అధిక వడ్డీ ఆశ చూపి బాధితుల నుంచి వసూలు
సీపీకి బాధితుల ఫిర్యాదు
నవతెలంగాణ-మల్కాజిగిరి
కుషాయిగూడలో అధిక వడ్డీ ఆశ చూపించి పలువురు బాధితుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి దంపతులు పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధితులు మంగళవారం మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. కుషాయిగూడ చక్రిపురంలోని భగవాన్ కాలనీలో నివాసముంటున్న పబ్బా చంద్రశేఖర్ గత 30 ఏండ్లుగా శ్రీ వెంకటేశ్వర మార్కెటింగ్ పేరుతో సిమెంట్ డీలర్ వ్యాపారం నిర్వహిస్తూ స్థానికంగా అందరికీ పరిచయస్తుడిగా ఉన్నాడు. ఆల్ ఇండియా వైశ్య ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరించడంతో అతనిపై నమ్మకం ఏర్పడిందని బాధితులు తెలిపారు. కూతురు వివాహం, తండ్రి వైద్య చికిత్స, ఇంటి నిర్మాణం, సిమెంట్ కంపెనీలకు డిపాజిట్లు, జీఎస్టీ చెల్లిస్తే భారీ మొత్తం విడుదల అవుతుందంటూ వివిధ కారణాలు చెబుతూ పలువురి వద్ద అప్పుగా డబ్బులు తీసుకున్నాడు. అలాగే అధిక వడ్డీ ఇస్తానంటూ మరికొందరిని ఆకర్షించి, వారి ద్వారా కూడా ఇతరుల నుంచి నిధులు సమీకరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ నెల 22వ తేదీ నుంచి చంద్రశేఖర్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితులకు అనుమానం వచ్చింది. అనంతరం అతని ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉండటంతో పాటు, కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేకపోవడంతో మోసపోయినట్టు గ్రహించారు. ప్రారంభంలో స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్లారని సమాచారం ఇచ్చినా, అనంతరం అది తప్పుదోవ పట్టించే ప్రయత్నమని అనుమానం వ్యక్తం చేశారు. సుమారు 60 మంది బాధితుల నుంచి దాదాపు రూ.50 కోట్ల వరకు వసూలు చేసి పరారైనట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం బాధితులంతా మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, నిందితులను గుర్తించి తమకు న్యాయం చేయాలని సీపీని కోరారు.



