డీజీ సౌమ్య మిశ్రా
చర్లపల్లి చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కారాగార శాఖ–హైడ్రా ఆధ్వర్యంలో ప్రాజెక్టు ప్రారంభం
ఐఓసీఎల్ సీఎస్‌ఆర్ నిధులతో పునరుద్ధరణ పనులు
నవతెలంగాణ – మేడ్చల్ కలెక్టరేట్
నీటి భద్రత, భూగర్భ జలాల పెంపు, పర్యా వరణ పరిరక్షణకు చెరువుల పునరుద్ధరణ అత్యంత కీలకమని తెలంగాణ కారాగారాలు, సంస్కరణ సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా తెలిపారు. తెలంగాణ కారాగార శాఖ ఆధ్వర్యంలో హైడ్రా సహకారంతో, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) సీఎస్‌ఆర్ నిధు లతో మేడ్చల్ జిల్లాలోని చర్లపల్లి చెరువు పునరు ద్ధరణ, అభివృద్ధి ప్రాజెక్టుకు మంగళవారం శంకు స్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సంద ర్భంగా జరిగిన సభలో డీజీ మాట్లాడుతూ.. చర్లపల్లి చెరువును పునరుద్ధరించాక సమీప కాలనీలతోపాటు చర్లపల్లి ప్రిజన్ అగ్రికల్చరల్ కాలనీ, సెంట్రల్ జైలుకు వ్యవసాయం, చేపల పెంపకం, పశుసంవర్ధక కార్యకలాపాలు, పచ్చదనం నిర్వహణకు స్థిరమైన నీటి వనరుగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీలు ఈ పనుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారని, తద్వారా వారికి వృత్తి నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, బాధ్యతాయుత భావన పెంపొందుతాయని అన్నారు. వారు విడుదల అయ్యాక చెరువు సంరక్షణ, భద్రతా కార్యకలాపాల్లో ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఇది వారి పునరావాసానికి, సమాజంలో తిరిగి స్థిరపడేందుకు దోహదపడుతుందని చెప్పారు. చెరువు చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని చర్లపల్లి సెంట్రల్ జైలుతో అనుసంధానం చేయనున్నట్టు వెల్లడించారు. దీంతో చెరువు సంరక్షణ, భద్రతపై నిరంతర పర్యవేక్షణ సాధ్యమవుతుందన్నారు. ప్రాజెక్టు అమలుకు సాంకేతిక మార్గదర్శకత్వం అందించిన హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్‌ను అభినందించారు. సీఎస్‌ఆర్ నిధులు సమకూర్చిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చెరువు పరిసరాలను “ప్లాస్టిక్ రహిత ప్రాంతం”గా ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ, సమాజ సంక్షేమం లక్ష్యంగా తెలంగాణ కారాగార శాఖ, హైడ్రా, ఐఓసీఎల్ సంయుక్తంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని డీజీ చెప్పారు.
పర్యావరణ పరిరక్షణకు ఊతం : ఎమ్మెల్యే
చర్లపల్లి చెరువు పునరుద్ధరణ, అభివృద్ధి వల్ల పర్యావరణ పరిరక్షణకు ఊతం ఇచ్చినట్టు అవుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ప్రభుత్వ శాఖలు, సంస్థల సమన్వయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు స్థానిక ప్రజలకు ఉపయోగపడటంతో పాటు నగర అభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కారాగార శాఖ ఐజీ వై.రాజేష్, డీఐజీలు డాక్టర్ డి.శ్రీనివాస్, ఎం.సంపత్, ఎన్.శివకుమార్ గౌడ్, చర్లపల్లి ప్రిజన్ అగ్రికల్చరల్ కాలనీ సూపరింటెండెంట్ డి.భరత్, చర్లపల్లి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ జి.ప్రమోద్, వైమోస్ కన్సల్టెన్సీ ఎండీ యూనుస్, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీనాథ్, చర్లపల్లి ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ డీజీఎం సమ్రేష్ కుమార్, టెర్మినల్ డీజీఎం చిరంజీవి, మత్స్యకారుల సంఘం అధ్యక్షులు నర్సింహులు, కారాగార శాఖ, హైడ్రా అధికారులు, ఐఓసీఎల్ ప్రతినిధులు, ఉద్యోగులు, ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీలు పాల్గొన్నారు.
చెరువుల పునరుద్ధరణతోనే నీటి భద్రత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



