వాన పడుతుందనే నమ్మకంతో రైతులు తొలకరి చినుకులు కురిసిన వెంటనే దుక్కులు దున్నారు. అప్పు చేసి విత్తనాలు కొన్నారు. ట్రాక్టర్లకు డబ్బులూ చెల్లించారు. కొందరైతే ధైర్యం చేసి విత్తనాలు కూడా చల్లేశారు. కానీ, ఆ తర్వాత ఆకాశం ముఖం చాటేసింది. నేలలో పడిన విత్తనం మొలకెత్తలేదు. కొన్నిచోట్ల మొలిచినా ఎండిపోయాయి. ఇప్పుడు అదే పొలాన్ని మళ్లీ దున్నాలా? మళ్లీ విత్తనం కొనాలా? లేక ఇంకో వానకోసం ఎదురు చూడాలా? అనే సందిగ్ధంలో రాష్ట్ర రైతాంగం ఉంది. పొలంలో పంట కనిపించకముందే పెట్టుబడి మట్టిలో కలిసిపోయింది. దీంతో దుక్కుల్లో పచ్చదనం కాదు… ఇప్పుడు దుఃఖమే మొలుస్తోంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కేరళను ఆలస్యంగా తాకడం, ఆ తర్వాత దేశవ్యాప్తంగా వాటి పురోగతి మందగిం చడం వల్ల ఖరీఫ్ సీజన్ తీవ్రంగా దెబ్బతింది. దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణం కంటే దాదాపు నలభై రెండు శాతం తక్కువగా నమోదైంది. జూలైలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం రైతుల ఆందోళనను మరింత పెంచుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో పదిహేడు జిల్లాల్లో లోటు వర్షాపాతం నమోదైంది. సాధారణంగా జూన్ చివరి నాటికి ఊపందుకోవాల్సిన ఖరీఫ్ సాగు ఈసారి ఆశించిన స్థాయికి చేరలేదు. గతేడాదితో పోలిస్తే సాగు దాదాపు సగానికి పడిపోయింది. ఇప్పటికే వేలాది మంది రైతులు తొలకరి జల్లులను నమ్ముకుని పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కందులు, పెసర వంటి పంటలు వేశారు. కానీ, తర్వాత వర్షాలు లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తలేదు. దీనికి తోడు ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులకు నీటి ప్రవాహం మందగించడంతో సాగు, తాగునీటి అవసరాలపై ఒత్తిడి పెరుగుతోంది. ఖరీఫ్ సాగు కీలకదశలో ప్రాజెక్టులు నిండకపోవడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. వర్షాభావం మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే చెరువులు, భూగర్భజలాలపై మరింత ఒత్తిడి పెరిగి వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది.
గత కొన్నేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు అన్నదాతను వరుసగా వెంటాడుతూనే ఉన్నాయి. ఒకసారి అతివృష్టి, మరోసారి అనావృష్టి, ఇంకోసారి అకాల వర్షాలు, వడగళ్ల వానలు, తుఫాన్లు… ఇలా యేటా ఏదో ఒక విపత్తు రైతు జీవితాన్ని కుదేలు చేస్తోంది. వ్యవసాయం ఇక లాభసాటి వృత్తి కాదనే భావన బలపడుతోంది. అందుకే చాలామంది యువ రైతులు కాడిని వదిలి పట్టణాలకు వలస వెళ్తున్న దుస్థితి నెలకొంది. ఇది వ్యవసాయ రంగానికి ప్రమాదకర సంకేతం. వర్షాల ఆలస్యానికి ‘ఎల్ నినో’ కారణంగా వాతావరణ నిపుణులు చెబు తున్నారు. అసలు ఎల్ నినో అంటే ఏమిటనేది, దాని ప్రభావం గురించి గ్రామీణ ప్రాంత రైతులకు తెలియదు. ఇది మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ దృగ్విషయం. దీని ప్రభావంతో భారత నైరుతి రుతుపవనాల తీవ్రత తరచుగా తగ్గిపోతుంది. వర్షపాతం సమయానికి కురవకపోవడం లేదా భారీ విరామాలు రావడం వల్ల ఖరీఫ్ సాగు తీవ్రంగా దెబ్బ తింటుంది. నీటి వనరులపై ఒత్తిడి పెరిగి బోర్లు, చెరువులు త్వరగా ఎండిపోతాయి. దిగుబడులు తగ్గడంతో రైతుల ఆదాయం క్షీణించి అప్పుల భారం పెరుగుతుంది. పశుగ్రాసం కొరత కూడా ఏర్పడి పశు సంపదపై ప్రతి కూల ప్రభావం పడుతుంది.
మొత్తమ్మీద ఎల్‌నినో ప్రభావం వ్యవసాయాన్ని మాత్రమే కాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా తీవ్ర సంక్షోభంలోకి నెట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇప్పుడు తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటుంది ఇదే.
వాస్తవానికి ప్రభుత్వం ఇలాంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలి. వర్షాలు ఆలస్యమైతే ప్రత్యామ్నాయ పంటల్ని ప్రోత్సహించేలా సూచనలు ఇవ్వాలి. రెండోసారి విత్తుకోవాల్సిన రైతులకు ఉచితంగా లేదా సబ్సిడీపై విత్తనాలందించాలి. వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేయాలి. పంట బీమా నష్టపరిహారం త్వరగా చెల్లించాలి. ఉపాధి హామీ పనులను విస్తరించి గ్రామీణ కుటుంబాలకు ఆదాయం కల్పించాలి. చెరు వులు, కుంటలు, సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలపై పెట్టుబడులు పెంచాలి. కానీ ఎక్కడా ఆ పరిస్థితి లేదు. ‘వర్షాలు రాకుంటే దానికి మేం ఏం చేస్తాం’ అన్న ధోరణి అధికార యంత్రాంగంలో కనిపిస్తోంది. వ్యవసాయం ప్రకృతిపై ఆధారపడినా, రైతు జీవితం ప్రభుత్వ విధానాలపై కూడా ఆధార పడుతుంది. ఆకాశం ఎప్పుడు కరుణి స్తుందో చెప్పలేం. కానీ ప్రభుత్వం మాత్రం రైతును నిరీక్షణలో వదిలేయకూడదు. దుక్కుల్లో దుఃఖం శాశ్వతం కాకూడదంటే, రైతు ఆశను నిలబెట్టే విధానాలే నిజమైన వర్షంగా మారాలి. రైతు పొలంలో మళ్లీ పచ్చదనం విరియాలంటే, ప్రకృతితో పాటు పాలనా సంకల్పమూ సమానంగా కురవాలి.
దుక్కుల్లో దు:ఖం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



