ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ)75 సంవత్సరాలు పూర్తి చేసుకుని జులై ఒకటిన 76వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ అప్రతిహత ప్రయాణంలో దేశంలోని ఇన్సూరెన్స్ ఉద్యోగుల జీవితాలను ఒక ఉన్నత స్థాయికి ఏఐఐఈఏ చేర్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే సందర్భంలో ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ఇన్సూరెన్స్ మారుమూల ప్రాంతాలకు విస్తరించాలని, చిన్న మొత్తాలను పొదుపుల రూపంలో సేకరించి ప్రభుత్వానికి అందించడం ద్వారా మౌలిక వసతుల కల్పనకు చేయూతను ఇవ్వాలని, పాలసీదారులకు అత్యంత నమ్మకమైన క్లేములను చెల్లించాలని- ఏ లక్ష్యాల కోసమైతే జాతీయకరణ చేయబడిందో ఆ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ఉద్యోగులను ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తూ ఎల్ఐసి ప్రగతికి ఏఐఐఈఏ ఎంతో దోహదపడింది అని చెప్పుకోవడం గర్వ కారణం. ఈ ప్రయాణంలో దివంగతులైన నేతలను స్మరించుకోవడం అంటే వారి త్యాగాలను మాత్రమే గుర్తించడం కాకుండా వారి లక్ష్యాలను ముందుకు తీసుకెళుతామని ప్రతిన భూనినట్లే. ఈ ముప్పాతిక ఏండ్లలో మూడు తరాల అహర్నిశల కృషిని ఒక్కసారి మననం చేసుకోవడం మన కర్తవ్యం.
మొదటి తరం: ఏఐఐఈఏ ఆవిర్భావానికి ముందు ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న అనేకమంది నాయకులు తాము ఎదుర్కొంటున్న అణచివేతలను ఎదిరించి 245 ప్రైవేటు కంపెనీల లోని అనేకమంది ఉద్యోగులను సమాయత్త పరిచి 1951 జూలై 1న ఏఐఐఈఏ సంఘాన్ని స్థాపించారు. ఏఐఐఈఏని స్థాపించిన వెంటనే ప్రైవేటు కంపెనీలు అన్నింటిని కలిపి ప్రభుత్వరంగ సంస్థగా ఏర్పాటు చేయాలనే ఉద్యమం మొదలుపెట్టారు. ఈ క్రమంలో హిందుస్థాన్ ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్న దివంగత నేత కామ్రేడ్ చంద్రశేఖర్ బోస్, మరి కొంతమందిని డిస్మిస్ చేశారు. 1954లో మెట్రోపాలిటన్ ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా యూనియన్ కార్యక్రమాలు చేపడుతున్నందుకు 54 మందిని ఉన్నఫళంగా డిస్మిస్ చేశారు. వీరందరినీ ఉద్యోగంలోకి తీసు కోవాలంటే క్షమాపణలు చెప్పి యూనియన్ కార్యక్రమాలలో పాల్గొనబోనని రాసిస్తే తప్ప జరగదని కుటుంబ సభ్యులను సైతం ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసిన ఆనాటి మేనేజ్మెంట్ కుయుక్తులను మన సంఘం నాయకులు ఉమ్మడిగా ఎదుర్కొని డిస్మిస్ నిర్ణయా లను మేనేజ్మెంట్ వెనక్కి తీసుకునేలా విజయం సాధించారు. ఆ తదనంతర కాలంలో 1సెప్టెంబర్1956న ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియా స్థాపించబడింది. ప్రభుత్వ రంగ సంస్థ స్థాపించబడింది కానీ దేశం మొత్తం మీద ఒకే పనిచేస్తున్న అనేకమందికి రకరకాల వేతనాలు చెల్లించబడుతుండేవి.
