Saturday, February 28, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసత్యమే గెలిచింది

సత్యమే గెలిచింది

- Advertisement -

మీ అహంకారమే బీఆర్‌ఎస్‌ ఓటమికి కారణం:
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో క్లీన్‌ చిట్‌ పై కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సత్యమేవ జయతే…. అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం ట్వీట్‌ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఆమెపై మోపిన అభియోగాలను నిరాధారమైనవిగా పేర్కొంటూ న్యూఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు కేసును కొట్టివేసిన నేపథ్యంలో శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మద్యం కేసులో తనపై అనవసరంగా నిందలేశారనీ, అలా నిందలేసిన వారు ఇప్పుడేమంటారు? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ఓటమికి లిక్కర్‌ పాలసీ కేసు కారణమన్నట్టుగా ఆ ట్వీట్‌ ఉందని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అరెస్ట్‌ ఎన్నికల అనంతరం జరిగిందనీ, బీఆర్‌ఎస్‌ ఓటమికి ఉద్యోగాలు, ఇండ్లు ఇవ్వకపోవడం, ఉద్యమ ద్రోహులకు టికెట్లు ఇవ్వడం, అహంకారమే కారణమని అన్నారు.

కడిగిన ముత్యంలా వస్తాననీ తాను చెప్పినట్టుగానే తీర్పు వచ్చిందని ఆమె గుర్తుచేశారు. కేసును ఎదుర్కొంటున్న సమయంలో తనకు అండగా నిలిచిన తన అత్తమామలకు, భర్తకు, ఆ కుటుంబంలోని సభ్యులందరికీ కవిత ధన్యవాదాలు తెలిపారు. కష్టసమయంలో అండగా నిలిచిన తన తల్లిదండ్రులకూ ధన్యవాదాలు తెలిపారు. కోర్టు తీర్పు సంతోషం కలిగించినా, ఐదున్నర నెలలు తనను కుటుంబానికి దూరం చేశారనీ, అవమానాలు, బాధ, వ్యక్తిత్వ హననం చేశారనీ, ఆ నష్టం ఎవరు భర్తీ చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ అవమానం, సమయం తిరిగి రాదన్నారు. బీఆర్‌ఎస్‌ ఓటమిని తన మెడలో వేసేలా చూస్తే ప్రజలు హర్షించరనీ, వాస్తవాలు అంగీకరించి కేటీఆర్‌ నిజాలు మాట్లాడాలని సూచించారు. కేసును ఎదుర్కొంటున్న సమయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ, ఆ పార్టీ సోషల్‌ మీడియా విభాగం తనకు సహకరించలేదనీ, బీజేపీ చేసిన తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడంలో విఫలమైందని అన్నారు. పార్టీ స్థాపించబోయే రెండు నెలల ముందు తీర్పు రావటం తనకు ప్రకృతి ఆశీర్వాదంగా భావిస్తున్నట్టు తెలిపారు.

మద్యం కేసులో ఉన్న వారందరికి క్లీన్‌ చిట్‌ రావటాన్ని కవిత స్వాగతించారు. ఆ కేసు విషయంలో తన కుటుంబానికి అన్యాయం జరిగిందనీ, ప్రతి విచారణ సందర్భంగా కార్యకర్తలే తనకు నైతిక స్థైర్యం ఇచ్చారని అన్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు. ఆ కార్యకర్తల బలంతోనే కర్తవ్యం కోసం ముందుకెళ్తున్నట్టు చెప్పారు. తనపై కేసు బీఆర్‌ఎస్‌పై బీజేపీ కక్ష సాధింపు కోసం కాదా? అని ఆమె కేటీఆర్‌ను ప్రశ్నించారు. తాను జైలుకు వెళ్లాక తన కోసం బీఆర్‌ఎస్‌ పెద్ద నాయకులెవరూ నిలదీయలేదన్నారు. బతుకమ్మను ఎత్తుకుని జాతి సంస్కృతిని తెలిపిన బతుకమ్మ స్థానంలో లిక్కర్‌ బాటిల్‌ ఎత్తుకున్నట్టు బీజేపీ సోషల్‌ మీడియా అవమానిస్తుంటే బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఏమైంది? అని ప్రశ్నించారు. కోర్టు తీర్పును తమకు అనుకూలంగా మలుచుకుని పార్టీ ఓటమిని తన మెడలో వేయాలని బీఆర్‌ఎస్‌ చూస్తున్నదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ ఇప్పటికైనా సమీక్షించుకుని తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకుని ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆమె సూచించారు. బీఆర్‌ఎస్‌ మాదిరిగా తనకు సైన్యం లేదనీ, పిడికెడు మందితోనే ప్రజల పక్షాన పోరాడుతున్నట్టు తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటేననీ, అందుకే బీజేపీ మాట్లాడిందే బీఆర్‌ఎస్‌ మాట్లాడుతున్నదని కవిత ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -