Wednesday, July 1, 2026
E-PAPER
Homeజాతీయంఎన్నికల కమిషన్ దిపక్షపాత వైఖరి

ఎన్నికల కమిషన్ దిపక్షపాత వైఖరి

- Advertisement -

న్యాయ వ్య‌వ‌స్థ జోక్యం చేసుకోవాలి
సర్‌‌పై సీజేఐ జస్టిస్ సూర్య‌కాంత్‌కు
23 ప్ర‌తిప‌క్ష పార్టీల సంయుక్త‌ లేఖ‌​​
ఎన్నికల ప్రక్రియపై న్యాయ సమీక్ష అవ‌స‌రం
​అన్ని వ్య‌వ‌స్థ‌లు విఫ‌ల‌మైన‌ప్పుడు ప్ర‌జాస్వామ్యం
న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను ఆశ్ర‌యిస్తుంది
​దేశంలో ఏం జ‌రుగుతుందో న్యాయ వ్య‌వ‌స్థ ప‌ట్టించుకోవాలి

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ఎన్నికల కమిషన్ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని ప్ర‌తిప‌క్ష ఇండియా బ్లాక్ పార్టీలు పేర్కొన్నాయి. ‘‘కేంద్రంలోని అన్ని వ్య‌వ‌స్థ‌లు విఫ‌ల‌మైన‌ప్పుడు, భార‌త ప్ర‌జాస్వామ్యం న్యాయ‌ వ్య‌వ‌స్థ‌ను ఆశ్ర‌యిస్తుంది. న్యాయ వ్య‌వ‌స్థ‌ అంత‌రా త్మ‌ను కోరుతున్నాం. దేశంలో ఏం జ‌రుగుతుందో న్యాయ వ్య‌వ‌స్థ‌ ప‌ట్టించుకోవాలి’’ అని కోరాయి. ప్రజాస్వామ్య విరుద్ధమైన స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ (ఎస్ఐఆర్) ప్రక్రియ కింద 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఐదు కోట్లకుపైగా ఓటర్లను మినహాయించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ 23 ప్రతిపక్ష పార్టీలు మంగ‌ళ‌వారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ సూర్యకాంత్‌కి సంయుక్తంగా లేఖ రాశాయి. కేంద్ర‌ ఎన్నిక‌ల సంఘం పాత్ర‌, సర్‌ వ‌ల్ల వివిధ రాష్ట్రాల్లో ఓట‌ర్లు ప్ర‌భావానికి గురైన విష‌యాన్ని లేఖ‌లో పేర్కొన్నాయి. ఈ లేఖ‌పై ఇండియా బ్లాక్‌లోని పార్టీలతో పాటు, అందులో భాగం కాని ఆప్, ‌డీఎంకే పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ కూడా సంతకం చేశారు. సర్‌ అంశంపై ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయాలని జూన్ 8న జరిగిన ఇండియా బ్లాక్ సమావేశం నిర్ణయించింది. ‘‘గత సంవత్సరం బీహార్‌లో ప్రారంభమైన ‌సర్‌ ప్రక్రియను, ఆ తరువాత ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అమలు చేశారు. ప్రతిపక్ష ప్రాబల్య ప్రాంతాలలో విధానాలను పాటించకుండా భారీగా ఓట్లను మినహాయించడం, దళితులు, వెనుకబడిన తరగతులు, మైనారిటీల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొల‌గించ‌డం, ‌సర్‌ ‌ముసుగు లో పౌరసత్వ పరీక్షలు నిర్వహించడం వంటి అనేక ఆరోపణలు సర్‌పై ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్‌లో అందించిన సమాచారంలో వ్యత్యాసాలు ఉన్నాయని, 27 లక్షల మంది ఓటర్లను ఒక ప్రత్యేక కేటగిరీలో చేర్చడంతో గత అసెంబ్లీ ఎన్నికలలో వారు ఓటు వేయలేకపోయారు. సర్‌ ‌నుంచి మినహాయిం చబడిన వారికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు, ఇతర హక్కులు అందకుండా చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ‘అక్రమ వలసదారులను’ కనుగొనడానికే సర్‌ అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఎంతమంది ‘అక్రమ వలసదారులను’ గుర్తించి, మినహాయించారనే గణాంకాలను ఎన్నికల సంఘం ఇంకా విడుదల చేయలేకపోయింది. ‌సర్‌‌తో పౌరసత్వ ధృవీకరణను ఓటర్ల జాబితాలో చేర్చాలా వద్దా అనే ఒకే అంశానికి పరిమితం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, కోట్లాది మంది పౌరుల భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టే చర్యలతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది’’ అని ప్రతిపక్షం ఆ లేఖలో ఎత్తి చూపింది. వివిధ రాష్ట్రాల్లో చేప‌డుతున్న సర్‌ ప్ర‌క్రియ‌తో పాటు ఎన్నిక‌ల సంఘం పాత్ర, ఎన్నిక‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల గురించి సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి సూర్య‌కాంత్‌కు లేఖ పంపిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్రెటరీ జైరాం ర‌మేష్‌ తెలిపారు.

సంఘీభావం, ఐక్య‌త‌, ప్ర‌తిఘ‌ట‌న‌తో ప్ర‌తిప‌క్ష పార్టీలు ఉన్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు. సీజేఐకి రాసిన లేఖలో మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, ఎంఎ బేబీ, డి.రాజా, మ‌మ‌తా బెన‌ర్జీ , తేజ‌స్వీ యాద‌వ్‌, అఖిలేశ్ యాద‌వ్‌, హేమంత్ సోరెన్, ఒమ‌ర్ అబ్దుల్లా, క‌పిల్ సిబ‌ల్‌, డెరిక్ ఒబ్రెయిన్ త‌దిత‌రులు సంత‌కం చేసిన‌ట్టు పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ సాగరిక ఘోష్ మాట్లాడుతూ ‌బీజేపీకి లబ్ది చేకూర్చేందుకే సర్‌ ప్రక్రియను వాడుకుంటున్నారని విమ‌ర్శించారు. ఎన్నికల ప్రక్రియపై న్యాయ సమీక్ష జరపాలని ప్రతిపక్షం కోరిందని ఆమె తెలిపారు. “ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు, బీజేపీ ప్రయోజనం కోసం సర్‌ ప్రక్రియను వాడుకుంటున్నారన్న విషయంలో ఎన్డీయేతర ప్రతిపక్షాల్లో సంపూర్ణ ఐక్యత ఉంది” అని అన్నారు. ఆమె ఆ సంయుక్త లేఖను ఒక అపూర్వమైన చర్యగా అభివర్ణించారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షం ఆరోపించిన విషయంపై న్యాయవ్యవస్థను సంప్రదించినట్టు తెలిపారు. ప్రతిపక్ష కూటమిలో విభేదాలు ఉన్నాయన్న సూచనలను కూడా ఆమె తోసిపుచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -