు అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహించింది.
పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ పరిచి పెట్టుబడులను ఆహ్వానించే ప్రభుత్వాలు పరిశ్రమల భద్రతపై కనీస దృష్టిపెట్టవు. ప్రతి ఆరు నెలలకొకసారి జరగాల్సిన పరిశ్రమల్లో తనిఖీలు మొక్కుబడిగా జరుగుతున్నాయి. అసలు తనిఖీలు చేసేందుకు సరిపడా యంత్రాంగం కూడా లేదు. తెలంగాణలో హైరిస్క్ పారిశ్రామిక యూనిట్లు 4,130 ఉన్నా వీటిని తనిఖి చేసే అధికారులు కేవలం ఇరవై మంది ఉన్నట్లు సమాచారం. 2021లో దేశం మొత్తంలోని సాధారణ పరిశ్రమల్లో పట్టుమని పదిహేను శాతం పరిశ్రమల్లో తనిఖీలు చేయలేదని పలు నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. పైగా స్వీయ ధృవీకరణలను అనుమతించడం వంటి విధానపరమైన లోపాల వల్లే దేశంలో పారిశ్రామిక ప్రమాదాలు ఎక్కవ అవుతున్నాయని నిపుణులు చెపుతున్నారు. 2013- 2021 మధ్యలో దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీల చట్టం కింద నమోదైన కర్మాగారాల్లో సంభవించిన ప్రమాదాల్లో 10,208 మంది ప్రాణాలు కోల్పోయారు, దాదాపుగా 97 వేల మంది క్షతగాత్రులయ్యారు. వీరిలో ఎక్కువగా వలస కార్మికులే ఉండటం గమనార్హం. భారతదేశం లో సుమారుగా 14 కోట్ల మందికి పైగా వలస కార్మికులు ఉన్నట్లు అంచనా. వీరు దేశ జీడీపీకి పదిశాతం వాటాను అందిస్తున్నారు.
అయినా వీరు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మానసిక ఆరోగ్యం ,ఒత్తిడి సంబంధిత సమస్యల ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కొం టున్నారని అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. పరిశ్రమలు అనుమతి తీసుకున్న సామర్ధ్యానికి మించి ఉత్ప త్తులను చేయడం ,అందుకు కార్మికులపై పని వత్తిడి పెంచడం, కనీస నైపుణ్యాలు లేని ఈ కార్మికులను కీలక ప్రదేశాల్లో పనులు చేయించడం అన్నది సర్వత్రా జరుగుతున్నా, పర్యవేక్షించే వ్యవస్థ లేకపోవడం తరచూ ప్రమా దాలకు కారణమవు తున్నాయి. అభివృద్ధి వేగంగా జరగాలని ప్రభుత్వా లు తీసుకునే అనాలోచిత నిర్ణయాలే సమాజానికి, కార్మిక వర్గానికి చేటు చేస్తున్నాయి. అభివృద్ధి అంటే ప్రజల ప్రాణాలను ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని పణంగా పెట్టి కాదు కదా.
ఎక్కడ పరిశ్రమలో ప్రమాదం జరిగినా అది కార్మికుని లోపమే అన్నట్లుగా యాజమాన్యాలు, అధికారులు చూపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు సరైన విచారణ అన్నదే జరగదు, చార్జిషీటులు కూడా దాఖలు కావు. సింగపూర్‌లో పని ప్రదేశంలో కార్మికుడు చనిపోతే తక్కవ వ్యవధిలోనే విచారణ పూర్తిచేసి
నిర్లక్ష్యానికి కారణమైన యజమానికి జైలు శిక్షలు వేస్తారు. అదే ఆస్ట్రేలియాలో మ్యాన్ స్లాటర్ కేసుగా బుక్ చేసి చర్యలకు ఉపక్రమిస్తారు. కానీ మనదేశంలో చట్టాలు ఉన్నా అమలుకు నోచుకోవు. సిగాచి ఎండి అమిత్ రాజ్ సిన్హాతో పాటు ,ఇతర డైరెక్టర్లు చట్టాలలోని లొసుగులను ఉపయోగించు కుని చక్కగా బెయిల్ తెచ్చుకుని జైలు నుంచి బయటపడ్డారు.
ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి పెట్టుబడులను ఆకర్షించే పాలకులు ,ఆయా దేశాల్లో అమలు చేస్తున్న చక్కని పారిశ్రామిక, కార్మిక విధానాలను ఇక్కడ ఎందుకు అమలు చేయరు?ఎన్ని పరిశ్రమలు వచ్చాయి,ఎంత పెట్టుబడులు రాబట్టాము, ఎంత ఆదాయం వస్తుందన్న ధ్యాసే తప్ప కార్మికుల భద్రత పై పాలకులు కనీస దృష్టి పెట్టడం లేదు. సిగాచీ ఘోర ప్రమాదం నుంచి ప్రభుత్వం,అధికారులు గుణపాఠం నేర్చుకున్న ట్లేమీ కన్పించడం లేదు. నెల రోజుల హడావుడి తప్ప అంతా మామూలే అన్నట్లు ఉంది. సిగాచి పరిశ్రమ బాధితులకు ఇప్పటికైనా ముఖ్యమంత్రి ప్రకటించిన పరిహారం అందాలి. రెండు వందల పేజీల సాంకేతిక నిపుణుల కమిటీ నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయాలి, బాధ్యులపై వెంటనే కఠిన చర్యలకు ఉపక్రమించాలి. లేదంటే ప్రభుత్వం ఇచ్చే హామీలకు, చెప్పే మాటలకు ప్రజల్లో విశ్వాసం కోల్పోతుంది.
పి.వి.రావు, 9010153065
సిగాచి ఘటనకు ఏడాది: బాధితులకు కోటి పరిహారం ఏ‘మాయే’?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



