వేతన పెరుగుదల అంతంతే
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లేదు
తక్కువ జీతాలతో కార్మికుల అవస్థలు
భారత్‌లో అసమానతలకు కారణమిదే..ఆర్థికవృద్ధిపై మోడీ సర్కారు గొప్పలు
దేశంలో దయనీయంగానే శ్రామికుల జీవితాలు..వారి శ్రమతో ‘కొద్దిమందికి’ విలాస జీవనం
కోట్లాది మందికి కనీస జీవన భద్రత కరువు..కేంద్రం తీరుతో పెరుగుతున్న ఆదాయ అసమానతలు
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ పాలనలో సాధారణ కార్మికుడి జీవితం అగమ్యగోచరంగా మారింది. భారత్‌లో ఆర్థిక వృద్ధి, ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లక్ష్యాలు వంటి ప్రచారాలను మోడీ సర్కారు చేస్తోంది. కానీ కార్మికుడి జీవితం కనీస అవసరాలు తీర్చుకోలేని స్థితిలోనే ఉంది. దేశంలో సంపద పెరుగుతున్నదని కేంద్రం గొప్పలు చెప్తున్నా.. అది సాధారణ కార్మికుడి జీవన ప్రమాణాలు వృద్ధి చెందేలా ఉండట్లేదు. సంపద ఫలితాలు కొద్దిమందికే పరిమితమవుతున్నాయి. కోట్లాది మంది కార్మికులు అత్యల్ప వేతనాలతో జీవన పోరాటం కొనసాగిస్తున్నారు. భారత్‌లో అసమానతలకు ప్రధాన కారణం సంపద కేంద్రీకరణ మాత్రమే కాదనీ, శ్రమకు తగిన జీతాలు లేకపోవడమేననే వాస్తవాన్ని ఈ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కారు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో దేశంలో ఆదాయ అసమానతలు పెరిగిపోతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు.
కార్మికుల తీవ్ర శ్రమతో
సంపన్నుల విలాస జీవనం
భారత్‌లో మంచి నాణ్యత గల భోజనం ఇద్దరు వ్యక్తులకు నెలకు సుమారు రూ.24 వేల వరకు ఖర్చవుతుంది. కుటుంబ వ్యయంలో ఆహారానికి సగటున 40 శాతం వెచ్చించాల్సి వస్తుంది. అలాంటి ఆహారం అందుకోవాలంటే కనీసం నెలకు రూ.60 వేల ఆదాయం అవసరం. కానీ దేశంలోని 95 శాతం కుటుంబాలకు అంత ఆదాయం లేకపోవడంతో నాణ్యమైన ఆహారం కూడా అందని స్థితి ఏర్పడింది. దేశంలో కొద్దిమంది మాత్రమే అనుభవిస్తున్న సౌకర్యాల వెనుక వేలాది మంది కార్మికుల చౌక శ్రమ దాగి ఉంది. తెల్లవారుజామునే పని ప్రారంభించే వంటవాళ్లు, రోజంతా శ్రమించే సర్వర్లు, పారిశుధ్య కార్మికులు, రైతులు.. ఇలా వీరందరికీ వారి శ్రమకు తగిన ఆదాయం దక్కడం లేదు. వ్యవసాయ ఉత్పత్తులు పండించే రైతులు కూడా చాలా సందర్భాల్లో లాభం లేకుండా సాగు చేస్తున్నారు. అంటే కొద్దిమంది సౌకర్యవంతమైన జీవితం మెజారిటీ ప్రజల తక్కువ ఆదాయంపైనే ఆధారపడి ఉందని సామాజిక పరిశీలకులు చెప్తున్నారు.
చాలా తక్కువ వేతన పెరుగుదల
అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని పారిశుధ్య కార్మికుడికి ఉద్యోగంలో చేరినప్పుడే నెలకు సుమారు 3,700 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.3.5 లక్షలు) వేతనం లభిస్తుంది. ఆరేండ్లలో అది 7,700 డాలర్లకు (దాదాపు రూ.6.4 లక్షలు) చేరుతుంది. అదే సమయంలో ఢిల్లీలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుడికి నెలకు రూ.18,500 మాత్రమే లభిస్తుంది. వార్షిక పెరుగుదలలు కూడా చాలా స్వల్పంగా ఉంటాయి. ఆరేండ్ల తర్వాత కూడా సదరు కార్మికుడి వేతనం రూ.22 వేల వరకే చేరుతుంది. ప్రభుత్వ ఉద్యోగి అయితే గరిష్ఠంగా రూ.32,800 వరకు పొందే అవకాశం ఉంటుంది. అంటే న్యూయార్క్‌లో ఒక కార్మికుడు రెండు రోజుల్లో సంపాదించేది.. ఢిల్లీలోని కాంట్రాక్ట్ కార్మికుడు నెలంతా పనిచేసినా సంపాదించలేని పరిస్థితి ఉంది. ఫుడ్ డెలివరీ వంటి గిగ్ ఉద్యోగాల్లో కూడా ఇదే వ్యత్యాసం కనిపిస్తోంది. న్యూయార్క్‌లో చట్టబద్ధ కనీస వేతన హామీ ఉండటంతో డెలివరీ ఉద్యోగి నెలకు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు సంపాదించగలుగుతున్నాడు. ఢిల్లీలో అదే పని చేసే వ్యక్తికి నెలకు రూ.30 వేల ఆదాయం రావడమే కష్టంగా మారుతోంది.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎక్కడ?
ప్రభుత్వ రంగ ఉద్యోగాల సంఖ్య కూడా భారత్‌లో చాలా తక్కువ. నార్వేలో మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 31 శాతం మంది ప్రభుత్వ రంగంలో పనిచేస్తుండగా, అమెరికాలో ఇది సుమారు 15 శాతం ఉంది. భారత్‌లో మాత్రం వివిధ అంచనాల ప్రకారం 4 నుంచి 8 శాతం మధ్యే ఉంది. అంతేకాదు. ఇప్పటికే మంజూరైన ప్రభుత్వ ఉద్యోగాల్లో 20 శాతానికి పైగా ఖాళీలు భర్తీ చేయకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగాల్లో వేతనాలు కొంత ఎక్కువగా ఉండగా, అదే పని చేసే ప్రయివేటు, కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. కొన్ని రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగి వేతనం, అదే స్థాయి ప్రయివేటు ఉద్యోగి వేతనానికి ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. వేతన నిర్మాణంలో సమతుల్యత తీసుకురావడం, ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య పెంచడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచవచ్చని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.
అదే వాస్తవ అభివృద్ధి
దేశంలో నిజమైన అభివృద్ధి సాధించాలంటే కేవలం జీడీపీ పెరుగుదల, పెట్టుబడులే కాదు.. కార్మికులకు గౌరవప్రదమైన వేతనాలు, సముచిత పన్ను విధానం, ప్రభుత్వ ఉద్యోగాల విస్తరణ, స్థానిక సంస్థల బలోపేతం, నాణ్యమైన ప్రజా సేవలు కూడా అవసరమని సామాజిక శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న తక్కువ వేతనాల ఆర్థిక వ్యవస్థ మారనంత వరకు ఆదాయ అసమానతలు తగ్గే అవకాశాలు లేవని వివరిస్తున్నారు. కోట్లాది మంది కార్మికులు కనీస జీవన భద్రత లేకుండా జీవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు ఆలోచించి, కార్మికుల జీవన ప్రమాణాలు పెరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
ప్రభుత్వాల అంకెల గారడీ
భారత్‌లో జీవన వ్యయం తక్కువగా ఉందని చెప్పేందుకు కొనుగోలు శక్తి సమానత్వం (పీపీపీ) గణాంకాలను ప్రభుత్వాలు చూపిస్తూ తమ వైఫల్యాలను కప్పి పుచ్చకుంటాయి. నామమాత్ర (నామినల్) జీడీపీ ప్రకారం భారత్‌లో తలసరి ఆదాయం సుమారు 2,800 డాలర్లు ఉన్నప్పటికీ.. పీపీపీ ప్రకారం అది 12,800 డాలర్లుగా చూపబడుతోంది. కానీ ఈ లెక్కలు ప్రజలు ఆకలి తీరే స్థాయిలో జీవించగలరనే వాస్తవాన్ని మాత్రమే ప్రతిబింబిస్తాయి. ఇక వైద్యం, విద్య, గౌరవప్రదమైన నివాసం, పొదుపు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే సాధారణ భారతీయ కార్మికుడి పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. ఒక చిన్న వైద్య అత్యవసర పరిస్థితి కూడా మొత్తం కుటుంబాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది.



