స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నానని ప్రకటన
చెన్నయ్ : శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాడులో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం శుక్రవారం డీఎంకేలో చేరారు. 2021 ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించిన బోడినాయక్కనుర్ శాసనసభ స్థానం నుంచే రాబోయే ఎన్నికలలో ఆయన డీఎంకే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది. డీఎంకే కార్యాలయమైన అన్నా అరివాలయంలో ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. పన్నీర్‌సెల్వం రాష్ట్ర మంత్రి పీకే శేఖర్‌బాబుతో కలిసి ఒకే కారులో డీఎంకే కార్యాలయానికి చేరుకున్నారు. డీఎంకేలో చేరిక సందర్భంగా పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ ‘ప్రజలకు స్టాలిన్ సుపరిపాలనను అందిస్తున్నారు. ప్రజలు దానిని గమనిస్తున్నారు. ద్రవిడ ఉద్యమాన్ని, ద్రవిడ విధానాన్ని రక్షించేందుకు డీఎంకే కృషి చేస్తోంది. నేను ఇప్పుడు కేవలం ఓ కార్యకర్తగానే పార్టీలో చేరాను. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తాను’ అని చెప్పారు. స్టాలిన్ నాయకత్వాన్ని అంగీకరిస్తున్నానని తెలిపారు. అన్నా డీఎంకే నుంచి బహిష్కృతుడైన మరో నేత, ఎఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్‌ను ఆన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఎన్డీఏ గూటికి ఆహ్వానించారు. పన్నీర్ సెల్వంను ఎన్డీఏలో చేర్చుకునే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో మండిపడిన పన్నీర్ సెల్వం కొద్ది రోజుల క్రితమే స్టాలిన్‌తో భేటీ అయ్యారు. పన్నీర్ సెల్వం మద్దతుదారులైన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇటీవలే పార్టీకి రాజీనామా చేసి డీఎంకేలో చేరారు. గత ఆగస్టులో పన్నీర్ సెల్వం ఎన్డీఏ నుంచి బయటికి వచ్చారు. బీజేపీ శిబిరం తనను అవమానిస్తోందని ఆరోపించారు. ఆ తర్వాత ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అన్నా డీఎంకేలోని వర్గాలను కలపని పక్షంలో ఎన్డీఏలో చేరబోనని తేల్చి చెప్పారు. పన్నీర్ సెల్వం తమిళనాడుకు మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2001, 2014లో ఆయనను అన్నా డీఎంకే అధినేత్రి జయలలితే ముఖ్యమంత్రిని చేశారు. ఆమె మరణానంతరం 2016లో తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కొద్ది నెలలకే పదవిని కోల్పోయారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా, అన్నా డీఎంకే జాయింట్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. అయితే పళనిస్వామితో విభేదాలు పెరిగాయి. చివరికి 2022 జూలైలో పార్టీ నిబంధనావళిని సవరించిన పళనిస్వామి, ఆయనను అన్నా డీఎంకే నుంచి బహిష్కరించారు.
డీఎంకేలో చేరిన పన్నీర్ సెల్వం
- Advertisement -
- Advertisement -



