Tuesday, June 30, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘‘ మన్‌ కీ జూట్‌’’

‘‘ మన్‌ కీ జూట్‌’’

- Advertisement -

భారత ప్రధాని నరేంద్రమోడీ తన ‘మన్ కీ బాత్’ 135వ ఎపిసోడ్‌లో ఆదివారం దేశ ప్రజలకు మరోసారి నీతిపాఠాలు చెప్పారు. అయితే ఈసారి ధన్యవాదాలతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించడం, విదేశీ పర్యటనలను వాయిదా వేయడం వంటి దేశ ప్రయోజనాల కోసం ప్రజలు బాధ్యతగా వ్యవహరించారని ప్రశంసించారు. ప్రజలకు పొదుపు, త్యాగం, మిత వ్యయం చెప్పడం తప్పుకాదు. కానీ, ప్రజలకు చెప్పే సందేశం, సర్కార్‌ ఆచరణ ఒకేతీరులో ఉన్నాయా? అన్నదే అసలు ప్రశ్న. కష్టకాలంలో ప్రజలు త్యాగాలు చేయాలని పిలుపునివ్వడం మంచిదే, ఆ కష్టాలకు కారణాలేమిటన్నది వేరే అంశం. కానీ, ప్రభుత్వం తన ఖర్చులు, ప్రాధాన్యతలు, విధానాల విషయంలో ఎంతమేరకు మితవ్యయం పాటిస్తోంది? అన్నదే ప్రధాన ప్రశ్న.

ప్రజలు బంగారం కొనద్దని చెప్పే ముందు, దాని దిగుమతులు పెరగడానికి దారితీస్తున్న ఆర్థిక విధానాలపై ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసిందా? రూపాయి బలహీనపడటం, ద్రవ్యోల్బణం, పెట్టుబడు లపై అనిశ్చితి కార ణంగా ప్రజలు బంగారాన్ని భద్రమైన పెట్టుబడిగా ఎంచు కుంటున్న వాస్తవాన్ని విస్మరించలేం. బంగారం కొనుగోలు విలాసాలకు సంబం ధించినదే కాదు, దానిపై లక్ష‍లాది మంది స్వర్ణకారులు, చిన్న నగల దుకాణాలు, చేతివృత్తుల జీవనం ఆధారపడి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల ఉపాధిపై పడే ప్రభావం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. అలాగే విదేశీ పర్యటనలను తగ్గించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు చెప్పిన ప్రధాని, తన విదేశీ పర్యటనల వల్ల దేశానికి వచ్చిన ప్రత్యక్ష‍ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, దౌత్య ప్రయోజనాలపై కూడా స్పష్టమైన లెక్కలు చెప్పాలి కదా?
ఇక పెట్రోల్‌,డీజిల్‌ ‌పొదుపు పాటించాలని హితబోధ చేసిన మరుసటి రోజే మధ్యప్రదేశ్‌‌లో సౌభాగ్య సింగ్‌ ‌ఠాకూర్‌ అనే బీజేపీ నేత, పాఠ్య పుస్తక సంస్థ ఛైర్మన్‌‌గా నియమితులైనందుకు ఉజ్జాయినీ నుంచి భోపాల్‌ ‌వరకు భారీ వాహనాల కాన్వాయ్‌‌తో ప్రయాణించిన వీడియో వైరల్‌ అయింది. దీంతో ‘ప్రజలు మాత్రమే త్యాగాలు చేయాలా?’ అంటూ సోషల్‌ ‌మీడియాలో ప్రశ్నల వర్షం కురిసింది. అంతెందుకు పొరుగు రాష్ట్రం ఏపీలో కూటమి మంత్రి ప్రధాని మాటలను స్ఫూర్తిగా తీసుకుని సైకిల్‌‌పై అధికారిక కార్యక్రమానికి వెళ్లాడు. కానీ, ఆయన వెనుక కార్లు, మీడియా వాహనాలు పరుగులు పెట్టాయి. ఇక్కడ ‘పొదుపు’ కాస్త మరింత ‘భారం’ అయింది. ప్రజలు పాటించారు సరే, పాలకులకే క్రమశిక్ష‍ణ లేకపోతే ఎలా? అన్న నెటిజన్ల ప్రశ్నలకు సమాధానమేది?

