నిరుద్యోగాన్ని పెంచుతున్న మోడీ ప్రభుత్వం
బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజల సిద్ధం కావాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ-వలిగొండ రూరల్
‘‘రైతులు, కూలీలు, కార్మిక హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తోంది.. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ఉన్న ఉద్యోగాలను ఊడబీకుతూ నిరుద్యోగాన్నిపెంచుతోంది.. విద్య, వైద్య రంగాలను కార్పొరేట్ల చేతుల్లో పెట్టి ప్రజలను దోచుకుతినేలా ప్రోత్సహిస్తోంది.. అలాంటి మోడీ ప్రభుత్వాన్నిగద్దె దించేందుకు ప్రజలు సిద్ధం కావాలి’’ అని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి యాద్రాది భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామంలో సర్పంచ్ పైళ్ళ సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దేశంలో మోడీ ప్రభుత్వం కూలీలు, రైతులు, కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. ఉన్న ఉద్యోగాలను తొలగిస్తూ.. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ అధిపతుల చేతుల్లో పెడుతోందని, నిరుద్యోగాన్ని ఇంకా పెంచి పోషిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధనవంతులు మరింత దనవంతులుగా.. పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో విద్య, వైద్యాన్నికార్పొరేట్ అధిపతుల చేతుల్లో పెట్టి.. వారు ప్రజల్ని దోచుకుతినేందుకు అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. ప్రజా సమస్యలు పరిష్కారం చేయలేని, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించని పాలకులతో ఉపయోగం లేదని, గద్దె దిగిపోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రజా పోరాటాల్లో సీపీఐ(ఎం) ప్రజల పక్షాన ఎల్లప్పుడూ ఉంటుందని, ప్రజలతో కలిసి పోరాడుతామని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ.జహంగీర్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో 543 మంది సభ్యుల్లో కమ్యూనిస్టు సభ్యులు తప్ప మిగతా వారంతా వందల వేల కోట్ల రూపాయల అధిపతులని చెప్పారు. వారంతా కార్పొరేట్లు, పెట్టుబడిదారుల కోసం ఆలోచిస్తూ.. వారి కోసమే చట్టాలను మారుస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 14 కోట్ల మంది యువకులు నిరుద్యోగులుగా ఉన్నారని, ఏ ఉద్యోగ భర్తీ పరీక్ష జరిగినా.. అన్నీ లీకేజీలే అవుతున్నాయని, ఇది పాలకుల పాలనాతీరుకు నిదర్శనమన్నారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలను గెలిపిస్తే వాళ్లు రాష్ట్రానికి తీసుకొచ్చింది గుండుసున్నా మాత్రమేనని అన్నారు. ఈ సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య, గణపతి రెడ్డి, గడ్డం వెంకటేశం, బొడ్డుపల్లి వెంకటేశం, పీఎన్‌ఎం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గంటపాక శివ, ఈర్లపల్లి ముత్యాలు, నాయకులు వాకిటి వెంకటరెడ్డి, కందడి సత్తిరెడ్డి, గాజుల ఆంజనేయులు, కవిడే సురేష్, కళ్లెం సుదర్శన్ రెడ్డి, కొండే కిష్టయ్య, పైళ్ల ఉపేందర్ రెడ్డి, మంగ బాలయ్య, చెరుకు జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ల చేతుల్లో విద్య, వైద్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



