పదేండ్ల మీ పాలన…30 నెలల మా ప్రజా పాలనను సమీక్షిద్దాం
రైతుల కోసం 30 నెలల్లో రూ.1,75,000 కోట్లు ఖర్చుపెట్టాం
కేంద్రమంత్రులు రాష్ర్టానికి ఒరగబెట్టిందేం లేదు
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కల్ల : రైతు భరోసా నిధుల విడుదల సభలో సీఎం రేవంత్ రెడ్డి
తొలి విడతగా రూ.2,482 కోట్లు విడుదల
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతు సంక్షేమంపై ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం ఏ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆ సభలో పదేండ్ల బీఆర్‌ఎస్ పాలన…30 నెలల ప్రజా ప్రభుత్వ పాలనపై చర్చిద్దామని చెప్పారు. దీనికి బీఆర్‌ఎస్ నేతలు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. మాజీ సీఎం కేసీఆర్ మాదిరిగా తాను అబద్ధాల పునాదుల మీద పరిపాలన చేయబోనని స్పష్టంచేశారు. తప్పయినా, ఒప్పయినా ఉన్నది ఉన్నట్టే చెప్తాననీ, చెప్పిందే చేస్తానని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక నుంచి రైతు భరోసా నిధులకు సంబంధించిన రూ.2,482 కోట్లను సీఎం రేవంత్‌రెడ్డి మీట నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. తద్వారా రెండెకరాల వరకు ఉన్న 41.37 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడారు. రైతులు ఆత్మగౌరవంతో బతికేలా పరిపాలన సాగిస్తున్నామన్నారు. హైదరాబాద్ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బూర్గుల రామకృష్ణారావు నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు 19 మంది దాకా ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించినా కేవలం రూ.69 వేల కోట్లు మాత్రమే అప్పు చేశారనీ, మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను పదేండ్ల కేసీఆర్ హయాంలో రూ.8.11 లక్షల కోట్లు అప్పులు చేసి ఊబిలోకి నెట్టేసి వెళ్లారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీతాలు కూడా వాయిదాల పద్ధతిలో ఇస్తున్నారని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనకు చెప్పారని గుర్తుచేసుకున్నారు.
అందుకే తొలి క్యాబినెట్ సమావేశంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు… ప్రత్యక్షంగా, పరోక్షంగా కార్పొరేషన్లు, శాఖలు, ఇతరత్రా రూపాల్లో తెచ్చిన అప్పులేంటో తేల్చాలని డిప్యూటీని సీఎం భట్టి విక్రమార్కను కోరితే తవ్వినకొద్దీ అప్పుల కుప్పలు బయటపడ్డాయని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు అందేలా చూడాలని సీఎస్‌ను ఆదేశించా నన్నారు. బడిపిల్లల బట్టలు, మధ్యాహ్నభోజన కార్మికులకు, సర్పంచులు, ఎంపీటీసీలు, కాంట్రాక్టర్లకు గత ప్రభుత్వం వేలకోట్లు బకాయిలు పెట్టిపోయిందని వివరించారు. మిగులుతో ఏర్పడిన తెలంగాణ రాష్ర్టం కేసీఆర్ పాలనలో బికారిగా మారిందని విమర్శించారు. విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు తీసుకెళ్తున్నామని చెప్పారు.
ఉచిత కరెంటూ.. రుణమాఫీ పేటెంట్ మాదే
‘ప్రజాప్రభుత్వం 30 నెలల పాలనలో రూ.20,677 కోట్లతో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.7 వేల కోట్ల రైతు బంధు బకాయిలను పెండింగ్‌లో పెడితే క్లియర్ చేశాం. రైతు భరోసాను రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచాం. గత ప్రభుత్వం సివిల్ సప్లయ్ శాఖ వద్ద రైతులకు ధాన్యం డబ్బులు బకాయి పెట్టి పోతే వాటిని క్లియర్ చేశాం’ అని చెప్పారు. రైతు భరోసా కోసం ఇప్పటికే రూ.27 వేల కోట్లు ఖర్చుపెట్టామనీ, ఇప్పుడు మరో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేయబోతున్నామన్నారు. ఈ ఒక్క పథకానికే ఇప్పటివరకు రూ.36 వేల కోట్లు ఖర్చుచేశామని వివరించారు. ఉచిత కరెంటు, రుణమాఫీ పథకాలకు పేటెంట్ కాంగ్రెస్‌పార్టీనే అని చెప్పారు. పదేండ్ల పాలనలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం సివిల్ సప్లయ్ శాఖ ద్వారా రూ.1.68 లక్షల కోట్ల వడ్లను కొంటే…30 నెలల కాలంలోనే ప్రజా ప్రభుత్వం రూ.80 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసిందని తెలిపారు.