మన్‌‌ కీ బాత్‌‌లో అతి ముఖ్యమైన సందేశం ప్రజలు మూఢ నమ్మకాలను వీడి శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిం చాలని సూచించడం. ప్రధాని చేసిన వ్యాఖ్యల్ని స్వాగతించాల్సిందే. శాస్త్రీయ దృక్పథం ప్రతి సమాజానికీ అవసరం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, అధికార పార్టీ నాయకుల వైఖరి ఆ సందేశానికి అనుగుణంగా ఉన్నాయా? అనే ప్రశ్న తలెత్తుతోంది. రాజ్యాంగంలోని 51(ఎ)(హెచ్) అధికరణం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ప్రతి పౌరుడి విధిగా పేర్కొంటుంది. కానీ విద్యారంగంలో ఎన్‌సీఈఆర్‌టీ చేస్తున్న దేమిటి? చరిత్ర పాఠాలను మార్పులు చేశారు. పదో తరగతి పాఠ్యాంశం నుంచి ‘డార్విన్‌ ‌పరిణామ సిద్ధాంతం’ తొలగించారు. వీటిపై విద్యావేత్తలు, శాస్ర్తవేత్తలు ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా కేంద్రం పట్టించుకోలేదు.
అలాగే శాస్త్రీయ ఆధారాలు లేని వాదనలు, మూఢ విశ్వాసాలను సమర్థించే వ్యాఖ్యలు బహిరంగ వేదికలపై వచ్చినప్పుడు ప్రభుత్వం లేదా అధికార పార్టీ వాటిని ఖండించడంలో చూపిన నిర్లక్ష్యంపై కూడా విమర్శలనేకం. కొన్ని విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్యం, భారతీయ జ్ఞాన సంప్రదాయాల కోర్సులు చేర్చడం, భూత వైద్యం లాంటి అంశాలు ప్రవేశపెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విజ్ఞాన శాస్త్రానికి విరుద్ధమైన ప్రచారాలు, అశాస్త్రీయ వాదన లు, మూఢ విశ్వాసాలను రాజకీయంగా ప్రోత్సహించే ధోరణులు పెరగడానికి కారణం కేంద్రమేనన్న సంగతి దేశమంతా గమనిస్తూనే ఉంది. శాస్త్రీయ దృక్పథం ప్రజలకు మాత్రమే బోధించే నీతి కాదు, అది ప్రభుత్వ విధానాల్లో, విద్యా వ్యవస్థలో, ప్రజా ప్రతినిధుల ప్రవర్తనలోనూ ప్రతిబింబించాలి.

ప్రజలు దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఆ త్యాగాలలో ప్రభుత్వం కూడా భాగస్వామి కావాలి. ప్రజలకు పొదుపు చెప్పే పాలకులు, ప్రభుత్వ వ్యయాల్లో కూడా అదే క్రమశిక్షణను చూపాలి. మాటలకు, చేతలకు మధ్య అంతరం పెరిగినప్పుడు ప్రజలు ప్రశ్నించడం సహజం. ‘త్యాగం ప్రజలకు, ప్రచారం ప్రభుత్వానికి’ అనే భావన బలపడకుండా ఉండాలంటే, ఆచరణ తన సందేశాలకు నిదర్శనంగా నిలవాలి. లేదంటే ‘మన్ కీ బాత్‌’లో ప్రధాని ఎన్ని హావభావాలు ప్రదర్శించినా, ఆవేదనగా మాట్లాడినా అది ‘మన్ కీ జూట్‌’నే అవుతుంది తప్ప దేశానికి ఒరిగేదేమీ ఉండదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -