నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలో చేపట్టిన ఎస్ ఐ ఆర్ పక్రియ ప్రతి కుటుంబాన్ని బీఎల్ఓలు సందర్శించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని 17వ వార్డులో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ ఐ ఆర్ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఇంటింటికి నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఓటరు నమోదు, మార్పులు, తొలగింపులు, చిరునామా సవరణ వంటి అంశాల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా, నిష్పక్షపాతంగా, సమయానికి పూర్తి చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తరి పద్మ , జిల్లా గ్రంధాలయల మాజీ చైర్మన్ కేడం లింగమూర్తి , స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



