Friday, July 3, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిబాలారిష్టాల నగదు రహిత చికిత్స

బాలారిష్టాల నగదు రహిత చికిత్స

- Advertisement -

రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు కార్మికులు అంతా కలిసి రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపు పది లక్షల మంది ఉంటారు. వీరందరి సంక్షేమం చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ముఖ్యంగా వారి ఆరోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సౌకర్యాలు సదుపాయాలు సమకూ ర్చాలి. ఎందుకంటే వారే ప్రభుత్వా లకు ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తూ ప్రభుత్వ పథకాల రచనకు క్షేత్రస్థాయిలో వాటి అమలు, విజయానికి అహర్నిశలు కృషి చేస్తారు. కానీ, వీరిని పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, ఎంతోకాలంగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు డిమాండ్ చేస్తున్న నగదు రహిత చికిత్స పథకానికి ఎన్నో అధ్యయనాల తర్వాత ఎన్నో మీటింగుల తర్వాత కొలిక్కి వచ్చినట్లు ప్రభుత్వం హడావిడి చేసింది. జూన్ 2 నుండి ఉద్యోగ పెన్షన ర్లందరికీ ఈ పథకం అమలులోనికి రానున్నట్లు ఆర్భాటంగా ప్రకటించింది. చాలా ఆశ్చర్య కరంగా పథకం అమల్లోనికి రాకముందే వారందరి జీతాల నుండి అంటే మే నెల జీతం లేదా పెన్షన్ నుండి వారి మూల వేతనంలో 1.5శాతం కోతతో జీతాలు పెన్షన్లు విడుదల చేసింది. జీవితంలో కోతకోశారు కదా అని నగదు రహిత చికిత్స కోసం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లిన వారికి భంగపాటు తప్పలేదు. అంటే ఈ ఆరోగ్య పథకానికి సంబంధించిన విధివిధానాలు ఇంతవరకు ఖరారు కాలేదు.

ఏ కార్పొరేట్ ఆసుపత్రులు ఏ జబ్బుల నిమిత్తమై ఈ విధమైన నగదు రహిత చికిత్సకు ఒప్పుకున్నాయో వాటి లిస్టు విడుదల కాలేదు. ఏడాదికి కనీసం రెండుసార్లు ఆరోగ్యపరీక్షలు కూడా ఇందులో చేర్చితే బాగుంటుంది. అవుట్ పేషెంట్ సర్వీస్ ఇందులో చేర్చారా లేదా అనే విషయం కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. సహజంగా భార్యా భర్తలు ఇరువురు ఉద్యోగస్తులయితే కేవలం ఒకరి జీతం నుండి మాత్రమే 1.5శాతం కోత విధించి ఆ ట్రస్టుకు జమ చేయాలి. కానీ అత్యుత్సాహంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఇరువురు ఉద్యోగస్తులకు కోత విధించింది. కొన్ని శాఖలకు ఆరోగ్య రక్షణ పథకం అమలులో ఉన్నది. అయినప్పటికీ వారి జీతం నుండి 1.5శాతం కోత విధించి మిగిలిన మొత్తాన్ని విడుదల చేసింది.. అసలు జీతంలో కోత పనులు చేయవలసింది డిడిఓలు అంటే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ వద్దనే ఈ కోత పనులు జరిగాయి. ఎందుకింత తొందర? పథకం జూన్ నుండి అమలులోనికి వస్తే జూన్ మాసం వేతనం లేదా పెన్షన్ నుండి కోత విధించాలి. కానీ మే నెల నుండి ఈ కోతలు మొదలు పెట్టింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలు కూడా ఆశ్చర్య పోయిన పరిస్థితి. తమ కేడర్ నుండి వచ్చే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక సతమతమవుతున్నారు.

కొంత మంది పెన్షనర్లు తమ అనుమతి లేదా డిడిఓ లేదా ఎస్టిఓ ల ప్రమేయం లేకుండా కోత విధించినందుకు ఆగ్రహించి కోర్టు మెట్లు ఎక్కడానికి కూడా సిద్ధపడుతున్నారనేది గమనార్హం. అసలు ఉద్యోగస్తుల పెన్షనర్ల నుండి డబ్బులు వసూలు చేసి తాను కొంత మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తూ వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నట్టు చెప్ప డమే విడ్డూరంగా ఉంది. ఇది ఏ రకమైన సంక్షేమం అవుతుంది? ఇదేమీ ఉచితంగా ఇవ్వడం లేదు కదా. మే నెల 20వ తేదీ తరువాత నుండి రాష్ట్ర ప్రభుత్వం ఈ నగదు రహిత ఆరోగ్య పథకాన్ని అమలు చేయ డానికి ఉత్తర్వులు ఇస్తూ ఉద్యోగులను తమ కుటుంబ సభ్యుల వివరాలు వెంటనే సంబంధిత శాఖాధి పతులకు తెలియజేయమని కోరింది. పెన్షనర్లను కూడా అదే విధంగా కోరగా వారిలో చాలామంది పెద్దవారని కొంత మంది అందుబాటులో లేకపోవచ్చునని సంఘం ప్రాతినిధ్యం చేసిన పిమ్మట ఆరోగ్యశాఖ ఆ వివరాలను డిడిఓల నుంచి తీసుకోవడానికి సమ్మతించింది. అంటే ప్రతి దశలోనూ తొందర కనబడుతున్నది. నెల చివరికల్లా జీతాల కోతలకు పాల్పడింది. కొంతమంది ఇప్పటికే ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియం ఒక ఏడాదికి సరిపోను కట్టి ఉన్నారు. ఐచ్చికత అడగకుండా అందరి నుండి కోత విధించడం కూడా దుర్మార్గమే. కొంతమంది మరుసటి సంవత్సరము నుండి ఈ నగదు రహిత చికిత్సలో జాయిన్ అయ్యే వారేమో! కానీ ప్రభుత్వం బలవంతంగా అందరినీ ఈ పథకంలోనికి లాగింది. స్మార్ట్ కార్డులు తయారు కాలేదు.