ఈ వివక్షను తప్పుబట్టి ఒకే పని చేస్తున్న వారందరికీ ఒకే రకమైన జీతభత్యాలు ఉండాలని “స్టాండర్డైజేషన్ ఆఫ్ పే స్కేల్” అనే నినాదంతో ఐదు డిసెంబర్ 1956న ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చి విజయం సాధించింది. అదే సందర్భంలో బోనస్ కూడా ఎందుకు చెల్లించాలి అనే ప్రభుత్వం మాటను వ్యతిరేకించి ఇన్సూరెన్స్ ఉద్యోగులు బోనస్‌కు అర్హులని ప్రభుత్వం ప్రకటించడంలో విజ యం సాధించింది. ఆ తర్వాత డబుల్ లింక్ డిఏ అనగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్‌లో నమోదవు తున్న ప్రతి మార్పును ఉద్యోగుల మూలవేతనంతో లెక్కించి చెల్లించే పద్ధతిని సాధించడం జరిగింది. రెండవ తరం: 1966లో ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ రంగాల్లో సూపర్ కంప్యూ టర్‌ను స్థాపించి దాని ద్వారా ఒక్కో సూపర్ కంప్యూటర్ స్థానంలో 14వేల మంది ఉద్యోగు లను తొలగించాలనే ఆలోచన చేసింది. ఉద్యోగుల ఉపాధికి ఎసరు పెట్టే సూపర్ కంప్యూటర్ మాకొద్దు అంటూ ఆటోమేషన్ స్ట్రగుల్‌ని 1966 నుండి 1969 వరకు నిర్విరామంగా ఏఐఐఈఏ కొనసాగించింది. ఈ క్రమంలో సూపర్ కంప్యూటర్లను ఏకపక్షంగా కలకత్తాలోని ఇలాకో బిల్డింగులో పెట్టాలని ప్రయత్నం చేస్తే రెండు సంవత్సరాల పాటు యూనియన్ నాయకులు కార్యకర్తలు రాత్రింబవళ్లు ఆ బిల్డింగు చుట్టూ గస్తీ తిరుగుతూ అడ్డుకున్నారు.
దాని ఫలితంగానే తర్వాత కాలాలలో రిక్రూట్మెంట్లు జరిగి అనేక మందికి ఉపాధి లభించింది. ఏఐఐఈఏ చరిత్రలో ఇలాకో విజిల్ అత్యంత ప్రాధా న్యమైన, వీరోచిత పోరాట ఘట్టంగా మిగిలింది. 1973 -74 ప్రాంతంలో ఇన్సూరెన్స్ ఉద్యోగులకు వేతన సవరణ జరపాలని కోరగా అప్పటి కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ జరిపేది లేదని ప్రకటిస్తూ దేశంలోని ఆరు డివిజన్‌లలో పాక్షిక లాకోటను ప్రకటించింది. అనగా ఒకే బిల్డింగులోని ఒక అంతస్తులో ఉద్యో గులు పనిచేయడానికి అవకాశం ఇస్తూ మరో అంతస్తులోని ఉద్యోగులను రావద్దని లాకౌట్ ప్రకటించింది. దీన్ని దీటుగా ఎదుర్కోవడం కోసం ఉద్యోగులందరూ మూకుమ్మడిగా ఎవరు కూడా లోపలికి వెళ్లరాదని ఏఐఐఈఏ పిలుపునిచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.14 రోజుల నిరవధిక సమ్మె అనంతరం లాకౌట్ ను ఎత్తివేస్తూ వేతన చదవడం కూడా నాటి ప్రభుత్వం ఇవ్వాల్సి వచ్చింది. ఆ తదనంతర కాలంలో బోనస్ చెల్లింపుపై మరో తిరకాసు పడింది. ఒకవైపు ఉద్యోగులందరినీ సమయాత్త పరుస్తూ నిరంతర నిరసన కార్యక్ర మాలు చేపడుతూనే మరోవైపు కోర్టు ద్వారా న్యాయ పరిష్కారానికి ప్రయత్నం చేసింది ఏఐఐఈఏ. అయితే కోర్టు నిర్ణయం మనకు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా ఎల్ఐసి అమలు చేయకపోతే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలు చేయాలని కూడా నినాదాలు ఇస్తూ అమలు జరిగేలా చూసింది ఏఐఐఈఏ.
1985లో ఎల్ఐసిని ఐదు ముక్క లుగా చేయాలని అంతకుముందే తయారు చేయబడిన SPLIT BILL లేదా ఎల్ఐసి రీ ఆర్గనైజేషన్ బిల్‌ను నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆధ్వర్యంలోని అప్పటి ప్రభుత్వం ముందుకు తీసుకురాగా, ఏఐఐఈఏ అప్పటి సహాయ కార్యదర్శి కామ్రేడ్ సునీల్ మైత్ర పార్లమెంటులో ధీటుగా ఎదుర్కొని ప్రధానమంత్రిని ఒప్పించి ఎల్ఐసి ముక్కలుగా కాకుండా ఆపగలిగారు. లేదంటే ఈరోజు ఎల్ఐసి కూడా దేశవ్యాప్తంగా ఐదు జోన్లుగా మాత్రమే ఉంటూ తనలో తానే పోటీపడి ప్రజలకు నష్టదాయకమైన పరిస్థితులుండేవి మూడవ తరం: 1991 నూతన ఆర్థిక విధానాల పరంపర అనంతరం 1993లో మల్హోత్రా కమిటీ నియమించడంతో ఇన్సూ రెన్స్ రంగంలో సమూల మార్పులకు ఆయన ప్రతిపాదనలు సిద్ధం చేసి తక్షణమే ప్రవేటికరించాలని సూచించారు. ఈ సూచనలపై ధీటుగా స్పందిస్తూ ఏఐఐఈఏ నాయకత్వం క్రమం తప్పని దేశవ్యాప్త పోరా టాలను నిర్వహించింది. అందుచేతనే 1994 నుండి 99 వరకు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయలేకపోయింది.
1999లో బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఐఆర్‌డిఏఐ స్థాపించినప్ప టికీ పోరాటం ఆగ లేదు. ఇన్సూరెన్స్ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని పెంచకుండా ఉండాలని నిరంతరం కృషి చేస్తూనే ఉన్నది ఏఐఐ ఈఏ. ఇలాంటి మహత్తర కృషి జరిగింది కాబట్టే ఇన్సూరెన్స్ రంగంలో వందశాతం ఎఫ్‌డిఐ పరిమితికి చేరుకోవడానికి ప్రభు త్వాలకు దాదాపు 36సంవత్సరాలు పట్టింది. ఎఫ్‌డిఐని వ్యతిరేకి స్తూనే ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో వాటాల ఉపసంహరణ జరగకూడదని కూడా ప్రతి సందర్భంలోనూ నిరసనలు పోరాటాలు జరుపుతూనే వచ్చింది. అందుచేతనే డిజిన్వెస్ట్మెంట్ ఆలోచన కూడా దాదాపు 30 సంవత్సరాలు దరిదాపుల్లోకి రాలేకపోయింది. ఈ ప్రయత్నాలు అన్నింటి ద్వారా ఎల్ఐసి ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడంలో సఫలీకృతమైంది ఏఐఐఈఏ.
నేటి తరం: 2026 మే 17న ఎల్ఐసి ఆఫ్ ఇండియా నుండి . 3.5శాతం వాటాల ఉపసంహరణ జరిగింది. ఈ వాటాల ఉపసంహరణ అనంతరం ఎల్ఐసి విలువను వాటా మార్కెట్ రేటు ఆధారంగా ప్రజలు చూసే పరిస్థి తులు ఏర్పడ్డాయి. నిజానికి ఎల్ఐసి వాటా మార్కెట్ రేటుకు ఎల్ఐసి వ్యాపార సమృద్ధికి ఎలాంటి సంబం ధమూ లేదు. వాటా రేటు పెరగడం లేదు కాబట్టి బోనస్ రేట్లు ప్రకటించారు. భువనస్రేట్లను ప్రకటించిన తర్వాత వాటాదారుల సంఖ్యలో పెరుగుదల వచ్చిందే గాని జరిగిన లాభమేమీ లేదు. ప్రైవేటు కంపెనీలు ఇన్సూరెన్స్ రంగాల్లోకి ప్రవేశించి 25 సంవత్సరాలు దాటిన తర్వాత ఎల్ఐసి మార్కెట్ వాటా పాతిక శాతానికి పైబడి తగ్గిపోయింది. ఇది నేటితరం ముందున్న ప్రధాన సవాలు. క్రమం తప్పని నూతన రీక్రూట్మెంట్లు జరగనందువల్ల ఎల్ఐసిలో యువరక్తం కొరవడింది. సీనియర్లు అనేకమంది రిటైర్ అవుతుండడంతో మిగతా వారికి పని ఒత్తిడి పెరిగిపోతున్నది. కేంద్ర ప్రభుత్వం స్వయాన 29 కేంద్ర కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చి కార్మిక హక్కులకు భంగం కలిగించింది. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుత తరం కర్తవ్యాలు మరింతగా పెరిగాయి. ఎల్ఐసి ఆఫ్ ఇండియా అని ప్రభుత్వ రంగంలో కొనసాగించడమే కాకుండా నూతన రిక్రూట్‌మెంట్ సాధిస్తూ ఏఐఐఈఏ మరింత బలోపేతం చేస్తూ శతవసంతాల సంబరాలకు ప్రయాణాన్ని కొనసాగించాలి.
గూళ్ల తిరుపతయ్య
9951300016



