గుట్టలో హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్‌కు
మార్కెట్ ధరకే కేటాయింపులు : ఆలయ అభివృద్ధి సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
యాదగిరి గుట్టలో హరే రామ-హరే కృష్ణ ఫౌండేషన్ కోసం మార్కెట్ ధరకే భూములను కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వివిధ మఠాలకు భూముల కేటాయింపుల కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని ఆయన కోరారు. కుల సంఘాలకు స్థలం కేటాయింపుపై స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానం తయారు చేయాలన్నారు. భూ యాజమాన్యపు హక్కులు దేవాలయాల వద్దే ఉండాలని చెప్పారు. భూ కేటాయింపులపై తిరుమల అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాలని ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్.ఆర్.డీలో యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్, దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెకటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సీఎంవో సెక్రెటరీ మాణిక్ రాజ్, సీఎంవో ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, యాదాద్రి జిల్లా ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు హజరయ్యారు. యాదగిరి గుట్టపై గెస్ట్ హౌస్ ల నిర్మాణం కోసం ముందుకు వచ్చిన వారి జాబితా రూపొందించాలని సీఎం ఈ సందర్భంగా ఆదేశించారు. విడతల వారీగా గెస్ట్ హౌస్ ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలన్నారు. వాటి నిర్మాణం పై తిరుమల మోడల్ ను అనుసరించాలని సూచించారు. భూ సేకరణ కోసం తక్షణమే నిధులు మంజూరు చేయాలని ఆదేశించారు. యాదగిరి గుట్ట ఆలయం నిర్మాణం పై ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదిక పైన అధ్యయనం చేసి వారం లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పబ్లిక్ ప్రయివేట్ విధానం లో టూరిజం సర్క్యూట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.



