Wednesday, July 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపేద ప్రజల చెంతకే ఖరీదైన వైద్య పరీక్షలు

పేద ప్రజల చెంతకే ఖరీదైన వైద్య పరీక్షలు

- Advertisement -

జిల్లా ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ సేవలు ప్రారంభం
హైదరాబాద్ నుంచి వర్చువల్ విధానంలో 
ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
కలెక్టర్, ఎమ్మెల్యే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
 యాజమాన్యాన్ని అభినందించిన సీఎం

నవతెలంగాణ-భూపాలపల్లి
ప్రజలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్య సేవలను అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అ న్నారు. ‌మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సీఎ‌స్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎంఆ‌ర్‌ఐ యంత్రాన్ని సీఎం.. హైద రాబాద్ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలోనే ఎంఆర్‌ఐ సౌకర్యం అందుబాటులోకి రావడం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గతంలో ఇలాంటి ఖరీదైన వైద్య పరీక్షల కోసం పేదలు వరంగల్, హైదరాబాద్ వంటి సుదూర నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, దీనివల్ల వారికి సమయం, డబ్బు వృథా అయ్యేవని అన్నారు. ఇప్పుడు స్థానికంగానే ఈ సేవలు అందుబాటులోకి రావడం వల్ల సకాలంలో ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ జరిగి, మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. ప్రజా వైద్య సేవల బలోపేతానికి సీఎస్‌ఆర్ నిధులతో ఎంఆ‌ర్‌ఐ యంత్రాన్ని ఏర్పాటు చే‌యడానికి ప్రత్యేక చొరవ చూపిన జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మను, స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును, ఇందుకు సహకరించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాజమాన్యాన్ని సీఎం ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ.. హెచ్‌డీఎఫ్‌సీ సీఎస్‌ఆర్ నిధుల భాగస్వామ్యంతో ఈ అత్యాధునిక యంత్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు, మౌలిక వసతుల కల్పనకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, సీఎం సలహాదారు వేంరెడ్డి నరేందర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ‌కృష్ణారావు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మెన్ ఐత ప్రకాష్‌రెడ్డి, జిల్లా ప్రధాన ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ రాజేంద్రప్రసాద్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ బుర్ర కొమురయ్య, వైస్ చైర్మెన్ అంబాల శ్రీనివాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం, హెచ్‌డీఎఫ్‌సీ జోనల్ హెడ్ జోష్ స్టెఫీన్, క్లస్టర్ హెడ్ రాజేష్, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -