ఈ భూమి మీద జీవిస్తూ వచ్చిన మానవ జాతులన్నింటిలో ఒకే ఒక్కటి తప్ప, మిగతా మానవ జాతులన్నీ అంతరించి పోయాయి. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తమై ఉన్న జాతి హోమో సేపియన్! అంటే, వివేచన గల నరజాతి అని అర్థం! జంతు ప్రపంచంలో బలమైనవి చాలా ఉన్నాయి కానీ, తెలివిగలది ఒక్క నరజాతి మాత్రమే -నరజాతిలో హోమో సేపియన్ ఏర్పడక ముందు ఇతర నరజాతులు చాలా పుట్టాయి. వేల వేల ఏండ్లు భూమి మీద జీవించాయి. క్రమంగా అంతరించి పోయాయి. ఇప్పటికీ కొనసాగుతున్న మన మానవ జాతి మాత్రం హోమో సేపియన్! హోమో అనేది జీనస్. సేపియన్- అనేది స్పీసీస్. అంతరించిపోయిన నరజాతులన్నీ హోమో జీనస్ కిందే వస్తాయి. హోమో ఎరక్టస్, హోమో హబిలస్, హోమో నియాండర్ తలెన్సిస్ వగైరా వగైరా. ఈ రోజు ప్రపంచంలో మనిషైనవాడు ఏ దేశంలో ఉన్నా, ఏ ద్వీపంలో ఉన్నా అతని/ ఆమె శాస్త్రీయ నామం- హోమో సేపియనే! భూమిని, ప్రకృతిని, వాతావరణాన్ని అన్నింటినీ అర్థం చేసుకుంటూ, క్రమక్రమంగా అన్నింటినీ తన ఆధీనంలోకి తీసుకుని ఆధిపత్యం చాటుకున్న జాతి- హోమో సేపియన్! పాలిచ్చే జంతువుల్లో ఒకటిగా ఎదిగి, హోమినిడి గ్రూపు నుండి అభివృద్ధి సాధించి, నర జాతిగా రూపొంది, మళ్లీ అందులో అత్యున్న తమైన స్పీసీస్ పరిణామం చెందడం జరిగింది.
ఇదే వివరంగా అభయానం చేయాలంటే మానవ జీవ పరిణామం (HUMAN EVOLUTION) చదవాలి. ఈ విషయాలన్నీ సామాన్య పాఠకులకు అర్థం చేయించాలన్న తపనతో యువల్ నోవా హరారి అనే రచయిత ‘‘సేపియన్స్: ఎ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ హూమన్ కైండ్’’ – అనే గ్రంథం వెలువరించాడు. ఆ పుస్తకం ప్రపంచ పాఠకుల్ని విపరీతంగా ఆకర్షించింది. రాతి యుగం నుండి మనిషి నేటి ఆధునిక మానవునిగా రూపాంతరం చెందడం వరకు గల పరిణామాల్ని వివరించడంలో రచయిత హరారి సఫలీకృతుడయ్యాడు. మొదట 2011లో హీబ్రూ భాషలో వెలువడిన ఈ రచన, ఆ తరువాత 2014లో ఇంగ్లీషులోకి అనువాదమైంది. ఒక దశాబ్ద కాలంలోనే ఈ పుస్తకం సుమారు నలభై అయిదు భాషల్లోకి అనువాదం కావడం వల్ల ప్రపంచ పాఠకులకు అనతికాలంలో చేరువ కాగలిగింది. సామాన్య పాఠకుల ప్రశంసలు అందుకుంటూనే కొన్ని కొన్ని అంశాలలో శాస్త్రవేత్తల, తార్కిక మేధావుల విమర్శలకు కూడా గురైంది. ఈ రచయిత యువల్ నోవా హరారి వృత్తిపరంగా హీబ్రూ యూనివర్సిటీ ఆఫ్ జెరూసలం (ఇజ్రాయిల్)లో హిస్టరీ ప్రొఫెసర్. గతంలో బిగ్ హిస్టరీ, మిలటరీ హిస్టరీ, సోషల్ ఫిలాసఫీ, టెక్నాలజీ వంటి గ్రంథాలు ప్రచురించిన ఈ రచయిత మానవ పరిణామంపై దృష్టి పెట్టడం వల్ల కొన్ని మంచి రచనలు వెలువడ్డాయి.
HOMO DEUS: A Brief History of Tomarrow (2016)
21 Lessons for the 21st century (2018)
NEXUS: A Brief History of Information Networks the stone Age to AI (2024)
‘చరిత్ర – నేను’ అనే శీర్షికతో థీసిస్ ప్రకటించాడు.
HISTORY AND I: War relations between history and personal identity in Renaissance Military Memoirs (1450-1600) మిలట్రీ రంగానికి సంబంధించి పలు గ్రంథాలు ప్రకటించాక మానవ సమాజంలో సమైక్యతను సాధించడానికి చరిత్ర- అంతర్జాతీయ సంబంధాలపై అధ్యయనం చేశాడు. ఆక్స్‌ఫర్డ్ నుండి (2003-2005) డి. ఫిల్ తీసుకున్నాడు. 24 ఫిబ్రవరి 1976లో ఇజ్రాయిల్‌లోని కిరియాత్ అటాలో జన్మించిన హరారి, ప్రస్తుతం యాభై యేళ్ళ వయసులో ఉన్నారు. ఈయన ప్రత్యేకత ఏమిటంటే చరిత్రను, విజ్ఞాన శాస్త్రాన్ని, తత్త్వ శాస్త్రాన్ని కలగలిపి ప్రజారంజకం మిలట్రీ రచనలు చేయగలగడం! మానవ జాతులన్నింటిలో ఒక్క హోమో సేపియన్ అనేవాడే ఎందుకు జీవించి ఉన్నాడు? ఎందుకు విజయవంతంగా మనుగడ సాగిస్తున్నాడూ?
మిగతా హోమోలు ఎందుకు మనుగడ సాగించలేక పొయాయీ? సేపియన్ ప్రత్యేకతలేమిటీ? అన్న విషయాలు హరారి వివరంగా రాస్తూ వచ్చాడు. ఈ విషయం మీద ఈయన రాసిన పుస్తకమే మొదటిది కాదు. చాలా మంది వైజ్ఞానికులు, వైజ్ఞానిక రచయితలు లోగడ రాశారు. కానీ, ఈయన చరిత్రకారుడు కాబట్టి-ఆ దృష్టి కోణంలోంచి జనానికి సులభంగా అర్థమయ్యే విధంగా రాశాడు.
పాపులర్ సైన్స్ రచయితల్లో ఒకడిగా చేరిపోయాడు.
సేపియన్‌లకు ఉన్న ఆలోచనా శక్తి వల్లనే వీరు మిగతా హోమోల నుండి వేరుపడ్డారనీ, సుమారు డెబ్బయి వేల ఏండ్ల క్రితమే సేపియన్లు ఆలోచనా విప్లవాన్ని ప్రారంభించారని.. హరారి అంటాడు మిగతా హోమోలకు మెదడు పెద్ద పరిమాణంలో ఉన్నప్పటికీ వారెందుకు ఆలోచించా లేకపోయారూ? సేపియన్ మాత్రమే ఎందుకు ఆలోచించగలిగాడూ? అన్నది పెద్ద ప్రశ్న! కోతులు, తోడేళ్లు ఇంకా ఎన్నో ఇతర జంతువులన్నీ గుంపులుగా జోలిస్తున్నాయి. అయితే వాటి గుంపుల్లో వాటి సంఖ్య తక్కువగా ఉంటుంది. మనిషి మాత్రం తక్కువ గుంపుల్లో కాకుండా మిలియన్ల జన సమూహంతో కలిసి ఉండ గలుగు తున్నాడు. ఈ భూమి మీద ఉన్న అన్ని జీవుల మీద మనిషి ఆధిపత్యం కొనసాగుతూ ఉండడాన్ని మనం గమనిస్తున్నాం. కానీ, ఇది ఉన్నఫళంగా జరగలేదు. లక్షల ఏండ్ల పాటు ఇతర జంతువులు భూమి మీద తమ ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చాయి. ఆ తరువాత కాలంలోనే మనిషికి ఈ అవకాశం దక్కింది. అదికూడా అంచెలంచెలుగా సాధిస్తూ వచ్చాడు. అతని విజయ పరంపర స్థూలంగా ఈ విధంగా చెప్పుకోవచ్చునంటాడు యువల్ నోవా హరారి! సేపియన్స్ చరిత్రను ఇలా నాలుగు భాగాలుగా విభజించాడు.
1.ఆలోచనా విప్లవం-డెబ్బయి వేల ఏండ్ల క్రితం సేపియన్స్ ఆలోచించడం ప్రారంభించారు. ఇతర హోమోలతో పోలిస్తే, ఇది చాలా ఉన్నత స్థాయి మార్పు. 2.వ్యవసాయ విప్లవం – పదివేల ఏండ్ల క్రితం సేఫియన్స్ వ్యవసాయం చేయడం ప్రారంభించారు. దీని వల్ల వేటాడడం తగ్గింది. అధిక సంఖ్యాకులకు తిండి దొరికింది. అంతేకాదు, జీవన విధానంలో గణనీయమైన మార్పు వచ్చింది. 3.రాజ్యాల ప్రారంభదశ – సుమారు ఐదువేల ఏండ్ల క్రితం చిన్న చిన్న రాష్ట్రాలు ఏర్పరుచుకోవడం ప్రారంభమైంది. అవి విస్తరించి కొన్ని పెద్ద రాజ్యాలయాయి. దీనివల్ల వివిధ వృత్తులు, వాటి మధ్య సయోధ్య సహకారం ప్రారంభమైంది. స్థూలంగా మానవులు ఐక్యత మొదలైంది. సమాజానికి రూపకల్పన జరిగింది. 4.శాస్త్ర సాంకేతిక విప్లవం – ఇటీవలి కాలంలో అంటే సుమారు పదిహేను వందలకు కొంచెం ఇటూ అటూగా శాస్త్ర సాంకేతిక రంగాలు ఊపందుకున్నాయి. ఈ రంగంలో సమకాలీనంలో కూడా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసు కుంటున్నాయి. మనం నిత్యజీవితంలో చూస్తూనే ఉన్నాం. డెబ్బయి వేల ఏండ్ల క్రితం జరిగిన ఆలోచనా విప్లవంతోనే హోమో సేపియన్ జాతి, మిగతా నరజాతులన్నింటినీ వెనక్కి నెడుతూ ముందుకొచ్చింది. అంతేకాదు, నేటి ఇరవై ఒకటవ శతాబ్దపు శాస్త్ర సాంకేతిక యుగంలోకి – ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ యుగంలోకి వచ్చింది. మన పూర్వములైన అది మానవ జాతులు తూర్పు ఆఫ్రికాలో ఉండేవి. మన దగ్గరి బంధువులైన నియాండర్ తలెన్సిస్ యూరోప్‌లో ఉండేది.
హోమో ఎరక్టస్ జాతి అసియాను నివాసయోగంగా ఎంచుకుంటే- హోమోసోలెన్సిస్ జాతి జావా ద్వీపాన్ని ఆవాసంగా మలుచుకుంది. నరజాతులన్నీ తమకు సరిపోయే పర్యావరణాన్ని ఎన్నుకుని, నచ్చిన ఆహారాన్ని ఎంచుకుని జీవనం సాగించాయి. కొన్ని నరజాతులు ఆకారంలో భీకరంగా ఉండేవి. వేటలో ప్రావీణ్యం సంపాదించి అడవిపై, అడవి జంతువులపై ఆధిపత్యం సాధించాయి. శుద్ధ మాంసాహారులుగా కొనసాగాయి. మరికొన్ని జాతుల ఆకారాలు చిన్నగా ఉండేవి. ఇవి ఆకులు, అలములు, కాయలు, పండ్లు ఏరుకుంటూ, అవే తింటూ జీవనం సాగించాయి. ఇలా వేరు వేరు నరజాతులు ఒకే ప్రాంతంలో ఉండడం వల్ల, వాటి మధ్య లైంగిక సంపర్కాలు జరిగి, కాలక్రమంలో కొన్ని కొత్త జాతుల ఆవిర్భావం కూడా జరుగుతూ వచ్చింది. యూరోప్ లోని చాలా జాతులకు నియాండర్ తల్ మనిషే పూర్వీకుడని మానవ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇప్పటివరకు మనిషి సాధిస్తూ వచ్చిన విజయాలన్నింటికన్నా వేల సంవత్సరాల కాలంలో మనిషి నడిచొచ్చిన మార్గం – అతనిలోని పరిణామం అధ్యయనం చేయడమే గొప్ప విషయమంటాడు హరారి! ఎందుకంటే, చాలాకాలం క్రితమే మనిషి పిరమిడ్లు నిర్మించాడు. తర్వాత ఆధునిక కాలంలో చంద్రునిపై నడవగలిగాడు. ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ యుగంలోకి వచ్చారు. వీటన్నిటి కన్నా గతాన్ని తవ్వి, మానవుల అవశేషాల ఆధారంగా – భూమి పొరల ఆధారంగా గత కాలాన్ని కచ్చితంగా లెక్క కట్టడమే గొప్ప విజయం! తన పరిణామాన్ని తను తెలుసుకుంటూ రావడమే గొప్ప పరిశోధన.
ఇది ఎలా సాధ్యమైందీ? అంటే వివేచనగల సేపియన్ జాతికదా మనదీ! అందుకే సాధ్యమయింది! కొన్ని విషయాలలో యువత నోవా హరారి విమర్శలకు కూడా గురయ్యాడు. వ్యవసాయ విప్లవం మానవ చరిత్రలో అతి పెద్ద తప్పు అని ఈ రచయిత భావించాడు. జీవనం కోసం ఆది మానవుడి వేట సరైనదని, దానిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యేవారని – ఆ తరువాత వచ్చిన వ్యవసాయ విప్లవం కష్టించి పనిచేసే శ్రామికులి ఎక్కువ మొత్తంలో తయారు చేసిందనీ- ఈ వర్గమే పెత్తందార్లకు అధికారం, కట్టబెట్టిందనీ హరారి వాదిస్తాడు. అది కొంతవరకు నిజమే అయినా వేట సమాజాలలో ప్రగతి ఉండదు. నాగరికత ఉండదు. విద్య – పరిశోధన అసలే ఉండదు కదా! ఇదే కాకుండా హరారి ఒక్కోచోట తాత్త్వికుడిలా మారిపోయి గాబరా పడతాడు. భవిష్యత్తులో మనం ఎలా ఉండబోతున్నామో కదా? జెనటిక్ ఇంజనీరింగ్, సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు మన మీద తీవ్ర ప్రభావం చూపుతుందేమో కదా? అని బెంబేలు పడతాడు. చరిత్రలో మనిషి ఎప్పుడు సంతృప్తిగా ఉన్నాడు? ఒక పెద్ద ఏనుగును నేలకూల్చి నప్పుడా? క్రూర జంతువుల నుండి తప్పించు కున్నప్పుడా? భూమి దున్నినప్పుడా? మధ్య యుగాలలో పాపభీతితో వణికిపోయి నప్పుడా? ఇప్పుడు మితిమీరిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు లభిస్తున్నప్పుడా? ఎప్పుడు మనిషి ఆనందంగా ఉన్నాడూ? చివరకు ఈ అశేష జీవ జాలంలో మనం ఎవరం? మన ప్రస్థానం ఎటు? – అంటూ హరారి భావుకుడిగా ప్రశ్నిస్తాడు.
అయినా ఈ ప్రశ్నలు ఇప్పటివా? మానవ చరిత్ర ఎంత ప్రాచీనమైందో, ఈ ప్రశ్నలు కూడా అంతే ప్రాచీనమైనవి కదా? ఎంత ప్రాచీనమైనవో అంత నిత్యనూతనమైనవి కూడా ! అయితే, హరారి గూర్చి ఒక చేదు నిజం చెప్పుకోక తప్పదు. జన్యు లోపాల కారణంగా ఆయన థర్డ్ జెండర్ (Third Gender)కు చెందిన వ్యక్తి. తనకు మేనేజర్‌గా ఉన్న ఇట్కిజిక్ యహోవ్‌ను భర్తగా స్వీకరించాడు. వీరు కెనడా టోరెంటోలో పెండ్లి చేసుకున్నారు. టెల్ అవీవ్ నగరంలో ఒక మధ్యతరగతి కాలనీలో నివాసముంటున్నారు. ఇకపోతే ఆలోచనా విధానాలల్లో ఎంతటి విభేదాలున్నా, అందరికీ హక్కులు కలిపించే రాజాంగాన్ని ఏర్పరుచుకుని, మనుషులంతా ఒక్కటేనన్న భావనతో సమస్యల్ని పరిష్కరించు కుంటూ, వైజ్ఞానిక స్ఫూర్తితో భవిష్యత్తు దూసుకుపోతున్న మనిషికి అడ్డంటూ లేదు. మనుషులంతా మానవవాదులై ప్రపంచ శాంతికి పాటు పడుతూ ఉంటే- మనిషి పొందగలిగే సంతృప్తిని అక్షరాల్లో పెట్టలేం!
- జీవశాస్త్రవేత్త, సుప్రసిద్ధ సాహితీవేత్త.
ప్రొ. దేవరాజు మహారాజు