ఇప్పటిదాకా రూ. 1.75 లక్షల కోట్లను రైతుల కోసం ఖర్చుపెట్టామని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి నెలా రైతుల కోసం రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తే, తాము రూ.6వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్, బీజేపీపై సీఎం తీవ్ర విమర్శలు చేశారు. లక్ష కోట్ల రూపాయలు పెట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయ్యిందన్నారు. మూడేండ్ల నుంచి కాళేశ్వరం నుంచి చుక్క నీరు తీసుకోకపోయినా రాష్ట్రంలో 2.88 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించిన ఘనత తెలంగాణ రైతాంగానికి దక్కుతుందని కొనియాడారు. కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పిల్ల రాక్షసులు కాశీమజీలీ కథలతో మళ్లీ తప్పుడు ప్రచారాలు చేస్తే నమ్మే స్థితిలో జనం లేరని అన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ హయాంలో దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, కోటి ఎకరాలకు సాగు నీరు వంటి హామీలను ప్రస్తావించారు.
అన్నింటినీ గాడిన పెడుతున్నాం
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక రిటైర్డ్‌మెంట్ వయస్సును 61 ఏండ్లకు పెంచి, తమ ప్రభుత్వంపై రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ భారాన్ని మోపిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని కనీసం టైర్లకు ఫంక్చర్లు వేయించుకోలేనంత ఆర్థిక నష్టాల్లోకి నెట్టేస్తే, తాము దాన్ని గాడిన పెట్టి ప్రతి నెలా వెయ్యి కోట్ల ఆదాయం సంపాదించేలా చేశామన్నారు. సింగరేణిని లాభాల్లోకి తెచ్చామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తే, బీఆర్‌ఎస్ వాళ్లు ఆటో డ్రైవర్లను ప్రభుత్వంపైకి ఉసిగొల్పారని విమర్శించారు.
ఇది రైతు ప్రభుత్వం…: భట్టి
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ..తమది రైతు ప్రభుత్వమని అన్నారు. విత్తనాలు వేసే సమయంలో రైతు భరోసా ఇస్తే సాగుకు ఉపయోగపడుతుందని ఇప్పుడే విడుదల చేశామన్నారు. ఆశీర్వాద సభ కాదు..క్షమాపణ సభ పెట్టుకోవాలని మాజీమంత్రి హరీశ్‌రావు మాట్లాడటాన్ని తప్పుబట్టారు. రెండున్నరేండ్లలో రూ.1,56,496 కోట్లను రైతుల కోసం ఖర్చుపెట్టామని గుర్తుచేశారు. వాళ్లు ఖర్చుపెట్టిన దానికి రెండింతలు ఎక్కువ ఖర్చుపెడుతున్నామని తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణను అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారని చెప్పారు. రూ.21 వేల కోట్లతో ఒకేసారి 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని తెలిపారు. ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పథకం లేదన్నారు. రుణమాఫీ చేయకపోవడంతోనే రైతులు గత ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపారని చెప్పారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీఎస్ సంజయ్‌జాజు, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, రైతు కమిషన్ చైర్మెన్ ఎం.కోదండరెడ్డి, ప్రభుత్వ విప్‌లు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మెన్లు, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీతో ఉపయోగం లేదు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏమీ చేయట్లేదని సీఎం విమర్శించారు. ఒక్కొక్కరి ఖాతాలో ప్రధాని మోడీ వేస్తానన్న రూ.15 లక్షలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు వంటి హామీల అమలు ఏమైందని అడిగారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆపార్టీ అధ్యక్షుడు నితిన్ నబిన్ చెప్తున్నారనీ, అవన్నీ పగటికలలుగానే మిగిలిపోతాయన్నారు.
మీ అయ్య జాగీరా…
తనను రాజీనామా చేసి దిగిపోవాలని పిల్ల రాక్షసులు అంటున్నారనీ, దిగిపోనీకి తెలంగాణ మీ అయ్య జాగీరా? అని సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. పాపాల బైరవుడు కేసీఆర్ మళ్లొస్తే ఏం చేస్తాడని ప్రశ్నించారు. రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు ఇబ్బంది పడుతుంటే, అదే కేసీఆర్ వ్యాపారులను బెదిరించి తన ధాన్యాన్ని రూ. 4,200 చొప్పున అమ్ముకున్నాడని చెప్పారు. కేసీఆర్ పాలన మళ్లొస్తే ఫోన్ ట్యాపింగ్‌లు చేయడం, మొగుడూ పెండ్లాం మాటలు వినడం తప్ప చేసేదేం లేదన్నారు. ఎల్‌నినో నేపథ్యంలో తక్కువ నీటితో పండే పంటల్ని సాగు చేయాలని రైతులకు సూచిస్తే, దానిపైనా కేటీఆర్, హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ వద్దంటున్నారనీ, వారు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా, ప్రజా ప్రభుత్వం వాటిని చేపట్టి తీరుతుందని తేల్చిచెప్పారు. అరుంధతి సినిమాలో విలన్ పశుపతిని ఫామ్‌హౌజ్‌లో గొలుసులతో బంధించాననీ, బయటకు రానివ్వకుండా ప్రభుత్వానికి కంచె వేసుకుని కాపాడుకునే బాధ్యత రైతులదేనని సీఎం చెప్పారు.