ఉద్యోగ పెన్షనర్లకు ఇవ్వలేదు. హడావిడి నిర్ణయాలు తొందరపాటు చర్యలు. కోతలు చేయడంలో ఉన్న తొందర పధకం అమలులో కనిపించడం లేదు. అసలు కార్పొరేట్ ఆసుపత్రులతో ఒప్పందాలు జరిగాయా? వారు ఈ నగదు రహిత పథకం అమలుకు సిద్ధంగా ఉన్నారా? సహజంగా ఈ పథకం అమలుకు ఒప్పుకున్న కార్పొరేట్ ఆసు పత్రులు ఉద్యోగులకు పెన్షనర్లకు సరియైన చికిత్స అందించరని లేదా రెండవ రకమైన చికిత్స అందిస్తారని అపవాదు ఉంది. అంతేకాదు వారు నగదు చెల్లించిన వారి కంటే ఈ పథకం వారికి ఎక్కువ రేట్లు వేసి ప్రభుత్వం నుండి ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారని కూడా ప్రచారంలో ఉంది. ఇలాంటి వాటికి తావు లేకుండా ప్రభుత్వం పక్కాగా ఈ పథకాన్ని అమలు చేయాలి. ప్రభుత్వానికి దుబారా ఖర్చు అయితే ఉద్యోగులు పెన్షనర్లు సహించరనేది వాస్తవం. ఈఎస్ఐ లో కూడా కార్మికుల నుండి 0.75శాతం వసూలు చేస్తే ప్రభుత్వం 3.25 శాతం మ్యాచింగ్ గ్రాంట్ జతచేసి వారి ఆరోగ్య సంక్షేమానికై పాటుపడుతుంది. కానీ ఉద్యోగుల పెన్షనర్ల విషయంలో ఇది చాలా భిన్నంగా ఉంది.

అసలు ప్రభుత్వం ఈ కార్పొరేట్ ఆసుపత్రులకు కొట్లాది రూపాయలు ధారపోసే కంటే అదే డబ్బుతో ప్రభుత్వ ఆసుపత్రులను ఎందుకు బాగు చేయదు? అందులో సౌకర్యాలు ఎందుకు మెరుగుపరచడం లేదు? డాక్టర్లు, పరికరాలు, అవసరమైన సిబ్బంది సమకూర్చితే ఎవరు కూడా ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స కోసం వెళ్లరు. ఏదో ఒకరిద్దరు కలెక్టర్లు తమ డెలివరీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకుంటే సరిపోదు. ప్రజలకు వాటిపై విశ్వాసం కలిగేలా చేయాలి. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ ప్రభుత్వాలకు తెలియనిది కాదు. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రభుత్వ ఆసుపత్రులను నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేట్ల దోపిడీపై నియంత్రణ లేకుండా వారి అభివృద్ధికి తమ వంతు సహకారం అందజేస్తున్నది. ప్రభుత్వ వైద్యాన్ని ప్రోత్సహించాల్సిన నేతలు కార్పొరేట్ వ్యవస్థపై వాత్సల్యం చూపిస్తుండడం మన దౌర్భాగ్యం. తత్ఫలితంగా కార్పొరేట్ దోపిడీ ఇప్పుడు చట్టబద్ధం అవుతున్నట్టు లెక్క. ప్రభుత్వం ఆ ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లింపులు సకాలంలో చేస్తేనే ఈ పథకం సజావుగా జరుగుతుంది.

ప్రైవేట్ స్కూళ్లకు, ఇంజనీరింగ్ కళాశాలలకు చేయవలసిన చెల్లింపులు ఆపివేసిన సందర్భంలో అవి సమ్మెలకు దిగడం వారిని బెదిరించడం బుజ్జగించడం మనకు అనుభవమే. ఎలాంటి బాలారిష్టాలు లేకుండా ఈ నగదు రహిత ఆరోగ్య పథకం సజావుగా సాగుతుందని ఆశించవచ్చా? కాలమే నిర్ణయించాలి. ఇప్పుడు కొత్తగా బ్యాంకులతో ఎంఓయూలు కుదుర్చుకుని ఉద్యోగుల మరణానికి కోటి రూపాయలపైన ఇన్సూరెన్స్ కల్పిస్తున్నాం అని జూన్ 25వ తేదీన అట్టహాసంగా పథకం ప్రారంభించబడింది. అది ఏ మేరకు అమలవుతుందో కూడా చూడాలి. ముందుగా ఉద్యోగులను ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒత్తిడి లేకుండా పనిచేయనిస్తే అదే వారికి గొప్ప ఇన్సూరెన్స్ లాంటిది. ఎన్నికల ముందు పార్టీలుగా, పార్టీ నేతలుగా ఇష్టం వచ్చిన హామీలు వాగ్దానాలు వర్షం కురిపించడం మామూలే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిలబెట్టుకోవడంలోనే ప్రభుత్వాల సమర్ధత వెల్లడవుతుంది. పార్టీలుగా ఓటర్లను ప్రజలను మోసం చేయవచ్చు కానీ ప్రభుత్వాలుగా మోసం చేద్దామనుకుంటే ప్రజాస్వామ్యంలో అది చెల్లుబాటు కాదు. భవిష్యత్తులో దానికి తగిన మూల్యం చెల్లించవలసి ఉంటుంది.

శ్రీ శ్రీ కుమార్, 9440354092

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -