బాధ్యతల స్వీకారం తర్వాత కానరాని సుప్రీం నేత
అమరికా-ఇజ్రాయిల్ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు : ప్రభుత్వ మీడియా
వీడియో, ఆడియో సందేశాలకే పరిమితం
తండ్రి అంత్యక్రియలకైనా హాజరవుతారా అని సందేహాలు
టెహ్రాన్ : అమెరికా-ఇజ్రాయిల్ దాడులలో మరణించిన తమ ప్రియతమ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి ప్రస్తుత సుప్రీం నేత, అలీ ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీ పైనే ఉంది. ఆయన తమ ముందుకు తొలిసారిగా ఎప్పుడు వస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలీ ఖమేనీ మరణానంతరం సుప్రీం నేతగా నియమితుడైన మొజ్తాబా ఇప్పటి వరకూ ప్రజలకు కన్పించలేదు. దీంతో ఆయన ఆరోగ్యం, అధికారాలు, అధికార మార్పిడిపై ప్రజలలో అనుమానాలు, ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అలీ ఖమేనీ చనిపోయి నాలుగు నెలలు దాటాయి. యుద్ధం కారణంగా ఆయన అంత్యక్రియలు వాయిదా పడుతూ వచ్చాయి. తాజాగా వచ్చే నెల 4న టెహ్రాన్‌లో అలీ ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ఖ్వోమ్‌లో ప్రదర్శనలు జరుపుతారు. ఇరాక్‌లోని పవిత్ర ప్రార్థనా స్థలాలలో పర్యటిస్తారు. జూలై 9న మష్‌హద్‌లో ఖమేనీ భౌతికకాయాన్ని ఖననం చేస్తారు.
సందేశాలతోనే సరిపెడుతున్నారు
మొజ్తాబా చేస్తున్న ప్రకటనలన్నింటినీ ప్రభుత్వ టెలివిజన్‌లో చదివి వినిపిస్తున్నారు. ప్రభుత్వ మీడియా వెబ్‌సైట్లలో ఆ ప్రసంగ పాఠాలను పెడుతున్నారు. మార్చి నెల మధ్యలో తొలిసారిగా ప్రజలకు సందేశం ఇస్తూ శత్రువులపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు. ఆ తర్వాత కూడా ఆయన ప్రకటనలన్నీ దాదాపుగా ఇదే ధోరణిలో కొనసాగుతూ అమెరికాపై ఆరోపణలు సంధించాయి. ఇటీవలి సందేశంలో…కాల్పుల విరమణ సమయంలో కూడా ప్రదర్శనలు నిర్వహించాలని, అందరూ సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు. మొజ్తాబా మానసికంగా చాలా దృఢంగా ఉన్నారని ఇరాన్ అధికారులు తరచూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు. గాయాల నుంచి ఆయన కోలుకుంటున్నారని, కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. అయితే ఎవరెన్ని హామీలు ఇస్తున్నప్పటికీ మొజ్తాబా దీర్ఘకాలంగా ఎవరికీ కన్పించకపోవడం ఊహాగానాలకు తెర తీసింది. కరజ్ వంటి ప్రదేశాలలో ‘కనిపించడం లేదు’ అంటూ పోస్టర్లు కూడా దర్శనమిస్తున్నాయి.
మొజ్తాబా తాజాగా ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ న్యాయ వారోత్సవాల సందర్భంగా ఆయన న్యాయ వ్యవస్థకు ఆదేశాలు జారీ చేస్తూ గత సంవత్సరం జూన్‌లో జరిగిన నేరాలకు బాధ్యులైన వారిని, ఫిబ్రవరిలో యుద్ధాన్ని ప్రారంభించిన వారిని గుర్తించి శిక్షించాలని సూచించారు. అయితే ఆయన వ్యక్తిగతంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలకు నేతలు వ్యక్తిగతంగా హాజరై తమ బలాన్ని, సంఘీభావాన్ని చాటిచెబుతారు. మొజ్తాబా ఇటీవలి కాలంలో తెర వెనుక క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని కొన్ని వార్తలు సూచిస్తున్నాయి. ఏదేమైనా మొజ్తాబా ఎక్కడ ఉన్నారనేది మాత్రం ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే ఉండిపోతోంది.
అందరి దృష్టి ఆయన పైనే
అలీ ఖమేనీ అంత్యక్రియలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరవుతారని అంచనా. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఒకే ఒక వ్యక్తిపై నిలిచింది. అయితే ఆయన చాలా కాలంగా ఎవరికీ కన్పించడం లేదు. ఆయనే ప్రస్తుత సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీ. సుప్రీం నేతకు చెందిన ప్రాంగణంపై ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ దళాలు యుద్ధం ప్రారంభించగా మొదటి రోజే అలీ ఖమేనీ మరణించారు. ఆయన కుమారుడైన మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారు. ముఖానికి, కాళ్లకు బాగా గాయాలయ్యాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా, అధికారులు ధృవీకరించారు కూడా. ఆ రోజు నుంచి నేటి వరకూ మొజ్తాబా ఎవరికీ కన్పించడం లేదు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వీడియోలు, ఆడియో రికార్డింగుల ద్వారా మాత్రమే ఆయనను చూడడం, చెప్పింది వినడం జరుగుతోంది.
మొజ్తాబా ఎక్కడ ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



